కేంద్ర నిర్ణయంతో తెలంగాణకు తీరని నష్టం
♦ ‘షెడ్యూల్ 10’పై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి
♦ రాజ్నాథ్సింగ్కు కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్ 10లోని సంస్థల ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు ఆర్థికంగా భారీ నష్టం కలగడమే గాక పాలనపరంగా తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్ కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్కు ఇటీవల ఈ మేరకు లేఖ రాశారు. షెడ్యూల్ 10 సంస్థలపై కేంద్రం నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. కేంద్రం కూడా తమ వాదనకు మద్దతుగా అఫిడవిట్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ విభజనలో అవలంభించిన విధానాలనే ఈ విషయంలోనూ అనుసరించాలని కోరారు.
‘‘విభజన చట్ట నిబంధనల మేరకే షెడ్యూల్ 10లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు జరగాలన్న వైఖరికి తెలంగాణ కట్టుబడి ఉంది. ఏపీ ప్రభుత్వమేమో జనాభా దామాషా ప్రకారం పంపకాలు జరగాలంటోంది. దీంతో విభజన పెండింగ్లో పడింది. అలా పలు సంస్థలను ఉమ్మడిగా నిర్వహించాల్సి వస్తోంది. విభజనకు నోచుకోని సంస్థల్లో ఒకటైన ఏపీ ఉన్నత విద్య మండలి బ్యాంకు ఖాతాలను తెలంగాణ మండలి స్తంభింపజేయడాన్ని వారి ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. ఏపీ వాదనల్లో బలం లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఏపీ మండలికి సంబంధించిన ఏదైనా శాఖ ప్రస్తుత ఏపీ పరిధిలో ఉంటే దాని ఆస్తులు, అప్పుల పంపకాలు చేయవచ్చని అభిప్రాయపడింది’’ అని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
సొసైటీలు, చట్టబద్ధ సంస్థలు, కమిషన్లు, విశ్వవిద్యాలయాలు మాత్రమే విభజన చట్టంలోని సెక్షన్ 75 కిందికి వస్తాయన్నారు. ‘‘వీటిలో చాలావరకు ప్రభుత్వ నిధులు, ఉద్యోగుల సహకారం లేకుండా స్వయం సమృద్ధంగా పని చేస్తున్నాయి. కొన్ని మాత్రమే ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాయి. కనుక ఈ సంస్థల ఆస్తులు, అప్పులను ఏపీ రాష్ట్ర ఆస్తులు, అప్పులతో కలపడం ఏమాత్రం సరికాదు. సెక్షన్ 75 ప్రకారం వీటికి చట్టబద్ధ స్వతంత్ర ఉనికి ఉంది’’ అని లేఖలో సీఎం వివరించారు.