తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి!
♦ అంధ విద్యార్థికి స్క్రైబ్ ఏర్పాటు చేయడం మరచిన హెచ్‌ఎం
♦ ఇపుడేం చేయలేమంటూ చేతులెత్తేసిన ఇన్విజిలేటర్లు, పరీక్షల చీఫ్
♦ నాలుగు పరీక్షల్లో తెల్ల కాగితాలు అప్పగించి వచ్చిన విద్యార్థి
♦ ఐదవ పరీక్షలో సమస్యను గుర్తించిన డిప్యూటీ ఈఓ
♦ స్క్రైబ్‌ను ఏర్పాటు చేసి పరీక్ష రాయించిన వైనం
కమలాపురం అర్బన్ : అధికారుల అవగాహనరాహిత్యానికి ఓ అంధ విద్యార్థి పదవ తరగతి తొలి నాలుగు పరీక్షలు రాయలేకపోయిన వైనమిది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఆర్‌సీఎం పాఠశాలలో జి.మధుకేశవ అనే అంధ విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. ఇతను పది పరీక్షలు రాసేందుకు స్క్రైబ్ (సమాధానం చెబితే విని రాసేవాడు) అవసరం ఉంటుందని నామినల్ రోల్స్‌లో పొందు పరచాల్సి ఉన్నప్పటికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ విషయాన్ని విస్మరించాడు. పరీక్ష కేంద్రంగా కమలాపురం జెడ్పీ బాలుర పాఠశాల కేటాయించారు. ఈ నెల 21వ తేదీన తొలి రోజు పరీక్షకు హాజరైన ఈ విద్యార్థి.. తనకు చూపు లేదని, పరీక్ష రాసేందుకు సహాయకుడు ఎక్కడున్నాడని అడిగాడు. ఆ విషయం గురించి తమకు సమాచారం లేదని ఎగ్జామినేషన్ చీఫ్, ఇన్విజిలేటర్లు అనుమతించ లేదు.
దీంతో ప్రశ్నలకు సమాధానాలు బాగా తె లిసిన ప్పటికీ ఆ విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు. రెండవ, మూడవ, నాలుగవ పరీక్షకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. సమయం ముగిసే వరకు ఖాళీగా కూర్చొని ఏమీ రాయని తెల్లకాగితాన్ని ఇన్విజిలేటర్లకు ఇచ్చి వచ్చాడు. అయినా పట్టు విడవక ఐదవ పరీక్ష.. ఇంగ్లిషు-2కు సోమవారం హాజరయ్యాడు. పరీక్షల పర్యవేక్షణకు వచ్చిన రాయచోటి డిప్యూటి ఈవో రంగారెడ్డి.. ఈ విద్యార్థి ఖాళీగా కూర్చొని ఉండటం చూసి ఏమైందంటూ ఆరా తీశారు. ఈ విద్యార్థి తన సమస్యను చెప్పడంతో వెంటనే స్క్రైబ్‌ను ఏర్పాటు చేయాలని పరీక్షల చీఫ్‌ను ఆదేశించారు.
పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న టి.మహేశ్ అనే విద్యార్థి సహాయంతో పరీక్ష రాశాడు. పరీక్ష ముగిశాక ఈ విషయం కలకలం రేపింది. అధికారులు విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా స్పందించి సహాయం చేయాలే కాని నియమ నిబంధనలు అంటూ విద్యార్థి జీవితం పాడవుతుంటే చూస్తూ మిన్నకుండిపోవడం క్షమార్హం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విద్యార్థి సమస్యను స్థానిక అధికారులు తొలి రోజే ఉన్నతాధికారులకు తెలియజేసింటే ఈ తప్పిదం చోటుచేసుకుని ఉండేది కాదని డిప్యూటీ ఈఓ రంగారెడ్డి అన్నారు. కాగా, తనకు స్రైబ్ ద్వారా పరీక్ష రాసే అవకాశం కల్పించడంపై మధుకేశవ హర్షం వ్యక్తం చేశాడు. ఆ వెంటనే.. తొలి నాలుగు పరీక్షలు రాసి ఉండింటే బావుండేదని ఆవేదన వ్యక్తం చేశాడు.