సబ్బంపై రెండు కేసుల నమోదుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ విశాఖపట్టణం లోక్‌సభ అభ్యర్థి సబ్బం హరిపై రెండు కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ప్రచారంపై నిషేధం ఉండగా హరి ఒక పార్టీకి ఓటు వేయాలని చెప్పడాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్-126 ప్రకారం ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా భావించి కేసు నమోదుకు ఆదేశించడంతో పాటు ఆయనకు నోటీసు జారీ చేస్తామని చెప్పారు. హరి మరో పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆయనను డమ్మీ అభ్యర్థిగా పరిగణిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం డమ్మీ అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని ప్రధాన అభ్యర్థి ఎన్నికల ఖాతాలో జమ చే యనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింటుందా? అని ఓ టీవీ చానల్ ప్రసారం చేయడాన్ని భన్వర్‌లాల్ తప్పుపట్టారు.
గతంలో కూడా ఆ టీవీ చానల్ వాహనంలో అభ్యర్థికి చెందిన సెల్‌ఫోన్‌లు దొరికాయని, ఈ రెండు అంశాలపైన కేసు నమోదు చే యడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.