ఏపీ సచివాలయంలో భద్రత డొల్ల!
♦ యథేచ్ఛగా సామాన్యుడి గుర్రం స్వారీ
♦ ఆలస్యంగా గుర్తించిన భద్రతా సిబ్బంది
♦ సచివాలయం ప్రధాన రహదారిపై అప్పాజీ హడావుడి
అమరావతి
వెలగపూడి సచివాలయంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కొలువుండే సచివాలయంలో ఎలాంటి అనుమతులు లేకుండానే.. ఓ సామాన్య పౌరుడు యథేచ్ఛగా లోపలకు వచ్చి, గుర్రంస్వారీ కూడా చేశాడు. సచివాలయంలో ప్రధాన రహదారిపై హడావుడి చేశాడు. దాదాపుగా సీఎం ఛాంబర్ సమీపంలోకి వెలగపూడి గ్రామానికి చెందిన కారుమంచి అప్పాజీ గుర్రంపై వచ్చాడు. సచివాలయంలోకి రావాలంటే ముందుగా మెయిన్ గేటు వద్ద ఉన్న సిబ్బంది చెక్ చేసిన తర్వాతే ఎవరినైనా లోపలికి అనుమతి ఇస్తారు.
అలాంటిది ఒక సామాన్య వ్యక్తి స్వేచ్ఛగా వీవీఐపీలు ఉండే ప్రదేశంలో తిరిగాడంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉందని అనేకసార్లు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు కూడా చేశారు. గతంలో రాజధాని ప్రాంతంలో ఒక మహిళా మావోయిస్టును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన భద్రతా సిబ్బంది మాత్రం సచివాలయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పాజీ సచివాలయం ప్రాంగణంలో గుర్రంపైన తిరగడాన్ని కాస్తంత ఆలస్యంగా గమనించిన భద్రతా సిబ్బంది.. అతడిని బయటకు పంపేశారు.