ఎస్ఎన్ఏకు మహర్దశ
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను కలిపే సంగారెడ్డి – నాందేడ్ – అకోల (ఎస్ఎన్ఏ) జాతీయ రహదారి విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడు రాష్ట్రాలకు సరిహద్దు కూడలిగా ఉన్న జుక్కల్ నియోజకవర్గం మీదుగా ఉన్న నాందేడ్– సంగారెడ్డి డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. సదరు రహదారి విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,793 కోట్లు మంజూరు చేసింది. దాంతో 135 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మారుస్తున్నారు.
నాలుగు లైన్ల రహదారికి అనుమతి
హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి నాందేడ్ వరకు విస్తరించి ఉన్న ఎస్ఎన్ఏ డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మార్చేందు కు జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తున్న ఎస్ఎన్ఏ రోడ్డును నాలు గు లైన్లుగా విస్తరించాలని కోరారు. అంతే కాకుం డా సదరు రోడ్డు మార్గంలో ఉన్న ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్ నియోజకవర్గాలు వ్యాపార పరంగా, పరిశ్రమల పరంగా అభివృద్ధి సాధిస్తాయని కేంద్రానికి విన్నవించారు. ఎంపీ బీబీపాటిల్ విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ ఎస్ఎన్ఏ రోడ్డును నాలుగు లైన్ల రహదారికి అనుమతించారు. అంతేకాకుండా నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,793 కోట్లు మంజూరు చేసింది. మొదటి దఫాలో సదరు రహదారి విస్తరణ పనులకు ఆమోదం తెలిపారు.
పనులు ప్రారంభం
సంగారెడ్డి జిల్లా కంది నుంచి మహారాష్ట్రలోని దెగ్లూర్ వరకు ఉన్న సంగారెడ్డి – నాందేడ్ – అకోల జాతీయ రహదారి విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గడిచిన ఏడాదిన్నర నుంచి రోడ్డు సర్వే పనులు కొనసాగాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల యజమానులతో ఆర్ఆండ్బీ, రెవెన్యూ అధికారులు పలు దఫాలుగా సమావేశం అయ్యారు. విస్తరణ పనులకు భూముల కేటాయింపు పూర్తవడంతో నెల రోజుల నుంచి విస్తరణ పనులు నిర్వహిస్తున్నారు. దెగ్లూర్ నుంచి మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్, పిట్లం, నిజాంసాగర్ మండలాల మీదుగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. నాలుగు లైన్ల రహదారి కోసం ఇరువైపులా సరిహద్దులు పెట్టారు.
అంతేకాకుండా సదరు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను ఆర్అండ్బీ అధికారుల ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు. రహదారి విస్తరణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బిచ్కుందలో మాకం వేశారు. రహదారి విస్తరణ పనులను 18 నెలల కాలంలో పూర్తి చేయాలని నిర్దేశించడంతో పనులపై దృష్టి సారించారు. 2020 సంవత్సరం నాటికి నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు పూర్తయ్యేలా ఆర్అండ్బీ అధికారులు పనులు మరింత వేగవంతం చేశారు. రహదారి విస్తరణ పనులు చేపడుతుండడంతో ఆయా మండలాల ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.