రేపు ఘనంగావైఎస్సార్ జయంతి
సంగారెడ్డి క్రైం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ తెలిపారు. ఆదివారం సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత జయంతిని పురస్కరించుకుని ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కార్యకర్తలకు ప్రభుగౌడ్ పిలుపునిచ్చారు. జిల్లాలోని వైఎస్సార్ విగ్రహాలకు 8వ తేదీన క్షీరాభిషేకాలు చేస్తామన్నారు.
అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. వైఎస్సార్ బతికున్నంత కాలం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పనిచేశారని కొనియాడారు. ఆయన అమలు చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరో ముఖ్యమంత్రీ అమలు చేయలేదన్నారు. అందువల్లే ఆ మహానేత ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు రుణమాఫీ, ఉచిత వైద్యం, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అనేక పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందజేసి అనేక మంది ప్రాణాలు కాపాడిన ఘనత కూడా వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ఆయన అమలు చేసిన పథకాలన్నీ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకుండా తగ్గించే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైఎస్సార్ వంటి మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.డి.ఖలీమొద్దీన్ మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ పాలన సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా నిలిచిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధాకర్‌గౌడ్, డా.వైద్యనాథ్, మసూద్ అలీ, జగదీష్, వెంకటరమణ, పరుశరాంరెడ్డి పాల్గొన్నారు.