![Battle Of The Billionaires: Musk, Tata, Mittal, And Amazon On One Side, Ambani On Other For Foreign Satellite Spectrum - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/26/Battle%20Of%20The%20Billionaires_Musk%2C%20Tata%2C%20Mittal%2C%20And%20Amazon%20On%20One%20Side%2C%20Ambani%20On%20Other%20For%20Foreign%20Satellite%20Spectrum-01_0.jpg.webp?itok=hl-JNhyV)
ప్రధాని నరేంద్ర మోదీ గత వారం అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనే ఇప్పుడు ప్రపంచ వ్యాపార దిగ్గజాల మధ్య పంతానికి దారితీసింది? ప్రజలకు సేవలందించే విషయంలో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు? తమ మాటే నెగ్గాలని ఒకరంటుంటే? లేదు మాటిచ్చాం..నెరవేర్చుకుంటాం అని మరొకరంటున్నారు? మోదీ అమెరికా పర్యటనతో భారత్‌లో ఇండస్ట్రీలిస్ట్‌ల మధ్య పంతాలెందుకు వస్తాయి? తమ మాటే ఎందుకు నెగ్గించుకోవాలనుకుంటారు? ఆ కథా కమామిషూ ఏంటో తెలుసుకుందాం పదండి.
గత కొన్నేళ్లుగా భారత్‌లో అడుగుపెట్టేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విభాగం స్టార్‌లింక్‌కు మోదీ అమెరికా పర్యటన ఊతమిచ్చింది. గతంలో లైసెన్స్ లేదన‍్న కారణంగా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించే స్టార్‌లింక్‌కు కేంద్రం అడ్డు చెప్పింది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శాటిలైట్ బ్రాండ్‌బ్యాండ్‌ను అందించేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.
అంత సులభం కాదు
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టెస్లా ఎలక్ట్రిక్ కార్యకలాపాలతో పాటు స్టార్‌లింక్ సేవల్ని భారత్‌లో అందించే ఆలోచనలో ఉన్నట్టు మస్క్ తెలిపారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్‌తో దేశంలోని మారుమూల ప్రాంతాలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కానీ, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ప్రారంభించడం మస్క్‌కు అంత సులభమయ్యేలా కనిపించడం లేదంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాల సాయంతో ఇంటర్నెట్ సేవలు అందించే విషయంలో ముఖేష్ అంబానీ నుంచి మస్క్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. ఎందుకంటే?
శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు మస్క్ కేవలం అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మస్క్‌తో పాటు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్,టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా, భారతీ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్‌టెల్ సంస్థ ఛైర్మన్ సునీల్ మిట్టల్ సైతం అదే బాటులో పయనిస్తున్నారు.
పట్టుబడుతున్న ముఖేష్ అంబానీ
స్పెక్ట్రం అనేది మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీల శ్రేణి. ఇప్పుడీ ఈ స్ప్రెక్టంను వేలం వేయాలని అంటున్నారు ముఖేష్ అంబానీ. శాటిలైట్ సేవలందించే విదేశీ సంస్థలు సైతం స్ప్రెక్టం వేలంలో పాల్గొనాలని పట్టుబడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. లైసెన్స్ ఇస్తే దేశీయ సంస్థలతో - విదేశీ కంపెనీలు పోటీ పడతాయి. అదే ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొంటే పోటీని అరికట్టవచ్చనేది వాదన. కాబట్టే, వాయిస్ ,డేటా సేవలను అందించడానికి విదేశీ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్‌లు స్పెక్ట్రమ్ వేలంలో తప్పని ఉండాలని అంబానీకి చెందిన రిలయన్స్ చెబుతోంది.
అయితే, ఎవరి పోటీ ఎలా ఉన్నా చివరిగా.. భారత ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయం మీద ఆధారపడి ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ సర‍్వీస్ స్పెక్ట్రం విభాగంలో కేంద్ర విభాగానికి చెందిన ట్రాయ్ ముఖ్య పాత్ర పోషించనుంది.
కేంద్రానిదే తుది నిర్ణయం
ఇక, భారత ప్రభుత్వం 2010 నుంచి మొబైల్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తుండగా.. ఫలితంగా కేంద్రానికి 77 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6 లక్షల కోట్లు) వచ్చాయి. టెక్నాలజీ పెరగడం, ప్రస్తుతం ఆయా సంస్థలు శాటిలైట్ సేవల్ని అందించేందుకు పోటీపడుతున్నాయని పెట్టుబడుల సంస్థ సీఎల్‌ఎస్‌ఏ చెబుతోంది. ఈ సమస్యపై సెక్టార్ రెగ్యులేటర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పలు సంస్థలతో చర్చలు జరపగా..అమెజాన్ కైపర్, టాటా, ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ వేలానికి వ్యతిరేకంగా ఉండగా, రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా వేలానికి మద్దతు ఇస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తుది నిర్ణయాన్ని కేంద్రం వెల్లడించాల్సి ఉంది.
చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?
Comments
Please login to add a commentAdd a comment