ఐటీడీఏ.. ఆగమాగం
సాక్షి, హన్మకొండ : ఏజెన్సీలో ఉండే గిరిజనుల బాగోగులు పట్టించుకోవడానికి ఉద్దేశించిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో సమీక్ష జరగాల్సి ఉంది. కానీ నాలుగేళ్లుగా ఆ ఊసే లేదు. ఇక్కడ అధికార యంత్రాంగానిది ఇష్టారాజ్యమైంది. ఏం చేసినా అడిగేవారే లేకుండా పోయారు.
విద్య, వైద్య, వ్యవసాయ, ఉపాధి రంగాలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఆఖరుకి స్వయం ఉపాధికి సంబంధించిన దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మరోవైపు అభివృద్ధి పేరుతో చేపడుతున్న పనుల్లో అవినీతి నిండిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2009లో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన చివరి పాలకమండలి సమావేశం జరిగింది.
ఐటీడీఏ పీవోగా సర్ఫరాజ్ అహ్మద్ పనిచేసినప్పుడు మూడు సార్లు పాలకమండలి సమావేశాలకు ఏర్పాట్లు చేసినా.. ప్రజాప్రతినిధులు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అవన్నీ రద్దయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత డిప్యూటీ సీఎం రాజయ్య ఐటీడీఏపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. జూన్‌లో ఏటూరునాగారం, భద్రాచలం ఐటీడీఏలలో సాధారణ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత పట్టుబట్టి శనివారం ఏటూరునాగారంలో ఐటీడీఏ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ బతుకులు మారుతాయూ అని గిరిజనులు ఎదురుచూస్తున్నారు.
పర్యవేక్షణ కరువవడంతో ఏటూరునాగారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో పాలన ఇష్టారాజ్యంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అన్వయించుకుంటున్నారు. ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం, సకాలంలో పనులు పూర్తి చేయడం కంటే... తమ పనిని చక్కబెట్టుకోవడంపైనే సిబ్బంది మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ నిత్యం కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య పంపకాల పంచారుుతీ నెలకొంటోంది.
నెల రోజుల వ్యవధిలోనే బిల్లులు చెల్లించే సమయంలో అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కాంట్రాక్టర్ల నుంచి పదికి పైగా ఫిర్యాదులు అందడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మేడారం జాతర సందర్భంగా ఐటీడీఏ తరఫున చేపట్టిన అనేక పనుల విషయంలో ఇప్పటికే వివాదాలు ముసురుకున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్‌స్టేషన్ దగ్గరి నుంచి గద్దెల ప్రాంగణం వరకు రోడ్డు నిర్మాణ పనుల విషయంలో ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఈ రోడ్డు పనులను ఐటీడీఏ శాఖ సొంతంగా చేపట్టాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఈ పనిని చేపట్టే బాధ్యతను ఓ కాంట్రాక్టర్‌కు అనధికారికంగా అప్పగించింది. పనులు జరుగుతున్న దశలోనే ముందస్తు అనుమతి లేకుండా మరో రూ.5 లక్షల విలువైన పనులను సదరు వ్యక్తికే అప్పగించినట్లుగా తెలుస్తోంది. అయితే.. బిల్లుల మంజూరు దగ్గరికి వచ్చే సరికి ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. వాస్తవానికి ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద చేపట్టిన ఈ పనులను నిబంధనల ప్రకారం గిరిజనులకు అప్పగించాలి. కానీ... డిపార్ట్మెంట్ తరఫున చేపడతామని చెప్పి... చివరకు రిజిస్టర్ కాని ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు.
22 మిల్లీమీటర్లు, 40 మిల్లీమీటర్లు మందంతో ఉన్న కంకర రాళ్లతో రోడ్డు నిర్మించాల్సి ఉండగా... తక్కువరేటుకు లంభించే నాసిరకం కంకర ఉపయోగించారు. అంతేకాదు... 950 మీటర్ల నిడివి కలిగిన ఈ రోడ్డుకు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రూ.24 లక్షల లోపు ఈ పనిని ముగించాలి. కానీ... ఇక్కడ రూ 35.50 లక్షలు చెల్లించారు. ఈ బిల్లుల చెల్లింపులో ఇరువర్గాల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.
శాఖ తరఫున చేపట్టిన పనిలో క్వాలిటీ కంట్రోల్, ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్, వివిధ రకాల పన్నుల పేరుతో తనకు రావాల్సిన రూ 4.5 లక్షలను అధికారులు వారి వద్దే అట్టిపెట్టుకున్నారంటూ ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం సూపరింటెండెంట్ చినబాబుకు కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడు. తర్వాత బిల్లులు ఇస్తామంటూ.. మంజూరు లేకపోయినా తన చేత రూ.5 లక్షల విలువైన పనులను అదనంగా చేయించారని, ఇప్పుడా మాట ఎత్తడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.