scribe
-
గల్వాన్ వీరులకు మరింత గౌరవం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు 20మంది అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. జవాన్ల త్యాగాన్ని దేశం వేనోళ్ల కొనియాడింది. తాజాగా ఈ అమరవీరులకు మరింత గౌరవం ఇవ్వడం కోసం కేంద్రం సిద్ధమయినట్లు సమాచారం. నాటి ఘర్షణలో అసవులు బాసిన ఈ 20 మంది సైనికుల పేర్లను ‘నేషనల్ వార్ మెమోరియల్’పై చెక్కేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది నెలల్లో ఇది ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం) జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా ఒక నిఘా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ దాడిలో చైనా సైనికులు.. రాళ్లు, మొలలు దిగిన కర్రలు, ఇనుప రాడ్లతో మన సైనికులపై దాడి చేశారు. నాటి ఘటనలో 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 35 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చైనా వారికి ప్రభుత్వ లంఛనాలతో అంత్యక్రియలు కాదు కదా కనీసం అమరులైనా సైనికుల పేర్లు కూడా వెల్లడించలేదు. కానీ భారత్ మాత్రం మన సైనికుల త్యాగాన్ని గర్వంగా వెల్లడించింది. -
యోగి కేసులో జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను ఢిల్లీలో శనివారం నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత ఏడాది కాలంగా తనతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతున్నారని, రాజకీయ నేతగా మారిన సన్యాసి తన జీవితాంతం తనతో ఉండేందుకు సిద్ధ పడతారా ? అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో క్లిప్‌ను షేర్ చేశారన్న అభియోగంతో కనోజియాను అరెస్ట్ చేశారు. ప్రధానంగా మహిళల అభిప్రాయాలను ప్రసారం చేసే ‘నేషనల్ లైవ్’ అనే టీవీ ఛానల్ ఎడిటర్‌ను కూడా కొన్ని గంటల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ వీడియో క్లిప్పును ప్రసారం చేసినందుకే ఛానల్ ఎడిటర్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కనోజియాపై భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్, సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఐపీఎస్ 500 సెక్షన్ ప్రకారం అది ‘నాన్‌కాగ్నిజబుల్’ నేరం. అంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థం. ఈ సెక్షన్ కింద పోలీసులు ఎవరిని నేరుగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా కచ్చితమైన ఫిర్యాదు ఇచ్చిన పక్షంలోనే స్పందించాలి. ఈ కేసులో పరువు పోయే అవకాశం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కనుక, ఆయన వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేసినప్పుడు మాత్రమే చట్ట నిబంధన ప్రకారం పోలీసులు స్పందించాలి. ఆయన ఫిర్యాదు లేకుండానే పోలీసులు స్పందించారంటే చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఆయన వ్యక్తిగత ప్రజా సంబంధాల టీమ్‌గా వ్యవహరించడమే. ఇక సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్ ఎవరి మీద దాఖలు చేయాలంటే మొత్తం ‘కంప్యూటర్ వ్యవస్థ స్తంభించడం’కు కారకుడైన వారిపైన. ఇక్కడ జర్నలిస్ట్ ప్రశాంత్ ఒకామీ వీడియో క్లిప్పింగ్‌ను ట్వీట్ ద్వారా షేర్ చేశారు. ఆయన ట్వీట్ ద్వారా మొత్తం కంప్యూటర్ వ్యవస్తే ఎలా స్తంభించిపోతుంది? ఇలా పోలీసులు అత్యుత్సాహంతో అన్యాయంగా భారతీయ పౌరులను అరెస్ట్ చేయడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. అందుకనే భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి 180 దేశాల్లో భారత్‌కు 138వ స్థానం లభించింది. వీటిలో దాదాపు 90 శాతం కేసులు కోర్టుల ముందు నిలబడవు. గత మేనెలలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్ చేసి పెట్టినందుకు అరెస్టయిన బీజేపీ కార్యకర్తను కోర్టు జోక్యం చేసుకొని వదిలేసింది. కోణార్క్ దేవాలయంపై బూతు బొమ్మలున్నాయంటూ వ్యాఖ్యానించి అరెస్టయిన కేంద్ర రక్షణ శాఖ విశ్లేషకుడిని కూడా కోర్టు విడుదల చేసింది. -
ఆర్టీఐ పత్రాలను ఫోర్జరీ చేశాడు!
న్యూఢిల్లీ: ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు చెప్తూ.. ఆయుష్ మంత్రిత్వశాఖ ముస్లింలకు ఉద్యోగాలను ఇవ్వలేదని చెప్పిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. తాను ఆ విషయాన్ని ఆర్టీఐ నుంచి మాత్రమే తీసుకున్నట్లు శర్మ వివరించారు. గత ఏడాది మార్చినెలలో16 నుంచి 31 తేదిల మధ్య సమయంలో మిల్లీ గెజిట్ లో ఈ విషయాన్ని ప్రచురించారు. ఈ విషయంపై శర్మను విచారించిన కోట్లా ముబారక్పూర్ పోలీసుల దేశాన్ని, ఢిల్లీని వదలి వెళ్లకూడదనే కండీషన్ తో శర్మను విడిచిపెట్టారు. పోలీసులు మిల్లీ గెజిట్ మ్యాగజైన్ ఎడిటర్ డా.జర్ఫారుల్ ఇస్లాం ఖాన్ ను ఈ కేసులో సాక్షిగా పేర్కొన్నారు. -
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి!
♦ అంధ విద్యార్థికి స్క్రైబ్ ఏర్పాటు చేయడం మరచిన హెచ్ఎం ♦ ఇపుడేం చేయలేమంటూ చేతులెత్తేసిన ఇన్విజిలేటర్లు, పరీక్షల చీఫ్ ♦ నాలుగు పరీక్షల్లో తెల్ల కాగితాలు అప్పగించి వచ్చిన విద్యార్థి ♦ ఐదవ పరీక్షలో సమస్యను గుర్తించిన డిప్యూటీ ఈఓ ♦ స్క్రైబ్‌ను ఏర్పాటు చేసి పరీక్ష రాయించిన వైనం కమలాపురం అర్బన్ : అధికారుల అవగాహనరాహిత్యానికి ఓ అంధ విద్యార్థి పదవ తరగతి తొలి నాలుగు పరీక్షలు రాయలేకపోయిన వైనమిది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఆర్సీఎం పాఠశాలలో జి.మధుకేశవ అనే అంధ విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. ఇతను పది పరీక్షలు రాసేందుకు స్క్రైబ్ (సమాధానం చెబితే విని రాసేవాడు) అవసరం ఉంటుందని నామినల్ రోల్స్‌లో పొందు పరచాల్సి ఉన్నప్పటికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ విషయాన్ని విస్మరించాడు. పరీక్ష కేంద్రంగా కమలాపురం జెడ్పీ బాలుర పాఠశాల కేటాయించారు. ఈ నెల 21వ తేదీన తొలి రోజు పరీక్షకు హాజరైన ఈ విద్యార్థి.. తనకు చూపు లేదని, పరీక్ష రాసేందుకు సహాయకుడు ఎక్కడున్నాడని అడిగాడు. ఆ విషయం గురించి తమకు సమాచారం లేదని ఎగ్జామినేషన్ చీఫ్, ఇన్విజిలేటర్లు అనుమతించ లేదు. దీంతో ప్రశ్నలకు సమాధానాలు బాగా తె లిసిన ప్పటికీ ఆ విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు. రెండవ, మూడవ, నాలుగవ పరీక్షకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. సమయం ముగిసే వరకు ఖాళీగా కూర్చొని ఏమీ రాయని తెల్లకాగితాన్ని ఇన్విజిలేటర్లకు ఇచ్చి వచ్చాడు. అయినా పట్టు విడవక ఐదవ పరీక్ష.. ఇంగ్లిషు-2కు సోమవారం హాజరయ్యాడు. పరీక్షల పర్యవేక్షణకు వచ్చిన రాయచోటి డిప్యూటి ఈవో రంగారెడ్డి.. ఈ విద్యార్థి ఖాళీగా కూర్చొని ఉండటం చూసి ఏమైందంటూ ఆరా తీశారు. ఈ విద్యార్థి తన సమస్యను చెప్పడంతో వెంటనే స్క్రైబ్‌ను ఏర్పాటు చేయాలని పరీక్షల చీఫ్‌ను ఆదేశించారు. పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న టి.మహేశ్ అనే విద్యార్థి సహాయంతో పరీక్ష రాశాడు. పరీక్ష ముగిశాక ఈ విషయం కలకలం రేపింది. అధికారులు విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా స్పందించి సహాయం చేయాలే కాని నియమ నిబంధనలు అంటూ విద్యార్థి జీవితం పాడవుతుంటే చూస్తూ మిన్నకుండిపోవడం క్షమార్హం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విద్యార్థి సమస్యను స్థానిక అధికారులు తొలి రోజే ఉన్నతాధికారులకు తెలియజేసింటే ఈ తప్పిదం చోటుచేసుకుని ఉండేది కాదని డిప్యూటీ ఈఓ రంగారెడ్డి అన్నారు. కాగా, తనకు స్రైబ్ ద్వారా పరీక్ష రాసే అవకాశం కల్పించడంపై మధుకేశవ హర్షం వ్యక్తం చేశాడు. ఆ వెంటనే.. తొలి నాలుగు పరీక్షలు రాసి ఉండింటే బావుండేదని ఆవేదన వ్యక్తం చేశాడు.