Satellite Internet
-
ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్!
ఎక్స్. కామ్ అధినేత ఎలాన్ మస్క్‌కు హ్యాకర్లు ఝలక్ ఇచ్చారు. తమ దేశంలోనూ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలని వార్నింగ్ ఇస్తూ సూడాన్‌కు చెందిన యాకర్లు ఎక్స్. కామ్‌ను హ్యాక్ చేశారు. ఆపై సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ పనిచేయకుండా బ్లాక్ చేశారు. సుడాన్‌లోని ఓ రహస్య హ్యాకర్స్ బృందం ప్రపంచంలోని 12కు పైగా దేశాల్లో ఎక్స్. కామ్ పని చేయకుండా 2 గంటల పాటు నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రో బ్లాగింగ్ సైట్లో తలెత్తిన అంతరాయంతో యూజర్లు ఇబ్బంది పడినట్లు బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ నివేదించింది. ‘ఎలాన్ మస్క్‌కు మేమిచ్చే మెసేజ్ ఇదే. సూడాన్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలంటూ హ్యాకర్స్ గ్రూప్ టెలిగ్రాం ఛానల్లో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.ఎక్స్. కామ్‌ను తమ అదుపులోకి తీసుకోవడంతో యూకే, యూఎస్‌కు చెందిన 20,000 మంది తమకు ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటిటెక్టర్ తెలిపింది. ఎక్స్.కామ్ హ్యాకింగ్‌కు కారణం అయితే, జరిగిన అంతరాయాన్ని ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించలేదు. ఈ సందర్భంగా హ్యాకింగ్ గ్రూప్ సభ్యుడు హోఫా మాట్లాడుతూ.. సూడాన్‌లో కొనసాగుతున్న సివిల్ వార్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో డిస్ట్రిబ్యూటెడ్ డెనిషన్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) హ్యాకింగ్ దాడి జరిగింది. కానీ ఇంటర్నెట్ పనితీరు కారణంగా మా నినాదాన్ని గట్టిగా వినిపించ లేకపోతున్నాం. తరచుగా ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపాడు. కాబట్టే తమకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలం అవసరమని పేర్కొన్నాడు. ప్రిగోజిన్‌కు వ్యతిరేకంగా హ్యాకింగ్ గ్రూప్‌కు రష్యా సైబర్ మిలటరీ యూనిట్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే రష్యాతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆ సంస్థ ఖండించింది. పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పారామిలటరీని అంతం చేయడానికి రష్యా ప్రభుత్వానికి మద్దతుగా ఈ హ్యాకింగ్ గ్రూప్ జూన్‌లో ఓ మెసేజ్‌ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హ్యాకింగ్ గ్రూప్ గతంలో ఫ్రాన్స్, నైజీరియా, ఇజ్రాయెల్, అమెరికాలో అలజడి సృష్టించింది. -
ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్‌ల మధ్య పంతం!,ఎవరి మాట నెగ్గుతుందో?
ప్రధాని నరేంద్ర మోదీ గత వారం అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనే ఇప్పుడు ప్రపంచ వ్యాపార దిగ్గజాల మధ్య పంతానికి దారితీసింది? ప్రజలకు సేవలందించే విషయంలో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు? తమ మాటే నెగ్గాలని ఒకరంటుంటే? లేదు మాటిచ్చాం..నెరవేర్చుకుంటాం అని మరొకరంటున్నారు? మోదీ అమెరికా పర్యటనతో భారత్‌లో ఇండస్ట్రీలిస్ట్ల మధ్య పంతాలెందుకు వస్తాయి? తమ మాటే ఎందుకు నెగ్గించుకోవాలనుకుంటారు? ఆ కథా కమామిషూ ఏంటో తెలుసుకుందాం పదండి. గత కొన్నేళ్లుగా భారత్‌లో అడుగుపెట్టేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్కు చెందిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విభాగం స్టార్‌లింక్‌కు మోదీ అమెరికా పర్యటన ఊతమిచ్చింది. గతంలో లైసెన్స్ లేదన్న కారణంగా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించే స్టార్‌లింక్‌కు కేంద్రం అడ్డు చెప్పింది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శాటిలైట్ బ్రాండ్‌బ్యాండ్‌ను అందించేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. అంత సులభం కాదు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టెస్లా ఎలక్ట్రిక్ కార్యకలాపాలతో పాటు స్టార్‌లింక్ సేవల్ని భారత్‌లో అందించే ఆలోచనలో ఉన్నట్టు మస్క్ తెలిపారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్తో దేశంలోని మారుమూల ప్రాంతాలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ప్రారంభించడం మస్క్‌కు అంత సులభమయ్యేలా కనిపించడం లేదంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాల సాయంతో ఇంటర్నెట్ సేవలు అందించే విషయంలో ముఖేష్ అంబానీ నుంచి మస్క్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. ఎందుకంటే? శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు మస్క్ కేవలం అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మస్క్‌తో పాటు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్,టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా, భారతీ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్టెల్ సంస్థ ఛైర్మన్ సునీల్ మిట్టల్ సైతం అదే బాటులో పయనిస్తున్నారు. పట్టుబడుతున్న ముఖేష్ అంబానీ స్పెక్ట్రం అనేది మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీల శ్రేణి. ఇప్పుడీ ఈ స్ప్రెక్టంను వేలం వేయాలని అంటున్నారు ముఖేష్ అంబానీ. శాటిలైట్ సేవలందించే విదేశీ సంస్థలు సైతం స్ప్రెక్టం వేలంలో పాల్గొనాలని పట్టుబడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. లైసెన్స్ ఇస్తే దేశీయ సంస్థలతో - విదేశీ కంపెనీలు పోటీ పడతాయి. అదే ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొంటే పోటీని అరికట్టవచ్చనేది వాదన. కాబట్టే, వాయిస్ ,డేటా సేవలను అందించడానికి విదేశీ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్లు స్పెక్ట్రమ్ వేలంలో తప్పని ఉండాలని అంబానీకి చెందిన రిలయన్స్ చెబుతోంది. అయితే, ఎవరి పోటీ ఎలా ఉన్నా చివరిగా.. భారత ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయం మీద ఆధారపడి ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ స్పెక్ట్రం విభాగంలో కేంద్ర విభాగానికి చెందిన ట్రాయ్ ముఖ్య పాత్ర పోషించనుంది. కేంద్రానిదే తుది నిర్ణయం ఇక, భారత ప్రభుత్వం 2010 నుంచి మొబైల్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తుండగా.. ఫలితంగా కేంద్రానికి 77 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6 లక్షల కోట్లు) వచ్చాయి. టెక్నాలజీ పెరగడం, ప్రస్తుతం ఆయా సంస్థలు శాటిలైట్ సేవల్ని అందించేందుకు పోటీపడుతున్నాయని పెట్టుబడుల సంస్థ సీఎల్ఎస్ఏ చెబుతోంది. ఈ సమస్యపై సెక్టార్ రెగ్యులేటర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పలు సంస్థలతో చర్చలు జరపగా..అమెజాన్ కైపర్, టాటా, ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ వేలానికి వ్యతిరేకంగా ఉండగా, రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా వేలానికి మద్దతు ఇస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తుది నిర్ణయాన్ని కేంద్రం వెల్లడించాల్సి ఉంది. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
భారత్‌తో ఎలాన్ మస్క్ చర్చలు.. ప్రధాని మోదీ అందుకు ఒప్పుకుంటారా?
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శాటిలైట్ సంబంధిత ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీస్(జీఎంపీసీఎస్) లైసెన్స్ కోసం కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) వద్ద అప్లయి చేసినట్లు సమాచారం. ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా 32దేశాల్లో అందిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, కెనడా,మెక్సికో, యూరప్, యూరప్, సౌత్-నార్త్ అమెరికాలోని కొన్ని దేశాలతో పాటు ఓషియానా(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)లలో సేవలు అందుతున్నాయి . ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ బెస్ట్ కంట్రీగా భావించి.. గతేడాది ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సేవల కంటే ముందు బుక్సింగ్ సైతం స్టార్‌లింక్ ప్రారంభించింది. అయితే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేశారు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈ తరుణంలో ఎలాన్ మస్క్ గత వారం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేలా జీఎంపీసీఎస్ కోసం అప్లయి చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. జీఎంపీసీఎస్ లైసెన్స్‌తో పాటు భారత డిపార్టెమెంట్ ఆఫ్ స్పేస్ అప్రూవల్ పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి లభిస్తే స్పేస్ ఎక్స్ భారత్‌లో శాటిలైట్ గేట్‌వేస్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ ఒప్పుకుంటారా? ఎలాన్ మస్క్ చైనా నుంచి టెస్లా కార్లను దిగుమతి చేసి భారత్‌లో అమ్మకాలు జరపాలని అనుకున్నారు. కానీ మస్క్ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. టెస్లా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలనుకుంటే సమస్య ఏదీ లేదని, చైనా నుంచి మాత్రం కార్లను దిగుమతి చేయకూడదని కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆ తర్వాత భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్లను ఎప్పుడు ప్రారంభించనున్నారు అని ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ స్పందించారు. టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను భారత్‌లో నిర్మించే ఆలోచన లేదు. మొదట మా కార్ల విక్రయాలు, సర్వీసులకు అనుమతించని ఏ ప్రాంతంలోనూ టెస్లా ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పబోదని మస్క్ ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో కేంద్రం అనుమతి ఇస్తుందా? లేదా అని తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది. చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత! -
‘ఎలాన్ మస్క్’కు కేంద్రం భారీ షాక్, దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు!
భారతీయులకు శుభవార్త.త్వరలో మనదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ సంస్థ దేశంలో తొలిసారి హై త్రూపుట్ శాటిలైట్ (హెచ్‌టీఎస్)బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే..దేశంతో పాటు రూరల్ ఏరియాల్లో సైతం హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను వినియోగించుకునే అవకాశం కలగనుంది. శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ హ్యూస్ కమ్యూనికేషన్స్ భారత్‌లో తొలిసారి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇస్రో ద్వారా హై త్రూపుట్ శాటిలైట్ (HTS) బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే ఈ శాటిలైట్ సేవల్ని అందించేందుకు ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు అవసరమైన అనుమతుల్ని ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించింది. ఇప్పుడు అదే శాటిలైట్ సర్వీసుల్ని అందించేందుకు కేంద్రం హ్యూస్ కమ్యూనికేషన్‌కు అనుమతి ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. మాలక్ష్యం అదే దేశంలో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని అందించడమే హ్యూస్ సంస్థ లక్ష్యం. టెర్రెస్ట్రియల్ (terrestrial) నెట్ వర్క్‌ల తరహాలో వినియోగించే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులతో ఎంటర్ ప్రైజెస్, గవర్న్మెంట్ నెట్‌వర్క్‌లను అనుసంధానం కానున్నాయి. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు డిజిటల్ విభజనను తగ్గించడంలో సహాయపడటానికి ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి పని చేసే మార్గాలను అన్వేషించడానికి, విస్తరించడానికి మేం కట్టుబడి ఉన్నాము" అని స్పేస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ,ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ అన్నారు. -
గుడ్ న్యూస్: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు..ఎప్పటి నుంచంటే!
న్యూఢిల్లీ: భారతీ గ్రూపు ప్రధాన వాటాదారుగా ఉన్న ‘వన్ వెబ్’ ఇస్రో వాణిజ్య కంపెనీ అయిన ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’తో ఒప్పందం చేసుకుంది. దీంతో వన్‌వెబ్ తన శాటిలైట్ల విడుదల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. న్యూ స్పేస్ ఇండియాతో కలసి వన్‌వెబ్ మొదటి శాటిలైట్ లాంచ్ కార్యక్రమం 2022లోనే శ్రీహరికోటలోని షార్ నుంచి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శాటిలైట్ నెట్వర్క్ అభివృద్ధికి, సురక్షితమైన అనుసంధానాన్ని కల్పన కోసం పనిచేస్తున్నట్టు వన్‌వెబ్ ప్రకిటించింది. అంతరిక్ష రంగంలో సహకారానికి మరొక చరిత్రాత్మక రోజుగా పేర్కొంది.‘‘శాటిలైట్ల ఆవిష్కరణ విషయంలో తాజా ఒప్పందం, వన్‌వెబ్ నెట్ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. అంతర్జాతీయంగా కమ్యూనిటీలను అనుసంధానించాలన్న మా ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు అంతరిక్షం రంగంలో మేము కలసి పనిచేస్తాం’’అని వన్‌వెబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. కజకిస్థాన్‌లో రష్యా నిర్వహించే బైకోనర్ కాస్మోడ్రోన్ నుంచి శాటిలైట్ల ఆవిష్కరణను నిలిపివేస్తున్నట్టు వన్‌వెబ్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన నేపథ్యంలో తాజా ఒప్పందం కుదరడం గమనార్హం. శాటిలైట్లు, టెక్నాలజీని సైనిక అవసరాలకు వినియోగించబోమంటూ హామీ ఇవ్వాలని రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్‌కాస్మోస్ కోరడమే ఈ నిర్ణయం వెనుక కారణం. తక్కువ కక్ష్యలో పరిభ్రమించే శాటిలైట్ల సాయంతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే సంస్థే వన్‌వెబ్. మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన నెట్ సేవలు అందించొచ్చు. ఈ కంపెనీలో భారతీ గ్రూపు పెద్ద వాటాదారుగా ఉండగా, బ్రిటన్ ప్రభుత్వానికి సైతం వాటాలున్నాయి. భారత్‌లో వన్‌వెబ్‌కు లైసెన్స్ భారత్ మార్కెట్లో శాటిలైట్ సేవలు అందించేందుకు వన్‌వెబ్ కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ సంపాదించింది. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్‌ను వన్‌వెబ్‌కు టెలికం శాఖ మంజూరు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2022 మధ్య నుంచి భారత్ మా ర్కెట్లో సేవలు అందించాలన్న వన్‌వెబ్ లక్ష్యం తాజా లైసెన్స్ రాకతో సాకారం కానుంది. చదవండి👉 భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..! -
పుతిన్‌కు ఎలన్ మస్క్ భారీ షాక్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ రష్యాకు భారీ షాకిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలస్కీతో మంతనాలు జరిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో జెలస్కీ..,ఎలన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రష్యాతో యుద్ధం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో జెలెన్ స్కీ..ఎలన్ మస్క్‌తో జూమ్ కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ తమదేశానికి రావాలంటూ ఎలన్ మస్క్‌ను ఆహ్వానించారు. దీంతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరిపారు. ఈ సంభాషణల సమయంలో రష్యా వార్తా వనరులను నిరోధించాలని స్టార్‌లింక్‌ను కొన్ని ప్రభుత్వాలు (ఉక్రెయిన్ కాదు) కోరాయని ఎలన్ మస్క్ తెలిపారు. యుద్ధం తర్వాత మాట్లాడుతా! ఉక్రెయిన్ ప్రభుత్వం ఎలన్ అందిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగిస్తుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే రష్యా దాడిలో ధ్వంసమైన ప్రాంతాల్లో స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొని రావాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రధాని మస్క్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అంతేకాదు స్పేస్ ప్రాజెక్ట్‌ల గురించి ఎలన్ మస్క్‌తో చర్చించాను. ఆ చర్చలపై యుద్ధం తర్వాత మాట్లాడతానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Talked to @elonmusk. I’m grateful to him for supporting Ukraine with words and deeds. Next week we will receive another batch of Starlink systems for destroyed cities. Discussed possible space projects 🚀. But I’ll talk about this after the war. — Володимир Зеленський (@ZelenskyyUa) March 5, 2022 మండిపడుతున్న పుతిన్ మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని ఎలన్ ఖండించకపోయినా.. ఉక్రెయిన్‌కు సహకరిస్తున్నారు. ఈ తాజా పరిణామాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్కు మింగుడు పడడం లేదని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు జెలస్కీతో మస్క్ సంప్రదింపులు జరపడాన్ని రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్తో పాటు ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లపై నిషేధం విధించింది. చదవండి: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం: 'పుతిన్‌ను ఎలిమినేట్ చేయండి సార్'! -
కష్ట కాలంలో టోంగా దేశానికి అండగా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్..!
