ఇక్రిశాట్ శాస్త్రవేత్త రాజీవ్ వార్ష్నీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వేరుశనగ దిగుబడులు రెట్టింపు చేయగల కొత్త వంగడాలు మరో ఐదేళ్లలో రైతులకు అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెట్టప్రాం త పంటల పరిశోధన కేంద్రం(ఇక్రిశాట్) శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ వార్ష్నీ తెలిపారు. ది ఇంట ర్నేషనల్ పీనట్ జినోమ్ ఇనిషియేటివ్(ఐపీజీఐ)లో భాగంగా వేరుశనగ మొక్క జన్యుక్రమ నమోదును పూర్తి చేయడం దీనికి కారణమని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఫలి తంగా పంట దిగుబడులను ఎక్కువ చేయగలగడంతోపాటు కరవును సైతం తట్టుకునే, గిం జల్లోని నూనె మోతాదును పెంచగల కొత్త వం గడాలను అభివృద్ధి చేయవచ్చునని వివరించారు.
సంప్రదాయ పద్ధతుల్లో ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసేందుకు పది పన్నెండేళ్లు పడుతుందని, జన్యుక్రమం అందుబాటులో ఉండటం వల్ల ఈ సమయం సగానికి తగ్గుతుందని ఆయన తెలిపారు. కరవును తట్టుకోగల కొన్ని వంగడాలను తామిప్పటికే సంప్రదాయ పద్ధతుల్లో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రైతులకు అందించామని అన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ దిగుబడులు హెక్టారుకు ఒక టన్నుకు మించడం లేదని... జన్యుక్రమాన్ని పరిశీలిస్తే 4 - 5 టన్నుల దిగుబడులూ సాధించగల సామర్థ్యం ఉందని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో దిగుబడులు కనీసం రెండు టన్నులకు పెంచగల వంగడాలను అభివృద్ధి చేయగలమని తాము గట్టి నమ్మకంతో ఉన్నామని చెప్పారు. పైగా ఈ కొత్త వంగడాలు జన్యుమార్పిడి పంటలు కావు కాబట్టి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వీటిని నేరుగా వాడుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
బొలీవియా మొక్క నుంచి...
ప్రస్తుతం ఉపయోగిస్తున్న వేరుశనగ దక్షిణ అమెరికాలోని బొలీవియా నుంచి ప్రపంచమంతా విస్తరించినట్లు ఐపీజీఐ పరిశీలన ద్వారా స్పష్టమైంది. రెండు వేర్వేరు జాతుల మొక్కల సంకరం ద్వారా పుట్టిన వేరుశనగలో రెండు జన్యుక్రమాలు ఉన్నాయని డాక్టర్ రాజీవ్ వార్ష్నీ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ జన్యుక్రమంలో వచ్చిన మార్పులు కూడా తక్కువేనని పూర్వజాతులతో పోలిస్తే 99.96 శాతం జన్యుక్రమం ఇప్పటికీ కొనసాగుతోందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డేవిడ్ బెర్టియోలీ అంటున్నారు. ఐజీపీఐలో ఇక్రిశాట్తోపాటు ఆరు దేశాలకు చెందిన 39 మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు.