వారిని వెంటనే ఖాళీ చేయించండి
ముంబై : జిల్లాలో ప్రమాదకర, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాల్లో నివసించే వారిని వెంటనే ఖాళీ చేయించాలని థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల థానేలో భవనం కూలి 11 మంది మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సంజీవ్ జైస్వాల్ గురువారం టీఎంసీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న, ముప్పై ఏళ్ల పైబడిన భవనాలు సుమారు 2,500 వరకు ఉన్నాయని, ఆయా భవనాల్లో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు తెలిపారు.
30 ఏళ్ల పైబడిన భవనాలను గుర్తింపు పొందిన ఆడిటర్లతో స్ట్రక్చరల్ ఆడిట్ చేయించాలని హౌసింగ్ సొసైటీ యజ మానులకు సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాలు 58 ఉన్నాయని, వాటిలో 38 భవనాలను ఖాళీ చేయిం చామని, సాధ్యమైనంత త్వరలో మిగ తా భవనాలను కూడా ఖాళీ చేయిస్తామని జైస్వాల్ మీడియాకు వివరించారు.
జిల్లాలో ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాలు 2,500 ఉండగా వాటిలో 25,000 మంది ప్రజలు నివసిస్తున్నారని వెల్లడించారు. నివాసితులను ఖాళీ చేయించడం, లేదా భవనాలు కూల్చేస్తామని చెప్పారు. థానే రైల్వేస్టేషన్‌కు సమీపంలోని బీ క్యాబిన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 50 ఏళ్లనాటి ఓ భవనం కూలి 11 మంది మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం కూలడానికి గల కారణాలు తెలుసుకోడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది.