ఇంటర్నెట్ అనగానే మనకు సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు, ఇళ్లలో వైఫైలు గుర్తొస్తాయి. కానీ.. ఇక ముందు అవేమీ ఉండవు. సెల్ సిగ్నల్‌తో పనిలేకుండా నేరుగా ఫోన్లకు, ఇంటిమీద చిన్న యాంటెన్నాతో కంప్యూటర్లకు ఇంటర్‌నెట్ రానుంది. ఇదంతా శాటిలైట్ ఇంటర్‌నెట్ మహిమ. ఇప్పటికైతే కేబుల్ ఇంటర్‌నెట్ బాగానే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లపై చైనా ఆధిపత్య యత్నాలు వంటివి శాటిలైట్ ఇంటర్‌నెట్‌కు దారులు తెరుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు రంగంలోకి దిగాయి కూడా. ఈ సంగతులు ఏమిటో తెలుసుకుందామా?
– సాక్షి సెంట్రల్ డెస్క్
ప్రస్తుతానికి కేబుళ్లదే రాజ్యం..
ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇంటర్‌నెట్‌కు సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే కీలకం. ప్రస్తుతం సముద్రాల అడుగున 13 లక్షల కిలోమీటర్ల పొడవైన 428 ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ఉన్నాయి. అన్నిదేశాల మధ్య మొత్తం ఇంటర్‌నెట్ డేటాలో 98 శాతం సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారానే ట్రాన్స్‌ఫర్ అవుతోంది. కొన్నేళ్లుగా ఇంటర్‌నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అందులోనూ గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, వీటి అనుబంధ కంపెనీలకు సంబంధించిన డేటానే భారీగా ఉంటోంది. అందుకే ఈ కంపెనీలు సబ్‌మెరైన్ కేబుల్స్ వేసే పనిలోకి దిగాయి. ఇందుకోసం గత ఐదేళ్లలోనే రూ.12 వేల కోట్ల వరకు ఖర్చుపెట్టాయి.
చైనా కంపెనీల వివాదంతో..
ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు నిర్మిస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా చైనా కంపెనీ హువావే పెద్ద మొత్తంలో కేబుళ్ల నిర్మాణ కాంట్రాక్టులు చేస్తోంది. దీనిపై అమెరికా సహా పలు కీలక దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా తమ దేశానికి చెందిన టెక్ కంపెనీల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం, ఇతర విపత్కర పరిస్థితులు వస్తే.. ఆధిపత్యం కోసం చైనా ఏమైనా చేసేందుకు సిద్ధమన్న ఆందోళనలూ ఉన్నాయి. హువావే కంపెనీ నిర్మించి, నిర్వహిస్తున్న సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడవచ్చని.. దేశాలకు, వ్యక్తులకు సంబంధించి రహస్య సమాచారం, వ్యూహాలను తెలుసుకోవచ్చని.. ఇంటర్‌నెట్‌ను స్తంభింపజేయవచ్చని అమెరికా కొద్దిరోజుల కింద హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ సంస్థ, ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల ప్రభుత్వాలు కేబుళ్ల నిర్మాణం, నిర్వహణలో చైనా కంపెనీల భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.
భవిష్యత్తు శాటిలైట్ ఇంటర్‌నెట్‌దే..
ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల విషయంగా టెక్ యుద్ధం జరుగుతుండటంతో.. ప్రత్యామ్నాయమైన శాటిలైట్ ఇంటర్‌నెట్‌పై దృష్టి పడింది. ఈ విధానంలో మన ఫోన్ నుంచే నేరుగా శాటిలైట్‌కు అనుసంధానమై ఇంటర్‌నెట్‌ను పొందడానికి అవకాశం ఉంటుంది. అదే కంప్యూటర్లు అయితే కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా శాటిలైట్ ఇంటర్‌నెట్‌కు అనుసంధానం కావడానికి వీలుంటుంది. అడవులు, కొండలు, గుట్టలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా ఇంటర్‌నెట్ అందుకోవచ్చు. ఇప్పటికే నాసా సహా పలు దేశాల అంతరిక్ష సంస్థలు పరిమిత స్థాయిలో శాటిలైట్ ఫోన్, ఇంటర్‌నెట్ సేవలను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో కాలుపెట్టాయి.
- వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ కూడా వన్‌వెబ్ పేరుతో శాటిలైట్ ఇంటర్‌నెట్ సంస్థను నెలకొల్పారు. త్వరలోనే శాటిలైట్లను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- వీటితోపాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్‌స్టార్ట్ వంటి పలు కంపెనీలు ఇప్పటికే శాటిలైట్ ఇంటర్‌నెట్ రంగంలో పరిమిత సేవలు అందిస్తున్నాయి.
4,425 శాటిలైట్లతో ‘స్టార్ లింక్’
- టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్‌నెట్ కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. మొత్తంగా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ప్రపంచం నలుమూలలా ఇంటర్‌నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,600కుపైగా శాటిలైట్లను పంపారు.
కేబుల్, శాటిలైట్.. డేటా ప్రయాణం ఇలా..
ఉదాహరణకు మనం అమెరికాలోని వ్యక్తికి ఒక ఈ–మెయిల్ పంపితే..
- ఈ–మెయిల్‌లోని టెక్ట్స్, ఫొటోలు వంటి సమాచారం మన సెల్‌ఫోన్/కంప్యూటర్ నుంచి.. సెల్‌ఫోన్ టవర్/రూటర్ మీదుగా ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు.. అక్కడి నుంచి సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసే ల్యాండింగ్ ఆఫీస్‌కు చేరుతుంది. తర్వాత సముద్రం అడుగున ఉన్న (సబ్‌మెరైన్) కేబుళ్ల ద్వారా ప్రయాణించి అమెరికా తీరంలోని ల్యాండింగ్ ఆఫీస్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు.. సెల్‌ఫోన్ టవర్/రూటర్ ద్వారా సదరు వ్యక్తి సెల్‌ఫోన్/కంప్యూటర్‌కు డేటా చేరుకుంటుంది.
- ఇదే శాటిలైట్ ఇంటర్‌నెట్ అయితే.. మన సెల్‌ఫోన్/ శాటిలైట్ ఇంటర్‌నెట్ పరికరం అమర్చిన కంప్యూటర్ నుంచి డేటా నేరుగా సమీపంలోని శాటిలైట్‌కు చేరుతుంది. దాని నుంచి అమెరికాపైన ఉన్న మరో శాటిలైట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దాని నుంచి నేరుగా సెల్‌ఫోన్/ రిసీవర్ ఉన్న కంప్యూటర్‌కు చేరుతుంది.
- శాటిలైట్ ద్వారా డేటా బదిలీ కాస్త సులువుగా కనిపిస్తున్నా.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. ఫోన్లు, శాటిలైట్లు, రిసీవర్ల మధ్య డేటా ట్రాన్స్‌ఫర్ అయ్యేప్పుడు ప్రతిసారి ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరమవుతాయి. అదే కేబుల్ ద్వారా అయితే.. ఇరువైపులా ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద మాత్రమే ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment