sanjeeva
-
ఆత్మహత్యకు యత్నించి.. చివరికి..
పెద్దపల్లి: స్థానిక తిలక్‌నగర్‌లో నివాసముంటూ జీడీకే–1వ గనిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు తాటికొండ సంజీవ్(30) ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. ఈనెల 23న సంజీవ్ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. సంజీవ్‌కు ఆరునెలల కిత్రం ములుగుకు చెందిన అమ్మాయితో వివాహం కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. మృతుడి తల్లి విజయ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ సుగుణాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
రంగారెడ్డి: అప్పటివరకు తండ్రితో ఆటలాడుకున్న ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ఆడుతూ.. ఒక్కసారిగా ట్రాక్టర్ కింద పడి చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన మహేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహేష్ భార్య లక్ష్మీ, వారి 14 నెలల కూతురు సంజీవ ఇంటి వద్దె ఉంటున్నారు. మహేష్ కూతురితో ఆడుకుని ట్రాక్టర్ బయటకు తీయడానికి చిన్నారిని తల్లికి ఇచ్చి.. ట్రాక్టర్ వద్దకు వచ్చాడు.. ఆ సమయంలో 'నాన్నా నేను కూడా వస్తాను' అని అరుస్తూ.. చిన్నారి తండ్రి వెంట ట్రాక్టర్ వద్దకు వచ్చింది.. ఇది గమనించని మహేష్ ట్రాక్టర్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ట్రాక్టర్ వెనక టైర్ కొద్దిగా కదిలి ఆగిపోయింది. ఎందుకు కదలడం లేదని ట్రాక్టర్ దిగి చూడగా తన చిట్టితల్లి టైరుకింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
వ్యక్తి దారుణ హత్య
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామ శివారులో ఓ వ్యకి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. డిచ్పల్లికి చెందిన సంజీవ(50)ను స్థానిక దర్గా వద్దకు గురువారం అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు పని ఉందంటూ తీసుకెళ్లారు. అయితే సంజీవ శుక్రవారం విగత జీవిగా స్థానికులకు కనిపించాడు. మృతుడి శరీరంపై కత్తి పోట్లు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్ స్క్యాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. (డిచ్పల్లి)