కొద్ది రోజుల క్రితం టోంగాకు సమీపంలో ఉన్న సముద్రంలో ఒక భారీ అగ్నిపర్వతం బద్దలవడంతో ఆకాశమంతా ధూళి మేఘాలతో నల్లబారడం, ఆ వెంటనే విరుచుకుపడిన జల ప్రళయం(సునామీ)తో ఈ చిన్న టోంగా దేశం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతి విలయం సృష్టించిన నష్టం అంచనాలకు చిక్కడం లేదు. ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్స్ నెట్వర్క్ తెగిపోవడంతో ఆ దేశంతో ఇతర దేశాలు సంప్రదించడానికి కొంచె కష్టం అవుతుంది. ఈ విపత్తుల వల్ల సముద్రగర్భ కేబుల్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ దేశానికి ఇంటర్నెట్ సేవలు తిరిగి అందించడానికి కనీసం ఒక నెల పాటు సమయం పడుతుందని రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది. ట్విటర్ వేదికగా పోస్టు చేసిన ఈ నివేదికకు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ట్విట్టర్లో స్పందించారు. ఆ దేశ ప్రజలు కోరితే స్టార్ లింకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్దంగా ఉన్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఉత్తరం న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యుడు షేన్ రెటి కూడా టోంగా దేశానికి స్టార్ లింక్ కమ్యూనికేషన్ సేవలను అందించాలని ఎలన్ మస్క్‌కు ట్విటర్ వేదికగా ఒక లేఖ రాశారు. Could people from Tonga let us know if it is important for SpaceX to send over Starlink terminals? — Elon Musk (@elonmusk) January 21, 2022 ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ అనేది ఎటువంటి కేబుల్ అవసరం లేకుండానే ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్ అందిస్తుంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వేగం కూడా ఇతర వాటితో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది. ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించాలని మస్క్ చూస్తున్నారు. టోంగాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. టోంగాకు పశ్చిమంగా పసిఫిక్ సముద్రంలో తలెత్తిన సునామీ టోంగాను ముంచెత్తింది. పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడ్డాయి. సునామీ కూడా ఉపశమించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు అగ్ని పర్వతం నుండి విస్ఫోటనాలు కొనసాగుతుండడంతో అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆ ప్రభావంతో చుట్టుపక్కల వాతావరణంలో నెలకొనే ప్రభావాల పట్ల పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న టోంగాకు సాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. (చదవండి: సరికొత్త విప్లవం: అమెజాన్ బట్టల దుకాణం) -
స్టార్ లింక్‌కు షాక్.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక అడుగు..!
మన దేశంలో అందరి కంటే ముందుగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని చూసిన స్టార్ లింక్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ లింక్ కంటే ముందే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు వన్ వెబ్ సిద్దం అవుతుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అంధించడానికి ప్రముఖ నెట్వర్క్ సంస్థ భారతి ఎయిర్టెల్, యుకె ప్రభుత్వ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ వన్ వెబ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ హ్యూస్ వ్యూహాత్మక ఆరు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం మీద సంతక చేశాయి. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి హైదరాబాద్‌కి చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్లో ఎయిర్టెల్ సుమారు 33 శాతం, హ్యూస్ కమ్యూనికేషన్స్ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ భారత్‌లో శాటిలైల్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు. ముఖ్యంగా ఫైబర్ కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వన్ వెబ్ నెట్వర్క్ పట్టణాలు, గ్రామాలు, స్థానిక & ప్రాంతీయ మున్సిపాలిటీలలోని కష్టతరమైన ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించగలదు అని కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. 2022 చివరలో ప్రారంభం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఎయిర్టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్‌తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్ ఆపరేటర్‌గా హ్యూస్ కమ్యూనికేషన్స్ నిలుస్తోంది. బ్యాంకింగ్, ఏరోనాటికల్, మేరీటైమ్ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ వల్ల దేశంలోని లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించవచ్చు అని వన్ వెబ్ సీఈఓ నీల్ మాస్టర్సన్ తెలిపారు. ఈ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల 2022 చివరి నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?) -
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక నిర్ణయం..!
స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను భారత్‌లో అందించేందుకు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సిద్దమైన విషయం తెలిసిందే. పలు కారణాలతో స్టార్‌లింక్ పనులు భారత్‌లో నత్తనడకన సాగుతున్నాయి. ఇదిలా ఉండగా స్టార్‌లింక్‌కు పోటీగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలపై పలు టెలికాం సంస్థలు కూడా కన్నేశాయి. భారత్‌లో శాటిలైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా సన్నద్ధమైంది. జాయింట్ వెంచర్ ఏర్పాటు..! శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి హ్యూస్ కమ్యూనికేషన్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ జాయింట్ వెంచర్లో ఎయిర్టెల్ సుమారు 33 శాతం, హ్యూస్ కమ్యూనికేషన్స్ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ భారత్‌లో శాటిలైల్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నాయి. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఎయిర్టెల్,హ్యూస్ కమ్యూనికేషన్స్‌తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్ ఆపరేటర్‌గా హ్యూస్ కమ్యూనికేషన్స్ నిలుస్తోంది. బ్యాంకింగ్, ఏరోనాటికల్, మేరీటైమ్ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది.. చదవండి: రిలయన్స్ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..? -
భారత్‌లో ఎలన్ మస్క్‌కి ఎదురు దెబ్బ
TRAI Barred Elon Musk's Starlink Broadband Pre Orders in India: అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి భారీ షాకిచ్చింది భారత ప్రభుత్వం. మానసపుత్రిక స్పేఎస్‌ఎక్స్ అందించే బ్రాడ్‌బాండ్ సర్వీస్‌కు భారత్ నుంచి ముందస్తు ఆర్డర్స్ తీసుకోకుండా నిషేధించింది. అంతేకాదు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్కు ఎవరూ ప్రీ ఆర్డర్లతో సబ్ స్క్రయిబ్ కావొద్దంటూ భారతీయులకు సూచించింది కేంద్ర సమాచార శాఖ. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో ఆకట్టుకోవాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. తాజాగా లైసెన్స్ లేకుండా స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం(Department of Telecommunications (DoT).. స్టార్ లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్ఎక్స్కు సూచించింది. అంతేకాదు స్టార్‌లింక్‌ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు సంజయ్ భార్గవ నిరాకరించారు. ఇదిలా ఉంటే స్టార్‌లింక్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది స్టార్‌లింక్. ఇక భారత్‌లో స్టార్‌లింక్‌కు మొదటి నుంచే ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ బిడ్‌ను తిరస్కరించాలని కోరుతూ బ్రాడ్‌బాండ్ అసోసియేషన్‌లోని వన్‌వెబ్(ఇది కూడా స్పేస్ ఆధారిత సేవలు అందించేదే!), అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ తదితర కంపెనీలు ట్రాయ్, ఇస్రోలకు లేఖలు రాశాయి కూడా. చదవండి: 'జియో' కంటే తక్కువ ధరకే Starlink శాటిలైట్ ఇంటర్నెట్..! -
ఉప గ్రహాలకు ఉప ద్రవం
మనం వాడుతున్న సాంకేతికతకు... జీపీఎస్, మొబైల్ ఫోన్ల నుంచి అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థల వరకు అంతరిక్షంలో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహాలే కీలకం. మరి ఉన్నట్టుండి వాటికేమైనా అయితే? వామ్మో ఇంకేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు ఏదో ఉపద్రవం వచ్చిపడబోతోందని కాదుకానీ... భూకక్ష్యలో రద్దీ ఎక్కువమవుతోంది. ఎవరి అవసరాని కొద్దీ వారు ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఎలన్‌మస్క్ అయితే స్టార్‌లింక్ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు శ్రీకారం చుట్టేశారు. లెక్కకు మిక్కిలి బుల్లి శాటిలైట్లను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేస్తున్నారు. వీటన్నింటినీ మోసుకెళ్తున్న రాకెట్ల శకలాలు కొన్ని భూమి మీదపడగా... మిగతా కొన్ని విడిభాగాలు అలా భూకక్ష్యలో తేలియాడుతున్నాయి. అలాగే కాలం చెల్లిన శాటిలైట్లు... వాటినుంచి వేరుపడుతున్న విడిభాగాలు కూడా. ఇవే ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రష్యా తాము 1982లో ప్రయోగించిన ‘కాస్మోస్–1408’ ఉపగ్రహం నిరర్ధకంగా మారిందని ఈనెల 15వ తేదీన ఓ మిస్సైల్ ద్వారా దాన్ని పేల్చివేసింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎస్ఎస్) 80 కిలోమీటర్ల పైభాగంలో ఇది జరగడం గమనార్హం. భూమి లేదా విమానం నుంచి మిస్సైల్‌ను ప్రయోగించి భూకక్ష్యలోని వెళ్లాక దాని గమనాన్ని నియంత్రించి లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేస్తారు. రష్యా శాటిలైట్ పేలిపోవడంతో 1,500 పైచిలుకు శకలాలు అంతరిక్షంలోకి విరజిమ్మబడ్డాయి. ఎఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాములను రెండు గంటలపాటు సురక్షితంగా క్యాప్యూల్స్లోకి వెళ్లి తలదాచుకోమని నాసా హెచ్చరించాల్సి వచ్చింది. రష్యా చర్యను తీవ్రంగా ఖండించింది కూడా. గతంలో అమెరికా, చైనా, భారత్‌లు కూడా ఇలాగే భూకక్ష్యలోని తమ పాత ఉపగ్రహాలను పేల్చేశాయి. ఎంత చెత్త ఉంది... భూమి దిగువ కక్ష్యలో దాదాపు 9,600 టన్నుల చెత్త (విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, నట్లు, బోల్టులు తదితరాలు) పేరుకుపోయిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) అంచనా. సాఫ్ట్ బాల్ సైజులో ఉన్న భాగాలు 23 వేలు ఉంటాయని నాసా లెక్క. సెంటీమీటరు పరిమాణంలో ఉండేవి ఐదు లక్షల పైచిలుకే ఉంటాయి. ఇవి గంటకు ఏకంగా 25,265 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్తుంటాయి. ఈ శకలాలు ఒకరోజులో భూమి చుట్టూ 15 నుంచి 16 సార్లు పరిభ్రమిస్తాయి. ఈ వేగంతో వెళుతున్నపుడు ఎంత చిన్నశకలమైనా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొడితే కలిగే నష్టాన్ని ఊహించగలమా? విస్పోటం లాంటిది సంభవించే అవకాశం ఉంటుంది. శాటిలైట్లను తాకితే అవి తునాతునకలైపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణంగా భూమికి వెయ్యి కిలోమీటర్ల ఎత్తుల్లో కక్ష్యలో సమాచార, పరిశోధక ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. వీటికి ఈ మానవ జనిత చెత్త, శకలాల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మునుముందు శాటిలైట్ ప్రయోగాలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి... చెత్త పేరుకుపోయే... ముప్పు మరింత పెరుగుతుంది. భూకక్ష్యను దాటివెళ్లే అంతరిక్ష ప్రయాణాలకు వీటివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. భూమి కక్ష్యలో 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే చెత్త క్రమేపీ కొన్నేళ్లలో కిందికి దిగజారుతూ భూమిపైకి పడిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చెబుతోంది. కాకపోతే వెయ్యి కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమించే శకలాలే 100 ఏళ్లు.. ఇంకా అంతకుపైనే తిరుగుతూ ఉంటాయట. వీటితోనే ముప్పు. పైగా భవిష్యత్తులో ఇలాంటి శకలాల నుంచి ముప్పు తప్పించుకునే సాంకేతికతలను శాటిలైట్లకు జోడించాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం 5 నుంచి 10 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తానికి భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ మానవ జనిత చెత్తతో మనకు చిక్కొచ్చిపడుతోంది! – నేషనల్ డెస్క్, సాక్షి -
భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..!
భారతీయులకు శుభవార్త. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది.అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్ను అందించిన మొబైల్ నెట్వర్క్ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్ మస్క్ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్ యూజర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు అతితక్కువ ధరకే లభించనున్నాయి. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఎలా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతుండగా.. స్టార్ లింక్ స్పందించింది. భారతీయులకు అనుగుణంగా శాటిలైట్ ఇంటర్నెట్ను సబ్సిడీకి అందివ్వనున్నట్లు తెలిపింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మనదేశంలో స్టార్‌లింక్ తన సబ్స్క్రిప్షన్ ప్లాన్లను సబ్సిడీ రేట్లతో అందించే ఆలోచనలో ఉన్నట్లు స్టార్లింక్కి ఇండియా హెడ్ సంజయ్ భార్గవ తెలిపారు. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర తక్కువగా ఉంటాయని అన్నారు. వినియోగదారులు చెల్లించే ధరలకంటే అందించే సేవలు ఎక్కువగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ లింక్ ప్రస్తుతం దేశంలోని అంతర్గత ప్రాంతాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. తక్కువ ధర, సరైన సదుపాయల్ని కల్పించడం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ రూపురేకల్ని మార్చవచ్చని అన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు స్పేస్ఎక్స్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. బుకింగ్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ.7,500 డిపాజిట్ చెల్లించాలి.అలా చెల్లించిన వారికి ప్యాకేజీలో భాగంగా, స్టార్‌లింక్ డిష్ శాటిలైట్, రిసీవర్, సెటప్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుంది. ప్రారంభంలో ఇంటర్నెట్ స్పీడ్ 100-150ఎంబీపీఎస్ పరిధిలో ఉంటుంది. అయితే, తక్కువ భూ కక్ష్యలో మరిన్ని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపడం ద్వారా ఇంటర్నెట్ వేగం జీబీపీఎస్‌కి చేరుకోవచ్చని స్టార్‌లింక్ ప్రతినిధులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభదశలోఉండగా..వచ్చే ఏడాది జూన్ జులై నాటికి కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. 100 స్కూళ్లకు ఉచితం నివేదికలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సెటప్‌ను స్టార్‌లింక్ సంస్థ 100 పాఠశాలలకు ఉచితంగా అందజేస్తుందని, వాటిలో 20 సెటప్‌లు ఢిల్లీ పాఠశాలలకు, మిగిలిన 80 సెటప్‌లు ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు స్టార్‌లింక్ ఇండియా బాస్ సంజయ్ భార్గవ స్పష్టం చేశారు. -
శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం
ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న యుకె ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ వన్ వెబ్ సంస్థలో భారతి ఎయిర్టెల్ భారీగా వాటాను కొనుగోలు చేసిన మనకు తెలిసిందే. వన్ వెబ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. అటువంటి వన్ వెబ్ ప్రాజెక్టు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురుంచి భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. "భారత నేల నుంచి వన్ వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మేము(వన్ వెబ్) ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాము. ఈ రోజు ఈ ఒప్పందం గురుంచి మీ అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని సునీల్ మిట్టల్ చెప్పారు. అసలు ఏమిటి వన్ వెబ్ ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రపంచంలో అన్నీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం కేబుల్స్ వేయడం, టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం వన్ వెబ్ ప్రాజెక్టు పేరుతో లండన్ కేంద్రంగా 2012లో జార్జివేలర్ అనే వ్యక్తి స్థాపించాడు. అయితే, ఆ కంపెనీ దివాళా తీసే సమయంలో మన దేశ దిగ్గజ టెలికామ్ కంపెనీ, యుకె ప్రభుత్వం అందులో భారీ వాటాను దక్కించుకున్నాయి. (చదవండి: ఎంజీ ఆస్టార్ వచ్చేసింది. ధర ఎంతంటే?) ఇప్పుడు ఆ ప్రాజెక్టు శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి దశలో 150 కిలోల బరువున్న 650 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 322 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించేవారు. కానీ, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం చేసుకుంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. వన్ వెబ్ కీ పోటీగా స్పేస్ ఎక్స్ స్టార్ లింకు ప్రాజెక్టు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభించింది. -
దేశంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో స్టార్ లింక్ సేవలు
స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలలో ప్రారంభించనున్నట్లు ఒక సంస్థ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. స్టార్ లింక్ ప్రాజెక్టు కింద ఉపగ్రహాల సహాయంతో మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అందించాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. హాథోర్న్, కాలిఫోర్నియా ఆధారిత సంస్థ స్పేస్ఎక్స్ 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించాలని అంచనా వేసింది. రాబోయే భవిష్యత్తులో ఈ సేవలను కల్పించడానికి భారతదేశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం దేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తుందని ఇండియా స్టార్ లింక్ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఒక పోస్టులో తెలిపారు. శాసనసభ్యులు, మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశం కానున్నట్లు ఆయన సూచి౦చారు. దేశంలో స్టార్ లింక్ వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవను స్పేస్ఎక్స్ నియమించింది. స్టార్ లింకు ప్రాజెక్టు కింద మొదట ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 2018లో స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు!) స్టార్ లింక్ ప్రస్తుతం 1,600కు పైగా ఉపగ్రహాలను కలిగి ఉంది. వీటి ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి స్పేస్ ఎక్స్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, పోర్చుగల్, యుకె, యుఎస్ వంటి ఇతర 14 దేశాలలో బీటా టెస్టింగ్ కనెక్టివిటీ ప్రారంభించింది స్పేస్ ఎక్స్. స్టార్ లింక్ డిసెంబర్ 2022 నాటికి భారతదేశంలో 2 లక్షల మందికి చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది అని భార్గవ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే 5,000 టెర్మినల్స్ కోసం ముందస్తుగా ఆర్డర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ.7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ నేరుగా పోటీపడనుంది. -
సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..!
ఇంటర్నెట్ అనగానే మనకు సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు, ఇళ్లలో వైఫైలు గుర్తొస్తాయి. కానీ.. ఇక ముందు అవేమీ ఉండవు. సెల్ సిగ్నల్‌తో పనిలేకుండా నేరుగా ఫోన్లకు, ఇంటిమీద చిన్న యాంటెన్నాతో కంప్యూటర్లకు ఇంటర్నెట్ రానుంది. ఇదంతా శాటిలైట్ ఇంటర్నెట్ మహిమ. ఇప్పటికైతే కేబుల్ ఇంటర్నెట్ బాగానే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లపై చైనా ఆధిపత్య యత్నాలు వంటివి శాటిలైట్ ఇంటర్నెట్కు దారులు తెరుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు రంగంలోకి దిగాయి కూడా. ఈ సంగతులు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రస్తుతానికి కేబుళ్లదే రాజ్యం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇంటర్నెట్కు సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే కీలకం. ప్రస్తుతం సముద్రాల అడుగున 13 లక్షల కిలోమీటర్ల పొడవైన 428 ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ఉన్నాయి. అన్నిదేశాల మధ్య మొత్తం ఇంటర్నెట్ డేటాలో 98 శాతం సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతోంది. కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అందులోనూ గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వీటి అనుబంధ కంపెనీలకు సంబంధించిన డేటానే భారీగా ఉంటోంది. అందుకే ఈ కంపెనీలు సబ్‌మెరైన్ కేబుల్స్ వేసే పనిలోకి దిగాయి. ఇందుకోసం గత ఐదేళ్లలోనే రూ.12 వేల కోట్ల వరకు ఖర్చుపెట్టాయి. చైనా కంపెనీల వివాదంతో.. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు నిర్మిస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా చైనా కంపెనీ హువావే పెద్ద మొత్తంలో కేబుళ్ల నిర్మాణ కాంట్రాక్టులు చేస్తోంది. దీనిపై అమెరికా సహా పలు కీలక దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా తమ దేశానికి చెందిన టెక్ కంపెనీల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం, ఇతర విపత్కర పరిస్థితులు వస్తే.. ఆధిపత్యం కోసం చైనా ఏమైనా చేసేందుకు సిద్ధమన్న ఆందోళనలూ ఉన్నాయి. హువావే కంపెనీ నిర్మించి, నిర్వహిస్తున్న సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడవచ్చని.. దేశాలకు, వ్యక్తులకు సంబంధించి రహస్య సమాచారం, వ్యూహాలను తెలుసుకోవచ్చని.. ఇంటర్నెట్ను స్తంభింపజేయవచ్చని అమెరికా కొద్దిరోజుల కింద హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్ సంస్థ, ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల ప్రభుత్వాలు కేబుళ్ల నిర్మాణం, నిర్వహణలో చైనా కంపెనీల భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి. భవిష్యత్తు శాటిలైట్ ఇంటర్నెట్దే.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల విషయంగా టెక్ యుద్ధం జరుగుతుండటంతో.. ప్రత్యామ్నాయమైన శాటిలైట్ ఇంటర్నెట్పై దృష్టి పడింది. ఈ విధానంలో మన ఫోన్ నుంచే నేరుగా శాటిలైట్‌కు అనుసంధానమై ఇంటర్నెట్ను పొందడానికి అవకాశం ఉంటుంది. అదే కంప్యూటర్లు అయితే కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్కు అనుసంధానం కావడానికి వీలుంటుంది. అడవులు, కొండలు, గుట్టలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ అందుకోవచ్చు. ఇప్పటికే నాసా సహా పలు దేశాల అంతరిక్ష సంస్థలు పరిమిత స్థాయిలో శాటిలైట్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో కాలుపెట్టాయి. వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ కూడా వన్‌వెబ్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థను నెలకొల్పారు. త్వరలోనే శాటిలైట్లను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ వంటి పలు కంపెనీలు ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పరిమిత సేవలు అందిస్తున్నాయి. 4,425 శాటిలైట్లతో ‘స్టార్ లింక్’ టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. మొత్తంగా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,600కుపైగా శాటిలైట్లను పంపారు. కేబుల్, శాటిలైట్.. డేటా ప్రయాణం ఇలా.. ఉదాహరణకు మనం అమెరికాలోని వ్యక్తికి ఒక ఈ–మెయిల్ పంపితే.. ఈ–మెయిల్లోని టెక్ట్స్, ఫొటోలు వంటి సమాచారం మన సెల్‌ఫోన్/కంప్యూటర్ నుంచి.. సెల్‌ఫోన్ టవర్/రూటర్ మీదుగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు.. అక్కడి నుంచి సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసే ల్యాండింగ్ ఆఫీస్‌కు చేరుతుంది. తర్వాత సముద్రం అడుగున ఉన్న (సబ్‌మెరైన్) కేబుళ్ల ద్వారా ప్రయాణించి అమెరికా తీరంలోని ల్యాండింగ్ ఆఫీస్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు.. సెల్‌ఫోన్ టవర్/రూటర్ ద్వారా సదరు వ్యక్తి సెల్‌ఫోన్/కంప్యూటర్‌కు డేటా చేరుకుంటుంది. ఇదే శాటిలైట్ ఇంటర్నెట్ అయితే.. మన సెల్‌ఫోన్/ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరం అమర్చిన కంప్యూటర్ నుంచి డేటా నేరుగా సమీపంలోని శాటిలైట్‌కు చేరుతుంది. దాని నుంచి అమెరికాపైన ఉన్న మరో శాటిలైట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని నుంచి నేరుగా సెల్‌ఫోన్/ రిసీవర్ ఉన్న కంప్యూటర్‌కు చేరుతుంది. శాటిలైట్ ద్వారా డేటా బదిలీ కాస్త సులువుగా కనిపిస్తున్నా.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. ఫోన్లు, శాటిలైట్లు, రిసీవర్ల మధ్య డేటా ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు ప్రతిసారి ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరమవుతాయి. అదే కేబుల్ ద్వారా అయితే.. ఇరువైపులా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద మాత్రమే ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరం. -
