Seemandhra Eletion
-
సబ్బంపై రెండు కేసుల నమోదుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ విశాఖపట్టణం లోక్‌సభ అభ్యర్థి సబ్బం హరిపై రెండు కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ప్రచారంపై నిషేధం ఉండగా హరి ఒక పార్టీకి ఓటు వేయాలని చెప్పడాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్-126 ప్రకారం ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా భావించి కేసు నమోదుకు ఆదేశించడంతో పాటు ఆయనకు నోటీసు జారీ చేస్తామని చెప్పారు. హరి మరో పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆయనను డమ్మీ అభ్యర్థిగా పరిగణిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం డమ్మీ అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని ప్రధాన అభ్యర్థి ఎన్నికల ఖాతాలో జమ చే యనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింటుందా? అని ఓ టీవీ చానల్ ప్రసారం చేయడాన్ని భన్వర్‌లాల్ తప్పుపట్టారు. గతంలో కూడా ఆ టీవీ చానల్ వాహనంలో అభ్యర్థికి చెందిన సెల్ఫోన్లు దొరికాయని, ఈ రెండు అంశాలపైన కేసు నమోదు చే యడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
'సబ్బం హరిపై కేసు నమోదు చేస్తాం'
హైదరాబాద్: ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ మరో పార్టీకి మద్దతు ప్రకటించడం చెల్లదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సబ్బం హరిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అలా మద్దతు ప్రకటించేవారిని డమ్మీ అభ్యర్థులుగా ప్రకటిస్తామన్నారు. డమ్మీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఖర్చులో కలుపుతామని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా పెట్టిన అన్ని కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారణ చేపడతామన్నారు. ప్రలోభాలతో తాత్కాలికంగా ఎన్నికైనా ఎన్నికల చట్టాల ప్రకారం శిక్ష తప్పదన్నారు. ఓటర్ స్లిప్పులు లేకపోయినా ఓటర్ లిస్ట్‌లో పేరుంటే ఓటు వేయొచ్చని వివరించారు. ఓటర్ పోలింగ్ బూత్‌లోకి ఓటర్లు వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పకూడదన్నారు. పక్క గ్రామాల నుంచి కూడా పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చని భన్వర్‌లాల్ తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.