ఫ్యూచర్ థ్రెట్.. సైబర్ టెర్రరిజం
సైబర్ నేరగాళ్లు.. లక్షలు, కోట్లలో డబ్బులు వ్యక్తిగత ఖాతాల్లోంచి కొల్లగొట్టడమే కాదు.. సైబర్ టెర్రరిజానికి తెరతీస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాద ముప్పు క్రమంగా కొత్త రూపు సంతరించుకుంటోంది.. ఇది భవిష్యత్తులో జడలువిప్పుకుని సైబర్ టెర్రరిజంగా మారి మానవాళికి ఫ్యూచర్ థ్రెట్‌గా మారబోతోందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? దీంతో ప్రపంచ దేశాలకు వచ్చే ముప్పు ఏంటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలపై ‘సాక్షి ’ప్రత్యేక కథనం. రోజువారీ జీవితంలో సాంకేతికతపై ఆధారపడటం విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన తీవ్రవాదులు వారి ప్రయోజనాల కోసం ఇందులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొనే అవకాశం కూడా పెరుగుతోంది. జనజీవనాన్ని స్తంభింపజేసి, వ్యవస్థలను గందరగోళపర్చి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు డిజిటల్ సాధనాలు, సాంకేతికతను ఉపయోగించడాన్ని సైబర్ టెర్రరిజంగా చెబుతున్నారు సైబర్ భద్రత నిపుణులు. తరచుగా హింసపై ఆధారపడే సంప్రదాయక ఉగ్రవాద రూపాల్లా కాకుండా సైబర్ ఉగ్రవాదులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇంటర్నెట్ను ఉపయోగించుకుని వర్చువల్‌గా పనిచేస్తారు. సైబర్ దాడులతో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలను హ్యాక్ చేయడం, కీలకమైన మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయాన్ని కలిగించడం, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, ప్రజల్లో విస్తృతమైన భయాందోళనలు సృష్టించడం సైబర్ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యాలు. – సాక్షి, హైదరాబాద్సైబర్ టెర్రరిజానికి గురవుతున్న ప్రధాన రంగాలు సైబర్ ఉగ్రవాదులు ప్రభుత్వరంగ సంస్థలు, పవర్ గ్రిడ్లు, రవాణా నెట్‌వర్క్‌లు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాకు అంతరాయం సృష్టించి ప్రజా భద్రత, సంక్షేమానికి ఆటంకాలు కలిగిస్తారు. ప్రతికూల పరిస్థితులను సృష్టించి సామాజిక జీవనాన్ని బలహీనపర్చడం వీరి లక్ష్యం. సోషల్ మీడియా, ఆన్లైన్ ఫోరమ్‌ల ద్వారా తీవ్రవాద భావజాల వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు సైబర్ టెర్రరిజాన్ని వాడుతున్నారు. సైబర్ టెర్రరిజాన్ని ఇలా ఎదుర్కోవచ్చు» సైబర్ సెక్యూరిటీ చర్యలు: సైబర్ టెర్రరిస్ట్‌ల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు సైబర్ సెక్యూరిటీ సాంకేతికతను, సైబర్ దాడులను అడ్డుకోవడానికి బలమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటుచేసుకోవాలి. చొరబాట్లను గుర్తించే వ్యవస్థలు, ఎన్క్రిప్షన్ మెకానిజమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వీటి కోసం ప్రభుత్వం అదనంగా పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పరస్పర సహకారంతో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేలా ఉమ్మడి ప్రణాళికలు అమలు చేయాలి. » అంతర్జాతీయ సహకారం: సైబర్ ఉగ్రవాదం ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, సైబర్నేరగాళ్లను పట్టుకోవడానికి ఆయా దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలి. » ప్రజల్లో అవగాహన పెంచాలి: ఫిషింగ్ స్కామ్‌లు, మాల్వేర్ బెదిరింపులు ఇతర సైబర్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు శిక్షణ, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలి. 