స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శాటిలైట్ సంబంధిత ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీస్(జీఎంపీసీఎస్) లైసెన్స్ కోసం కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) వద్ద అప్లయి చేసినట్లు సమాచారం.
ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా 32దేశాల్లో అందిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, కెనడా,మెక్సికో, యూరప్, యూరప్, సౌత్-నార్త్ అమెరికాలోని కొన్ని దేశాలతో పాటు ఓషియానా(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)లలో సేవలు అందుతున్నాయి . ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ బెస్ట్ కంట్రీగా భావించి.. గతేడాది ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సేవల కంటే ముందు బుక్సింగ్ సైతం స్టార్‌లింక్ ప్రారంభించింది. అయితే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్‌ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేశారు.
ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం..
ఈ తరుణంలో ఎలాన్ మస్క్ గత వారం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేలా జీఎంపీసీఎస్ కోసం అప్లయి చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. జీఎంపీసీఎస్ లైసెన్స్‌తో పాటు భారత డిపార్టెమెంట్ ఆఫ్ స‍్పేస్ అప్రూవల్ పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి లభిస్తే స్పేస్ ఎక్స్ భారత్‌లో శాటిలైట్ గేట్‌వేస్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రధాని మోదీ ఒప్పుకుంటారా?
ఎలాన్ మస్క్ చైనా నుంచి టెస్లా కార్లను దిగుమతి చేసి భారత్‌లో అమ్మకాలు జరపాలని అనుకున్నారు. కానీ మస్క్ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. టెస్లా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలనుకుంటే సమస్య ఏదీ లేదని, చైనా నుంచి మాత్రం కార్లను దిగుమతి చేయకూడదని కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
ఆ తర్వాత భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్లను ఎప్పుడు ప్రారంభించనున్నారు అని ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ స్పందించారు. టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను భారత్‌లో నిర్మించే ఆలోచన లేదు. మొదట మా కార్ల విక్రయాలు, సర్వీసులకు అనుమతించని ఏ ప్రాంతంలోనూ టెస్లా ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పబోదని మస్క్ ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో కేంద్రం అనుమతి ఇస్తుందా? లేదా అని తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది.
చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత!
Comments
Please login to add a commentAdd a comment