Saradha chitfund scam
-
‘శారదా’ స్కాం కేసులో సుప్రీం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కాగా శారదా గ్రూప్ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్ ఘోష్ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. -
చిదంబరం భార్యకు బిగుసుకుంటున్న శారదా స్కాం
పశ్చిమబెంగాల్‌తో పాటు దేశాన్నే కుదిపేసిన శారద చిట్‌ఫండ్ స్కాం ఉచ్చులో మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం భార్య నళిని చిదంబరం బిగుసుకుపోతున్నారు. ఈ స్కాం కేసులో మనీ లాండరింగ్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని నళిని చిదంబరాన్ని ఈడీ ఆదేశించింది. సెప్టెంబర్ మొదటివారంలో కోల్‌కత్తాలోని విచారణ టీమ్ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీచేసింది. శారదా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మతంగ్ సింగ్ సతీమణి మనోరంజన్ సింగ్‌కు నళిని చిదంబరం న్యాయవాదిగా నిర్వర్తించారు. ఆమె అభ్యర్థన మేరకు శారదా కేసులో నళిని వాదనలు వినిపించారు. అయితే దీనికోసం ఆమె రూ.1.26 కోట్ల ఫీజును చిట్‌ఫండ్ నుంచి పొందారని వాదనలు వినిపించాయి. దీనిపై ఆదారాలు సేకరించిన సీబీఐ, చిట్‌ఫండ్ యాజమాన్యం, మనోరంజన్సింగ్లతో పాటు, నళినీని చార్జ్‌షీట్‌లో చేర్చింది. ప్రస్తుతం శారదా కంపెనీ అకౌంట్ల నుంచి ఆమెకు నగదు బదిలీ ఎలా జరిగిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. గతంలోనే ఈ విషయంలో సీబీఐ, ఈడీ నుంచి నళిని విచారణ ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుతం కొత్త సాక్ష్యాలతో నళినీ విచారణను ఎదుర్కోబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీ
కోల్‌కతా: కోట్లాది శారదా చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల కోల్‌కతాలో బాలీవుడ్ హీరో, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తిని ప్రశ్నించారు. ఆయన వాంగూల్మాన్ని నమోదు చేశారు. శారదా గ్రూపునకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. వీటికి సంబంధించిన డీవీడీలు, సీడీలు, రికార్డులను ఈడీ అధికారులకు అందజేశారు. శారదా గ్రూపు నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని మిథున్ చక్రవర్తి చెప్పారు. వృత్తిపరంగానే శారదా గ్రూపుతో పనిచేశానని, ఎవర్నీ మోసం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని మిథున్ చక్రవర్తి చెప్పారు. శారద స్కాంకు సంబంధించి తన పాత్ర లేదని వివరించారు. -
మిత్రాకు మళ్లీ జైలు
కోల్ కతా: శారద ఛిట్ ఫండ్ కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 30 వరకు పొడిగించింది. ఆయన విధించిన జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ లభించకపోవడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. కాగా మిత్రాను మంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలయింది. శారద ఛిట్ ఫండ్ కుంభకోణంతో సంబంధముందన్న ఆరోపణలతో డిసెంబర్ 12న మిత్రాను సీబీఐ అరెస్ట్ చేసింది.