‘సత్యం’ స్కామ్‌కు దశాబ్దం... అయినా మారని పరిస్థితి
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగి దశాబ్ద కాలం దాటిపోయినా ఇప్పటికీ కార్పొరేట్ సంస్థల ఖాతాల్లో వ్యత్యాసాలను గుర్తించేందుకు చాలా సమయం పడుతోందని టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానీ చెప్పారు. లోపాలకు చెక్ పెట్టేందుకు మరింత మెరుగైన డేటా అనలైటిక్స్ (సమాచార విశ్లేషణ ప్రొగ్రామ్‌లు) అవసరమని అభిప్రాయపడ్డారు. సత్యం కంప్యూటర్స్ ఖాతాల్లో అక్రమాల కుంభకోణం 2009 జనవరిలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సత్యం కంప్యూటర్స్‌ను టెక్ మహీంద్రా కొనుగోలు చేసి విలీనం చేసుకుంది. వ్యత్యాసాల గురించి అప్రమత్తం చేసేందుకు మన వ్యవస్థలు ఇప్పటికీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని, అవే సంక్షోభాలకు దారితీస్తున్నాయని గుర్నాని పేర్కొన్నారు. ‘‘అందరు భాగస్వాములు... బ్యాంకులు, రుణాలిచ్చే సంస్థలు, కంపెనీలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. సత్యం, ఐఎల్ఎఫ్ఎస్ తరహా సంక్షోభాలు తలెత్తకుండా చూసేందుకు, లోపాలను గుర్తించేందుకు మెరుగైన డేటా అనలైటిక్స్, డాష్‌బోర్డులు అవసరం ఉంది. మనమంతా తెలివైన వాళ్లమే. కానీ మనకు మెరుగైన విధానాలు, వ్యవస్థలు కావాలి’ అని గుర్నాని అభిప్రాయపడ్డారు. చిత్రంగా నాడు సత్యం ప్రమోటర్లకు చెందిన మేటాస్ ఇన్ఫ్రాను సొంతం చేసుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కూడా సంక్షోభంలో చిక్కుకుపోవడం గమనార్హం. రూ.94,000 కోట్లకు పైగా రుణభారంతో దివాలా దశకు చేరిన ఈ గ్రూపు నిర్వహణను ప్రభుత్వం ఇటీవలే తన ఆధీనంలోకి తీసుకుంది.
వాటాదాలకు ఎనిమిది రెట్ల ప్రలిఫలం...
సత్యం కంప్యూటర్స్‌ను సొంతం చేసుకున్న నాటి నుంచి చిన్న ఇన్వెస్టర్లకు ఎనిమిది రెట్ల ప్రతిఫలాన్ని అందించినట్టు టెక్ మహీంద్రా పేర్కొంది. ‘‘2009 ఏప్రిల్‌లో రూ.830 కోట్ల పెట్టుబడిపై రూ.6,614 కోట్ల ప్రతిఫలితాన్ని అందించాం. ఇందులో రూ.332 డివిడెండ్ (ఒక్కో ఇన్వెస్టర్) కూడా ఉంది. చిన్న ఇన్వెస్టర్లకు ఇది సుమారుగా ఎనిమిది రెట్ల ప్రతిఫలం’’ అని సీపీ గుర్నాని వివరించారు. సత్యం కంప్యూటర్స్ వ్యాపారాన్ని తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడానికి, క్లయింట్లలో భరోసా కల్పించేందుకు ఎంతో కృషి చేసినట్టు చెప్పారు.