4 రకాలుగా హాని » సైద్ధాంతిక ఉగ్రవాదం: సైబర్ ఉగ్రవాదులు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, అనుచరులను నియమించుకోవడానికి, ప్రత్యర్థులపై హింసను ప్రేరేపించడానికి సైబర్‌స్పేస్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. » భౌగోళిక, రాజకీయ లక్ష్యాలు: ప్రత్యర్థి ప్రభుత్వాలను అణగదొక్కడం, రహస్యమైన సమాచారాన్ని దొంగిలించడం, శత్రు భూభాగంలో కీలకమైన అవసరాలకు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తారు. » ఆర్థిక లాభం: సైబర్ టెర్రరిజం లక్ష్యం సైతం ఆర్థిక వ్యవస్థల్ని దోచుకోవడమే. ఉగ్ర సంస్థలు లేదా హ్యాకర్లు ర్యాన్సమ్వేర్ దాడులు, ఆర్థిక మోసాలతో డబ్బులు కొల్లగొడుతారు. అవసరమైన డేటాను ఎన్‌క్రిప్‌్ట, డిక్రీప్ట్ చేయడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తారు. » సైకలాజికల్ వార్ఫేర్: భయం, అనిశి్చతి, అపనమ్మకాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపేలా ప్రభుత్వరంగ సంస్థలను హ్యాక్ చేస్తుంటారు. ఎలా చేస్తారు? మాల్వేర్: వైరస్లు, ట్రోజన్లు, ర్యాన్సమ్వేర్ వంటి హానికర సాఫ్ట్వేర్లను సైబర్ ఉగ్రవాదులు ఎక్కువగా వాడుతున్నారు. ఫిషింగ్: వీటిని సోషల్ ఇంజనీరింగ్ ఎటాక్‌గా చెప్పొచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న సంస్థల నెట్‌వర్క్‌లు, సంస్థలు, వ్యక్తులకు మోసపూరిత ఈ– మెయిల్లు, ఎస్ఎంఎస్లలో లింకులు పెట్టి పంపుతారు. దీని ద్వారా హాక్ చేస్తే కలిగే నష్టం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్విస్: వీటినే డీడీఓఎస్ దాడులు అంటారు. టార్గెట్ చేసిన నెట్‌వర్క్‌కు విపరీతమైన ట్రాఫిక్ ఉండేలా చేసి వాటిని వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక లేదా ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ఉపయోగిస్తారు. ఆరి్థక, ఆరోగ్య రంగాల్లో గందరగోళం సృష్టించడం ఈ దాడి లక్ష్యం. సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ ఎటాక్: సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ప్రోటోకాల్‌లోని చిన్నపాటి లోపాలను ఆసరాగా తీసుకుని దాడులు చేస్తారు. సప్లై చైన్ అటాక్స్: కస్టమర్లు లేదా క్లయింట్ల నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు థర్డ్ పార్టీ విక్రేతలుగా చేరి నెట్‌వర్క్‌కు హాని కల్గిస్తారు. మచ్చుకు కొన్ని ఘటనలను చూస్తే.. సైబర్ టెర్రరిజం వేళ్లూనుకుంటుందనడానికి ఇటీవలి కొన్ని పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. హ్యాకర్లు సోనీ అంతర్జాతీయ సంస్థపై సైబర్ దాడి చేసి గోప్యమైన సమాచారాన్ని హ్యాక్ చేసి సంస్థ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి డేటాపై రామ్సన్వేర్ ఎటాక్ జరగడం, హైదరాబాద్‌లో ఏపీ మహేశ్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు హ్యాకింగ్ ఘటన, తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం కూడా ఇలాంటి కోవలోనివే. గుర్తించకపోతే అనర్థాలు సాంకేతికత వినియోగం పెరిగేకొద్దీ సైబర్ టెర్రరిజం ముప్పు కూడా పెరుగుతోంది. ఇది అనేక రంగాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు అన్ని స్థాయిల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు చర్యలు ప్రారంభించాలి. భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే సైబర్ టెర్రరిజం ముప్పును గుర్తించకపోతే అనర్థాలు తప్పవు. – అద్వైత్ కంభం, సైబర్ సెరిటీ ట్రైనర్