Sangakumar
-
దైవ శక్తితో క్షుద్ర శక్తి పోరు
‘‘సంగకుమార్ అన్నీ తానై వరుసగా నాలుగు సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘తాంత్రిక’ సినిమా హిట్ అవ్వాలి. యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన చిత్రం ‘తాంత్రిక’. రాజ్‌కాంత్, కార్తీక్, మనీష, సంజన, గీతాషా, ఆర్య ముఖ్య పాత్రల్లో ఎం. శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జాన్, నాగవంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. సంగకుమార్ నటించిన ‘పౌరుషం, నరసింహా ఏసీపీ, శివతాండవం’ సినిమాల ట్రైలర్స్‌ని కూడా ఇదే కార్యక్రమంలో రిలీజ్ చేశారు. నటుడు, నిర్మాత సంగకుమార్ మాట్లాడుతూ –‘‘ దైవ శక్తికీ, క్షుద్ర శక్తికీ మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ ఎం. శ్రీధర్, నటులు రాజ్‌కాంత్, సంజన మేరీ, ఎస్ఎస్ పట్నాయక్ పాల్గొన్నారు. -
పోరాటం
సంగకుమార్, సునయ జంటగా యం.యస్. వాసు దర్శకత్వంలో పుల్లూరి నవీన్‌కుమార్, బండారి కృపాల్ నిర్మించిన చిత్రం, ‘బాక్స్’. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘న్యాయంగా వ్యవహరించే విక్రమ సింహ అనే పోలీసాఫీసర్ విధి నిర్వహణలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? సంఘ విద్రోహులపై అతను ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మహీశర్ల, సంగీతం: నాగవంశీ. -
తక్కువ ఖర్చుతో పెద్ద స్థాయి సినిమా!
‘‘ ‘తురుం’ సినిమా కోసం సంగకుమార్ ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. తక్కువ ఖర్చుతో పెద్ద సినిమా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించి, చాలామందికి ఆదర్శంగా నిలిచాడు’’ అని తెలంగాణ శాసన సభ్యుడు ‘రసమయి’ బాలకిషన్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన ‘తురుం’ చిత్రం ఇటీవలే విడు దలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ దర్శకుల సంఘం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బాలకిషన్ మాట్లాడారు. తెలంగాణ సినిమాను అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అల్లాణి శ్రీధర్ చెప్పారు. చిత్ర బృందంతో పాటు తెలంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి అమరేశ్‌కుమార్, మురళి, ప్రేమ్‌రాజ్ మాట్లాడారు. -
తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాలి
‘‘తెలంగాణ ప్రాంతంలో ఎందరో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నప్పటికీ ఇన్నేళ్లూ వివక్షకు గురయ్యారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి, తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా చిత్ర నిర్మాణం జరగాలి’’ అని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సంగకుమార్ హీరోగా శ్రీధర్ దర్శకత్వంలో పీవీరావు నిర్మించిన ‘తురుం’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను మంగళవారం హైదరాబాద్‌లో స్పీకర్ వీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షులు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ వారు వివక్షకు గురయ్యారు. ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో ప్రముఖ దర్శక నిర్మాత బి. నరసింగరావు చిత్రపటానికి స్థానం కల్పించకపోవడం అన్యాయం’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ ఏర్పడగానే చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు విజయేందర్‌రెడ్డి, ‘తురుం’ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.