sathenapalli
-
అంబటి భోగి డ్యాన్స్...
-
శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. శివారామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం, బాధలేదని శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. ‘గత ఆగస్టులో కోడెల శివప్రసాద్ నాకు పలుమార్లు ఫోన్ చేశారు. తన కమారుడైన శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ఆస్తులను శివరామ్ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఆవేదనను నాతో పంచుకున్నారు. శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని నన్ను వేడుకున్నారు. తరువాత నేనే స్వయంగా శివరామ్‌కు ఫోన్ చేసి తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని అనేక సార్లు హెచ్చరించాను. ఈరోజు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శివప్రసాద్‌ను శివరామే హత్య చేశాడు. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా మాజీ స్పీకర్ కోడెల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుండెపోటు మృతి చెందితే.. అపోలో, కేర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లారంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పలువురు మాత్రం ఆయన ఉరేసుకుని మృతిచెందారంటూ చెబుతున్నారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించగా.. మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అధికారులు తెలిపారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించిన ఘటన మరువక ముందే మరో దోపిడి బయటపడింది. సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో అదృశ్యమైన ల్యాప్‌టాప్‌లు వెలుగులోకి వచ్చాయి. నాడు కోడెల దోపిడికి మాయమైన 29 ల్యాప్‌ట్యాపులు అనూహ్యాంగా ఆర్డీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ శివరామ్.. ప్రభుత్వ కార్యాలయంలోని విలువైన వస్తువులను అనుచరులకు విచ్చలవిడిగా పంచిపెట్టారు. ఈ సందర్భంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని విలువైన ల్యాప్‌టాప్‌లను తన అభిమానులకు ధారాదత్తం చేశాడు. తాజాగా వాటిపై కేసు నమోదు కావడంతో తప్పించుకునేందుకు రాత్రికిరాత్రే కొత్త ల్యాప్‌టాప్‌లు కొని వాటి స్థానంలో పెట్టారు. కాగా కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్ఎస్పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్ఎస్పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోడెల కుమారుడు శివరామ్ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
కోడెల ట్యాక్స్ వెనక్కి ఇప్పించండి
లక్ష్మీపురం(గుంటూరు)/సత్తెనపల్లి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నరసరావుపేట పోలీసుస్టేషన్లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో సత్తెనపల్లికి చెందిన ఓ బిల్డర్ కోడెల ట్యాక్స్ (కే ట్యాక్స్)పై ఫిర్యాదు చేశారు. అపార్టుమెంట్ నిర్మాణం అనుమతికోసం తన వద్ద బలవంతంగా రూ. 15 లక్షలు వసూలు చేశారని, ఆ డబ్బును వడ్డీతో సహా ఇప్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. బాధితుడి కథనం ప్రకారం.. గుంటూరు విద్యానగర్‌కు చెందిన బిల్డర్ జి.తిరుపతిరావు సత్తెనపల్లిలోని పార్క్రోడ్డులో 2016 జనవరిలో తిరుమల టవర్స్ పేరుతో సీఆర్డీఏ అనుమతితో అపార్ట్మెంట్ నిర్మాణాన్ని చేపట్టారు. సత్తెనపల్లి పురపాలక సంస్థలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాణం జరగాలంటే ముందుగా కోడెల కుమారుడు శివరాంను కలవాలంటూ సత్తెనపల్లి పురపాలక కమిషనర్ చెప్పారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. చేసేది లేక కోడెల శివరాం, అతని పీఏ గుత్తా నాగ ప్రసాద్‌లను కలిస్తే.. ఒక్కో ఫ్లాట్‌కు రూ.2 లక్షల చొప్పున 15 ఫ్లాట్లకు రూ. 30 లక్షలు చెల్లిస్తేనే అన్ని అనుమతులు వస్తాయని లేని పక్షంలో నిర్మాణం చేపట్టడానికి వీలులేదని బెదిరించారు. అంత చెల్లించుకోలేనని చెప్పి రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ డబ్బును 2016 జూన్ 12న చెల్లించారు. డబ్బు చెల్లించిన విషయం పురపాలక కమిషనర్‌కు తెలియజేయగా, ఆయన అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. తన నుంచి దౌర్జన్యంగా వసూలు చేసిన రూ.15 లక్షల నగదు వడ్డీతో సహా వెనక్కి ఇప్పించాలని, కోడెల శివరాం అతని పీఏలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. చెప్పిన డబ్బు చెల్లిస్తేనే చెక్ పాస్.. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన చెక్‌ను కోడెల శివరాం తీసుకెళ్లి డబ్బు డిమాండ్ చేశారని సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లికి చెందిన టీడీపీ నేత, శ్రీలక్ష్మీ తులసి ఏజెన్సీస్ నిర్వాహకుడు యెల్లినేడి శ్రీనివాస్ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. ఆయన సోమవారం డీఎస్పీ వి.కాలేషావలిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. శ్రీలక్ష్మీతులసి ఏజెన్సీస్ ద్వారా 2017 ఫిబ్రవరి 3న నరసరావుపేటలో ఖేలో ఇండియా గ్రూప్ 2కు వచ్చిన క్రీడాకారులకు భోజన ఏర్పాట్లు చేశానన్నారు. అప్పటి జాయింటు కలెక్టర్ 2, నరసరావుపేట ఆర్డీవో, జిల్లా డీఎస్వో ద్వారా వర్క్ ఆర్డర్ తీసుకొని భోజనాలను ఏర్పాటు చేశానని, సుమారు రూ. 27 లక్షలు బిల్లు అవగా జాయింటు కలెక్టర్–2 ఆ బిల్లులను రూ. 23 లక్షలకు కుదించి మంజూరు చేశారన్నారు. అయితే బిల్ పేమెంట్ చేయకుండా జేసీ–2 తిప్పుతుండటంతో ఆయన్ను కలవగా మొదటి చెక్కును కోడెల శివరాం పీఏ తీసుకెళ్లారని చెప్పారన్నారు. విషయం తెలిసి కోడెల శివరాంను కలిస్తే ఖర్చుల నిమిత్తం తన పీఏకు రూ. 5 లక్షలు ఇవ్వాలని చెప్పారన్నారు. పీఏను కలసి డబ్బులు లేవని చెప్పగా, రూ. 5 లక్షలు ఇస్తేనే చెక్కులు ఇస్తామని చెప్పారన్నారు. గత్యంతరం లేక వారు చెప్పిన విధంగా చేశానన్నారు. తన వద్ద డబ్బులు తీసుకున్న కోడెల శివరాం, ఆయన పీఏలను అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. సివిల్ మ్యాటర్ అయినందున తమ పరిధి కాదని డీఎస్పీ చెప్పారని బాధితుడు శ్రీనివాస్ వాపోయారు. -
మహిళ దారుణ హత్య
సత్తెనపల్లి: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సత్తెనపల్లి పట్టణం, చెంచుకాలనీ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని అచ్చంపేట రోడ్డు, పోలేరమ్మ దేవాలయం సమీపానికి చెందిన నూర్‌బాషా ఇమాంబీ (36)కి తెనాలికి చెందిన కాలేషావలితో 20 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా పదిహేనేళ్ల కిందట ఇమాంబీ భర్త, పిల్లలను వదిలేసి సత్తెనపల్లి వచ్చింది. అప్పటి నుంచి పట్టణానికి చెందిన తాజుద్దీన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. 40 రోజుల కిందట తాజుద్దీన్ మృతి చెందాడు. కాగా తాజుద్దీన్‌కు కొంత నగదు ఇవ్వాల్సి ఉందని, ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో వివాదం ఉన్నట్లు పోలీసులకు సమాచారం. పట్టణంలోని చెంచుకాలనీ సమీపంలో నివసిస్తున్న ఇమాంబీతో తాజుద్దీన్ సోదరుడైన చినబాబు అలియాస్ వడ్డీల బాబుకు వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్వక్తపరుస్తున్నారు. గురువారం ఇమాంబీ గృహంలో హత్యకు గురైన విషయం తెలియడంతో సత్తెనపల్లి డీఎస్పీ వి.కాలేషావలి, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వీరయ్య, అర్బన్ ఎస్ఐలు అశోక్‌బాబు, శేషాచార్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇమాంబీ శరీరంపై 7, 8 కత్తిపోట్లు ఉండడాన్ని గుర్తించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం అందించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ ఇమాంబీ ఇంటి వద్ద నుంచి చెంచుకాలనీలోకి ప్రవేశించి ఆగిపోయింది. ఈ క్రమంలో ఇమాంబీని హతమార్చిన వ్యక్తి చెంచుకాలనీ వైపుగా వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇమాంబీని చినబాబు హత్యచేశాడా లేక మరెవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తపరుస్తూ విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి సైదాబీ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
22 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
సత్తెనపల్లి: పెద్ద మొత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం పోలీసులు లారీలో తరలిస్తున్న 22 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని పిడుగురాళ్ల నుంచి కాకినాడకు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.