Sathya Sai Drinking Water Project
-
మంత్రి హరీశ్ వ్యాఖ్యలపై మనస్తాపం..
సత్యసాయి తాగునీటి పథకం కార్మికుడి హఠాన్మరణం సంగారెడ్డి: కనీస వేతనాలు అమలు కావేమోనన్న బెంగతో సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న మెదక్ జిల్లా పుల్కల్కు చెందిన ఒక కార్మికుడు హఠాన్మరణం చెందాడు. జిల్లాలో సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలు చేపడుతున్నారు. మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ కనీస వేతనాలకు సంబంధించిన జీఓ 11 అమలు కుదరదని తేల్చి చెప్పడంతో నిరాశకు గురయ్యారు. సమ్మె చేస్తున్న కార్మికుల్లో పుల్కల్కు చెందిన ఫిట్టర్ చిన్నరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పుల్కల్లోని ఇంటికి వెళ్లిన ఆయన మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణానికి గురయ్యాడు. -
గురుపౌర్ణమి నాటికి 120 గ్రామాలకు తాగునీరు
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ పుట్టపర్తి అర్బన్,న్యూస్‌లైన్: సత్యసాయి తాగునీటి పథకం ద్వారా వచ్చే గురుపౌర్ణమి నాటికి పుట్టపర్తి నియోజకవర్గంలోని 120 గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించనున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ పేర్కొన్నారు. గురువారం సత్యసాయి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని హిల్‌వ్యూ స్టేడియంలో నారాయణసేవను ప్రారంభించడానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సత్యసాయి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనం చేసి నారాయణ సేవను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఆరాధనోత్సవాల సందర్భంగా 50 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. జూలై 12న జరిగే గురుపౌర్ణమి నాటికి కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమం అనంతరం సత్యసాయి చిత్రపటానికి మహా మంగళహారతి ఇచ్చారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్లు చక్రవర్తి, ఆర్జే రత్నాకర్, శ్రీనివాసన్, నాగానంద, కార్యదర్శి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
157 గ్రామాలకు నీటి సరఫరా బంద్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా 157 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు తమకు వేతనాలు, ఎరియర్స్ చెల్లించాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా జిల్లాలో 157 గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ తాగునీటి పథకాల నిర్వహణ బాధ్యతను ఎల్అండ్టీ సంస్థకు కాంట్రాక్టు పద్ధతిలో అప్పగించారు. అయితే ఈ సంస్థకు ఏడాదికాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. కాగా నిధుల విడుదలకు ముడుపుల బాగోతం అడ్డు పడుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మొత్తం ఎనిమిది పథకాల పరిధిలో 135 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పంపు ఆపరేటర్లు, హెల్పర్లు, లైన్మెన్లు, వాచ్మెన్లుగా పనిచేస్తున్న వీరి కాంట్రాక్టును ఏడాదికోమారు కాంట్రాక్టు సంస్థ రెన్యూవల్ చేస్తోంది. జిల్లాలో సత్యసాయి చారిటబుల్ ట్రస్టు ఎనిమిది తాగునీటి పథకాలను నిర్మించింది. ఈ పథకాల నిర్వహణ, మరమ్మతు పనుల కాంట్రాక్టును ఎల్అండ్టీ సంస్థ చాలాకాలంగా నిర్వహిస్తోంది. గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) విభాగం ద్వారా కాంట్రాక్టు సంస్థకు ప్రతి నెలా నిధులు విడుదల కావాల్సి ఉంటుంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం, మెదక్ జిల్లాల్లో సత్యసాయి తాగునీటి పథకాల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా అవుతోంది. అయితే కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ సంస్థకు ఏడాదికాలంగా ఆర్డబ్ల్యూఎస్ నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఐదు జిల్లాల్లో సుమారు రూ.30 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్లు ఎల్ అండ్ టీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం మెదక్ జిల్లాలోనే తమకు రూ.4.15 కోట్లు పెండింగ్ బిల్లు రావాల్సి వుందని ఎల్ అండ్ టీ వర్గాలు వెల్లడించాయి. ఏడాదికాలంగా బిల్లులు రాకున్నా ఈ యేడాది జూలై వరకు వేతనాలు చెల్లించిన ఎల్ అండ్ టీ ఆగస్టు వేతనాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. మరోవైపు కార్మికులకు ఎరియర్స్ చెల్లిస్తామంటూ కాంట్రాక్టు సంస్థ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. నిలిచిన సరఫరా అటు వేతనం రాక, ఇటు ఎరియర్స్ లేకపోవడంతో కార్మికులు ఈ నెల 16వ తేదీ నుంచి జిల్లాలో నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో సత్యసాయి పథకం ద్వారా నీరు సరఫరా అయ్యే 157 గ్రామాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. తమకు కనీసం రూ.2 కోట్లు మంజూరు చేస్తే వేతనాలు చెల్లిస్తామని ఎల్ అండ్ టీ వర్గాలు చెప్తున్నాయి. ‘పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆలస్యం మూలంగా కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల నిలిపివేసింది. మరో వారం రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం వుంది. ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది ద్వారా పథకం నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని’ గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ విజయప్రకాశ్ ‘సాక్షి’కి వెల్లడించారు. మరోవైపు బిల్లుల మంజూరులో ముడుపుల బాగోతం దాగి వుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ‘ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. తాజాగా నిధులు విడుదలయ్యే అవకాశం వున్నా కొందరు అధికారులు తమ వాటా తేల్చాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో బకాయిల విడుదల, వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని’ కార్మికులు ఆరోపిస్తున్నారు. -
దాహార్తితో అల్లాడుతున్న 250 గ్రామాలు
గజ్వేల్, న్యూస్‌లైన్ : సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు సమ్మెబాట పట్టి ఐదు రోజులు కావస్తుండడంతో జిల్లాలో దాదాపు 250 గ్రామాల్లో ఈ పథకం నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, సంగారెడ్డి, హత్నూర, పుల్కల్, నర్సాపూర్, ఆందోల్, దుబ్బాక, జిన్నారం, పటాన్చెరు మండలాల్లోని 250 గ్రామాల్లో గత రెండు దశాబ్దాలుగా సత్యసాయి తాగునీటి పథకం అమలవుతోంది. ఈ పథకాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్వహిస్తుండగా ఈ కంపెనీ ద్వారా 135 మంది కార్మికులు ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. గత 13 నెలలుగా కార్మికులకు సంబంధించిన వేతన సవరణ చేయడంలో జిల్లా కార్మిక శాఖ అధికారులు, ఎల్ అండ్ టీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు విషయం తెలిసినా సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య అధికారుల సమక్షంలో పలుసార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వేతన సవరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో వేతనాలు అందక కార్మికులు గత 5న కార్మికులు సమ్మెనోటీసు ఇచ్చినా ఎల్అండ్టీ యాజమాన్యం స్పందించలేదు. ఫలితంగా కడుపు మండిన గత ఐదు రోజులుగా నీటి సరఫరాను పూర్తిగా నిలిపి వేసి సమ్మెలో ఉన్నారు. ఫలితంగా ఆయా మండలాల పరిధిలోని 250 గ్రామాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. సమ్మె మరింత ఉధృతం సమస్యల పరిష్కారంలో ఎల్అండ్టీ యాజమాన్యం, అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వేతన సవరణ పూర్తి చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. ఇందులో భాగంగానే శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నాం. అప్పటికీ స్పందనలేకపోతే సోమవారం ఆర్డబ్ల్యూఎస్, జిల్లా కార్మిక శాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తాం. - గాల్‌రెడ్డి, సత్యసాయి పథకం కార్మిక సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్