'కార్పొరేట్ గూఢచర్యం'పై చర్చిద్దాం
కార్పొరేట్ గూఢచర్యం కేసుకు సంబంధించిన విషయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సమాజ్‌వాది పార్టీకి చెందిన నరేశ్ అగర్వాల్ ఈ విషయంపై చర్చను లేవనెత్తారు. ముఖ్యమైన శాఖల(పెట్రోలియం, రక్షణ, విదేశీ)కు చెందిన విలువైన రహస్య పత్రాలు లీకయినప్పటికీ అందుకు కారణమైన ప్రధానమైన వ్యక్తులను వదిలేసి చిన్నచితకా, జూనియర్స్‌ను మాత్రమే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు.
దీంతో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ కార్యదర్శి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకుని ఈ విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పెట్రోలియంశాఖతోపాటు రక్షణశాఖకు చెందిన పలు విలువైన పత్రాలు లీకైన విషయంపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే.