'బాలామృతం'.. విషం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ప్రచారం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న పథకాలు అమల్లో మాత్రం అత్యంత అధ్వానంగా మారిపోతున్నాయి. ఈ పథకాల కోసం ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను నిలిపేయడం వల్ల లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోతోంది. అలాంటి మరో ఆర్భాటపు పథకమే.. ‘బాలామృతం’. ఏడు నెలల వయసు నుంచి ఏడేళ్ల మధ్య చిన్నారులకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా గత నెలలో ప్రకటించిన ఈ పథకం ఆచరణలో మాత్రం దాదాపు పూర్తిగా విఫలమైంది. దీనికోసం ఏటా రూ. 250 కోట్లు వెచ్చిస్తున్నామని సర్కారు చెప్పుకొంటున్న గొప్పలేమిటో... కనీసం మూడోవంతు చిన్నారులకు కూడా పౌష్టికాహారం అందడం లేదనే నిష్ఠుర సత్యం స్పష్టంగా కళ్లకు కడుతోంది. దానికితోడు ‘బాలామృతం’ పథకం కింద అందజేస్తున్న పౌష్టికాహారంలో కలుపుతున్న పాలపొడి నాసిరకంగా ఉంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లోపం కారణంగా పలు చోట్ల చిన్నారులు వాంతులు, విరేచనాలు వంటి అస్వస్థతకు గురవుతున్నారు.
సమగ్ర కార్యాచరణ ఏది?
గోధుమలు, శనగపప్పు, వేరుశనగ, పంచదార, పాలపొడి మిశ్రమంతో ఏపీ ఫుడ్స్ బాలామృతాన్ని ప్యాకెట్ల రూపంలో తయారు చేస్తోంది. రోజుకు 100 గ్రాముల చొప్పున, 25 రోజులకు ఒక్కొక్కరికి 2.5 కేజీల ప్యాకెట్‌ను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని నిర్దేశించారు. అయితే, ఐసీడీఎస్ పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమం ఇంత వరకూ సమగ్ర కార్యాచరణకు నోచుకోలేదు. పథకం కింద అందిస్తున్న పౌష్టికాహారం ప్యాకెట్ల డిమాండ్‌కు, పంపిణీకి మధ్య ఏమాత్రం పొంతన లేదు.
ముందస్తు ప్రణాళిక కరువు..
‘బాలామృతం’ పౌష్టికాహార ప్యాకెట్ల పంపిణీ వ్యవహారంపై అధికారుల్లోనూ అయోమయం కనిపిస్తోంది. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా పథకాన్ని ప్రకటించడమే దీనికి కారణమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ‘సోయా మీల్ (సోయాబీన్ ఇతర పప్పుధాన్యాలతో కూడిన పౌష్టికాహారం)’ పొడి మాత్రమే అందించేవారు. అయితే, కొత్తగా పాలపొడిని చేర్చాలనే యోచనకు అనుగుణంగా ప్రత్యేక యంత్రాలు, ప్యాకింగ్ పరికరాలు కావాలని అధికారులు అంటున్నారు. దాంతో అక్టోబర్‌లో 1,200 టన్నులు, నవంబర్‌లో 1,800, డిసెంబర్లో 2,300 టన్నులు మాత్రమే అందించగలిగామని అధికారులు పేర్కొన్నారు.
రెంటికీ నోచని చిన్నారులు..
ఐసీడీఎస్ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 406 ప్రాజెక్టుల కింద 80 వేల అంగన్వాడీ కేంద్రాలు, 10 వేల మినీ అంగన్వాడీలున్నాయి. అందులో కేవలం 160 ప్రాజెక్టులకే ‘బాలామృతం’ సరఫరా అవుతోంది.
మిగతా ప్రాజెక్టులకు గతంలో మాదిరిగా సోయామీల్‌ను పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ, చాలా జిల్లాల్లో సోయామీల్ కూడా సరిగా అందడం లేదని సమాచారం.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రాంతంలో ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో 100 నుంచి 120 మంది చిన్నారులు ‘బాలామృతం’ ప్యాకెట్ల కోసం నమోదు చేసుకున్నారు. కానీ, ఒక్కో కేంద్రంలో సుమారు 40 మందికి సరిపడా ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి.
మెదక్ జిల్లా జోగిపేటలో ‘బాలామృతం’ ప్యాకెట్లలో తెల్లటి పురుగులు వచ్చాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. అదే గ్రామం ఎస్సీ కాలనీలో చిన్నారులకు ‘బాలామృతం’ తిన్న వెంటనే వాంతులవడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
ప్రాణాంతకమే..!
రాష్ట్రంలో చాలా చోట్ల ‘బాలామృతం’ పౌష్టికాహార ప్యాకెట్లలో అందించే పొడి నాసిరకంగా ఉంటోందని.. పురుగులు, బూజు వంటివి కనిపిస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ‘బాలామృతం’ తయారీకి ఉపయోగించే పప్పు దినుసులు నాసిరకంగా ఉండటం, బూజు పట్టిన సరుకును తయారీలో వినియోగించడమే దీనికి కారణమనే వాదన విన్పిస్తోంది. ఇందులో కలిపే పాలపొడిని గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల అమూల్ డైరీలు సరఫరా చేస్తున్నాయి. అయితే, ఆ సంస్థలు నాసిరకం పాలపొడిని సరఫరా చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పాలపొడిలో ఏమాత్రం నాణ్యత లోపించినా, నిర్ధారిత సమయం మించిపోయినా... అది విషపూరితమయ్యే ప్రమాదం ఎక్కువ. పాలపొడి ప్రమాణాల్లో తేడా వస్తే... ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు ప్రభుత్వానికి అంతర్గత నివేదికలు కూడా ఇచ్చినట్టు తెలిసింది.
అంతా బాగానే ఉంది: జేడీ
బాలామృతం పథకాన్ని ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ సరళారాజ్యలక్ష్మి తెలిపారు. నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామన్నారు. ‘బాలామృతం’ పొడిని చిన్నారులకు తినిపించేటప్పుడు శుభ్రత పాటించకపోవడమే అస్వస్థతకు కారణమన్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని చెప్పారు.