సెక్షన్ ఆఫీసర్లు తెలంగాణలోనే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏపీ స్థానికత ఉన్న సెక్షన్ ఆఫీసర్లను తాత్కాలికంగా తెలంగాణలోనే కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెక్షన్ ఆఫీసర్ల పంపిణీ ప్రక్రియ తెలంగాణకు మరింత భారంగా మారినట్లయింది. 24 మంది సెక్షన్ ఆఫీసర్లకు విధులు నిర్వహించకున్నా జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తుది కేటాయింపుల సమయంలోనే సచివాలయంలో పనిచేస్తున్న ఆంధ్ర స్థానికత ఉన్న 24 మంది సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణ ప్రభుత్వం ఏపీకి రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోలేదు. తుది కేటాయింపులు జరిగాక తాము చేర్చుకోలేమని స్పష్టం చేసింది. సరిపడా పోస్టులు లేనందున చేర్చుకోవటం వీలు కాదని అభ్యంతరం తెలిపింది.
సమస్య పరిష్కారానికి రిలీవ్ చేసిన సెక్షన్ అధికారులను విధుల్లోకి తీసుకుంటే.. అక్కడ పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిపాదన తెచ్చింది. ఏపీ సర్కారు సైతం అంగీకరించింది. అయితే ఇదే సమయంలో కొందరు సెక్షన్ ఆఫీసర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించేంత వరకు 24 మంది సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణలో కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. పని చేసిన కాలానికి, మధ్యలో ఉన్న వ్యవధికి కూడా జీతాలు చెల్లించాలని సూచించింది.