నాట్లు.. పాట్లు
తణుకు, న్యూస్‌లైన్ : చలిగాలులు పెరిగారుు. మడుల్లోని నారు ఎదుగుదలను దెబ్బతీస్తున్నారుు. ఫలితంగా వరినాట్లు ఆలస్యమవుతున్నారుు. ఊడ్పులకు అదును దాటిపోతుండటంతో రానున్న రోజుల్లో సాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మడుల్లో 21నుం చి 30 రోజులపాటు పెరిగిన (రెండుమూడు ఆకులున్న) నారును చేలల్లో నాటుతారు.
రాత్రి ఉష్ణోగ్రతలు 14-15 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గిపోవటం, పొగమంచు అధికంగా కురవడంతో నారు ఎదగటం లేదు. 21 రోజులు దాటినా మళ్లలోని నారు 15 రోజుల క్రితం వేసినట్టుగా ఉంటోంది. దీనిని చేలల్లో ఊడ్చితే నీట మునిగి కుళ్లిపోతుందనే భయంతో నాట్లు వేయడానికి రైతులు సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు నాట్లు వేసిన చేలల్లోని వరి సైతం సక్రమంగా ఎదగకపోవటంతో ఎక్కువ నారు ఉపయోగించాల్సి వస్తోంది.
దీనివల్ల నారు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. సాధారణంగా రబీలో ఎకరం పొలంలో నాటడానికి 37నుంచి 50 కేజీల విత్తనాన్ని నారుపోస్తారు. 50 కేజీల విత్తనం వేసినా ఆ నారు ఎకరంలో నాటడానికి సరిపోవడం లేదు.
పొంచివున్న సాగునీటి కష్టాలు
జనవరి మొదటి వారానికల్లా వరినాట్లు పూర్తి చేస్తేనే రైతులు సాగునీటి ఎద్దడి నుంచి బయటపడగలుగుతారు. మార్చి 31నాటికి కాలువల కట్టివేస్తామని అధికారులు ప్రకటించారు. నాట్లు ఆలస్యమైతే సాగు చివరి దశలో నీటికి కొరత ఏర్పడుతుందని ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తణుకు ప్రాంతంలో 75శాతం ఆయకట్టులో మాత్రమే వరినాట్లు పూర్తరుునట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది.
తూర్పువిప్పర్రు, కె.ఇల్లిందలపర్రు, తణుకు, దువ్వ, కంతేరు, కత్తవపాడు, రేలంగి, కొత్తపాడు, పొదలాడ, కొమ్మర, ఈడూరు తదితర ప్రాంతాల్లో నాట్లు పూర్తికాలేదు. మరో 10 రోజులకు గాని ఊడ్పులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. నాట్లు 20 రోజులపాటు ఆలస్యమవుతున్నాయని, కాలువలు కట్టివేసే విషయంలో ఇరిగేషన్ అధికారులు స్పష్టత ఇవ్వకపోతే ఆలస్యంగా ఊడ్చిన రైతులు ఇబ్బందిపడే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇస్తే తప్ప రైతులు గట్టెక్కే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.