స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్
న్యూఢిల్లీ: భారతి ఎయిర్టెల్ యాజమాన్యంలోని శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్ 36 కొత్త లో ఎర్త్ ఆర్బిట్(లియో) ఉపగ్రహాలను ఈ రోజు ప్రయోగించినట్లు ప్రకటించింది. రష్యాలోని ఏరియన్‌స్పేస్ నుంచి ఇవి దూసుకెళ్లాయని తెలిపింది. ‘5 టు 50’ లక్ష్యంలో భాగంగా మరొక శాటిలైట్‌ను ప్రయోగించడం ద్వారా యూకే, అలస్కా, ఉత్తర యూరప్, గ్రీన్‌ల్యాండ్, కెనడావంటి దేశాలకు ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. వాణిజ్య సేవలు 2022 నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది. దీంతో కక్ష్యలోకి చేరిన మొత్తం శాటిలైట్ల సంఖ్య 218కి చేరుకుందని భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీ వెల్లడించింది. వన్‌వెబ్ గత మార్చి నెలలో ఇదే అంతరిక్ష కేంద్రం నుంచి 36 ఉపగ్రహాల ప్రయోగించింది. కంపెనీ తన సేవల్లో భాగంగా 648 లియో ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోంది. జూన్ 2021 నాటికి 50 డిగ్రీల అక్షాంశానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలకు సేవలను అందించడానికి కంపెనీ ఒక అడుగు దూరంలో ఉంది. వన్‌వెబ్, ఏరోస్పేస్ సంస్థ ఎయిర్‌బస్ జాయింట్ వెంచర్ కింద ఈ ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. ఏప్రిల్ చివరిలో వన్‌వెబ్ లో పారిస్ కు చెందిన యూటెల్సాట్ కమ్యూనికేషన్స్ 550 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా యుటెల్సాట్ వన్‌వెబ్‌లో 24శాతం వాటాను సొంతం చేసుకుంది. స్పేస్ ఎక్స్ కు పోటీగా వన్‌వెబ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందించాలని చూస్తుంది. చదవండి: నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం! -
భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ సంస్థకు అనుబంధ సంస్థ స్టార్ లింక్... శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను మన దేశంలో అందించేందుకు ప్రీబుకింగ్ ప్రారంభించింది. హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ప్రపంచంలో ఇంటర్నెట్ సదుపాయం లేని మారు మూల ప్రాంతాలకు అందించాలన్న లక్ష్యంతో, అలాగే ఇంటర్నెట్ ఇప్పటికే ఉన్న ప్రాంతాల్లో లో లేటెన్సీ (డేటా తన గమ్యస్థానాన్ని చేరుకునే వ్యవధి) కనెక్టివిటీ అందించాలన్న లక్ష్యంతో స్టార్‌లింక్.. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనుంది. మన ఇంట్లో డీటీహెచ్ యాంటెన్నా కంటే చిన్న సైజులో ఉండే యాంటెన్నా ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్నది దీని లక్ష్యం. 2015లోనే ఎలన్ మస్క్ దీనిపై సూత్రప్రాయ ప్రకటన చేశారు. స్పేస్ఎక్స్ కమ్యునికేషన్ శాటిలైట్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు శాటిలైట్ నెట్వర్క్ ద్వారా అందించనున్నట్టు ప్రకటించారు. దీనిని అభివృద్ధి పరిచేందుకు వాషింగ్టన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇంటర్నెట్ సేవలు ఇలా.. భూమి నుంచి పంపే ఇంటర్నెట్ సిగ్నల్‌ను స్టార్‌లింక్ శాటిలైట్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ శాటిలైట్ తన నెట్‌వర్క్‌లోని ఇతర శాటిలైట్లతో లేజర్ లైట్ సాయంతో కమ్యునికేట్ చేస్తుంది. లక్షిత శాటిలైట్ డేటా రిసీవ్ చేసుకోగానే.. కింద భూమిపై ఉన్న వినియోగదారుడి రిసీవర్‌కు రిలే చేస్తుంది. ఒక్కో శాటిలైట్ మొత్తం శాటిలైట్ల కూటమిలోని ఏవైనా నాలుగు శాటిలైట్లకు ఎల్లవేళలా అనుసంధానమై ఉంటుంది. యారే యాంటెన్నాలు శాటిలైట్లు డేటా బదిలీ చేసేందుకు సహకరిస్తాయి. వాటి నుంచి వినియోగదారులకు చిన్నసైజు డిష్ యాంటెన్నా ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే నార్త్ అమెరికా తదితర ప్రాంతాల్లో బీటా(టెస్టింగ్) సేవలు అందిస్తోంది. ఎక్విప్మెంట్ కిట్ కోసం 499 డాలర్లు వసూలు చేస్తోంది. ఇప్పటివరకు 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుతుందని సంస్థ చెబుతోంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్ ప్రీబుకింగ్ ప్రారంభించింది. స్టార్‌లింక్ వెబ్సైట్లోకి వెళ్లి వినియోగదారులు తమ ప్రాంతంలో ఆ సేవల లభ్యతను తెలుసుకోవచ్చు. సేవల లభ్యత ఉంటే 99 డాలర్లు (సుమారు రూ.7 వేలు) చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ప్రీబుకింగ్ చేసుకున్న వారందరికీ సేవలు అందుతాయన్న గ్యారంటీ లేదు. ముందుగా వచ్చిన వారికి ముందుగా సేవలు అన్న ప్రాతిపదికన అందించనుంది. అలాగే ఈ సేవలకు మన దేశ అధీకృత సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. అన్నీ సాఫీగా సాగితే 2022 నుంచి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. అంతరిక్షంలోకి 12 వేల శాటిలైట్లు 2019 మే 24న స్పేస్ఎక్స్.. స్టార్‌లింక్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది. భూమిపై 550 కి.మీ. ఎత్తులోలో ఎర్త్ ఆర్బిట్‌లో శాటిలైట్లను స్టార్‌లింక్ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ఎత్తులో ఈ శాటిలైట్ ఉండడంతో లోలేటెన్సీ రేటు ఉంటుంది. ఒక్కో శాటిలైట్ 260 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉండేలా చాలా కాంపాక్ట్‌గా రూపొందించారు. ఈ శాటిలైట్‌కు నాలుగు యారే యాంటెన్నాలు ఉంటాయి. ఒక సింగిల్ సోలార్ యారే, అయాన్ ప్రొపల్షన్ సిస్టమ్, నావిగేషన్ సెన్సార్లు, డెబ్రిస్ ట్రాకింగ్ సిస్టమ్ ఇందులో ఉంటాయి.