బ్రాహ్మణ, వైశ్యుల్లో రాజకీయ చైతన్యం రావాలి
ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్
హైదరాబాద్, న్యూస్‌లైన్: బ్రాహ్మణులు, వైశ్యుల్లో రాజకీయంగా చైతన్యం రావాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అన్నారు. రాజ్యాధికారం అందని జాతులు అంతరించి పోయే ప్రమాదముందని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారని, జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికార వాటా అడగడం తప్పుకాదని నొక్కి చెప్పారు.
బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత వైశ్య, బ్రాహ్మణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ‘సామాజిక న్యాయం, జనాభా ప్రాతిపదికన రాజ్యాధికార సాధన కోసం రాజకీయ శంఖారావం’ సభలో దిలీప్ కుమార్ మాట్లాడారు. రాజకీయంగా వైశ్య, బ్రాహ్మణులు సంఘటితమై వారి ఓటు బ్యాంక్‌ను సమర్ధంగా వినియోగించుకోవాలన్నారు. జేఏసీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ.. 16 శాతం జనాభా ఉన్న వైశ్య, బ్రాహ్మణులకు జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని పార్టీలూ సీట్లను కేటాయించాలన్నారు.
చిలుకూరు బాలాజీ దేవస్థానం చైర్మన్ సౌందర్య రాజన్ మాట్లాడుతూ, దేవాలయాల పరిరక్షణ అంశాన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చేర్చాలన్నారు. జేఏసీ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఆనంద్గుప్తాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, వైశ్య అభివృద్ధికి రూపొందించిన ఆడియో సిడీ, వైశ్య జాగృతి మాస పత్రికను ఆవిష్కరించారు. సభలో మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయ్, మాజీ ఎంపీ సుదీష్ రాంబోట్ల, సినీ నటి కవిత, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్ దేశపాండే, ధన్వంతరి ఫౌండేషన్ చైర్మన్, జేఏసీ కోచైర్మన్ పతంగి కమలాకర్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు.