సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు సమ్మెబాట పట్టి ఐదు రోజులు కావస్తుండడంతో జిల్లాలో దాదాపు 250 గ్రామాల్లో ఈ పథకం నీటి సరఫరా నిలిచిపోయింది.
గజ్వేల్, న్యూస్‌లైన్ : సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు సమ్మెబాట పట్టి ఐదు రోజులు కావస్తుండడంతో జిల్లాలో దాదాపు 250 గ్రామాల్లో ఈ పథకం నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, సంగారెడ్డి, హత్నూర, పుల్‌కల్, నర్సాపూర్, ఆందోల్, దుబ్బాక, జిన్నారం, పటాన్‌చెరు మండలాల్లోని 250 గ్రామాల్లో గత రెండు దశాబ్దాలుగా సత్యసాయి తాగునీటి పథకం అమలవుతోంది. ఈ పథకాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్వహిస్తుండగా ఈ కంపెనీ ద్వారా 135 మంది కార్మికులు ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. గత 13 నెలలుగా కార్మికులకు సంబంధించిన వేతన సవరణ చేయడంలో జిల్లా కార్మిక శాఖ అధికారులు, ఎల్ అండ్ టీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు విషయం తెలిసినా సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య అధికారుల సమక్షంలో పలుసార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వేతన సవరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో వేతనాలు అందక కార్మికులు గత 5న కార్మికులు సమ్మెనోటీసు ఇచ్చినా ఎల్‌అండ్‌టీ యాజమాన్యం స్పందించలేదు. ఫలితంగా కడుపు మండిన గత ఐదు రోజులుగా నీటి సరఫరాను పూర్తిగా నిలిపి వేసి సమ్మెలో ఉన్నారు. ఫలితంగా ఆయా మండలాల పరిధిలోని 250 గ్రామాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు.
సమ్మె మరింత ఉధృతం
సమస్యల పరిష్కారంలో ఎల్‌అండ్‌టీ యాజమాన్యం, అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వేతన సవరణ పూర్తి చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. ఇందులో భాగంగానే శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నాం. అప్పటికీ స్పందనలేకపోతే సోమవారం ఆర్‌డబ్ల్యూఎస్, జిల్లా కార్మిక శాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తాం.
- గాల్‌రెడ్డి, సత్యసాయి పథకం కార్మిక సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్