చెన్నై కోసం జాక్వెలిన్‌తో...
తమిళనాడు ప్రజలకు 2015 చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల చెన్నై, ఆ నగర పరిసర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా వరదల కారణంగా నిత్యావసర వస్తువుల కోసం చెన్నై ప్రజలు నానాపాట్లు పడ్డారు. వీరిని ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలూ ముందుకు వచ్చి, తమ వంతు సాయం చేశాయి. తెలుగు సినీ తారలు ‘మన మద్రాస్ కోసం’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విరాళాలు అందించడంతో పాటు కొంత కాలం పాటు హైదరాబాద్ నుంచి నిత్యావసరాల వస్తువులను చెన్నైకు పంపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి షారుఖ్‌ఖాన్, అక్షయ్‌కుమార్ లాంటి వాళ్లు కూడా కోటి రూపాయలు చొప్పున విరాళాలు అందజేశారు.
లేటెస్ట్గా బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ‘ఎన్జీవో హ్యాబిటెట్ ఫర్ హ్యూమానిటీ’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి వరద బాధితులకు ఇళ్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. కనీసం పదివేల కుటుంబా లకు ఇళ్లు కట్టివ్వాలన్నది ఆమె సంకల్పం. జాక్వెలిన్ చేస్తున్న సహాయం గురించి తెలుసుకున్న హృతిక్ రోషన్ కూడా ఈ కార్యక్ర మంలో భాగస్వామ్యం కావాలనుకున్నారు.
అందుకే తన వంతుగా కొంత మొత్తాన్ని జాక్వెలిన్‌కు పంపించారు. ఈ విషయాన్ని జాక్వెలిన్ ట్విటర్లో తెలిపారు. ‘‘బాలీవుడ్ నుంచి నా స్నేహితులు, నా సహనటులు చెన్నై కోసం సహకారం అందించారు. ఇప్పుడు హృతిక్ మా ప్రయత్నానికి స్పందించడం నాకు దక్కిన పెద్ద బహుమతిగా భావిస్తున్నాను’’ అని ఆనందం వ్యక్తం చేశారు జాక్వెలిన్.