Seleru
-
విశాఖ ఏజెన్సీ ఘాట్ రోడ్డులో దుండగుల హల్చల్
సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ సీలేరు పోలీస్‌స్టేషన్ పరిధి ధారాలమ్మ ఘాట్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దుండగులు అరాచకం సృష్టించారు. ఆలయం సమీపంలోని రెండో మలుపు వద్ద దారి కాచి, అటుగా వచ్చిన కార్లపై దాడి చేసి బంగారం, నగదు, సెల్ ఫోన్లు దోచుకున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ అందించిన వివరాలు.. మంగళవారం రాత్రి పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు సీలేరులో సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించి రాత్రి 9 గంటలకు తిరిగి చింతపల్లికి కారులో వెళుతున్నారు. ధారాపురం ఘాట్‌రోడ్డు వద్ద రాత్రి 11.30గంటల సమయంలో ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు వచ్చి కారును అడ్డగించారు. అనుమానం వచ్చి వేగంగా వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇనుపరాడ్లతో అద్దాలు ధ్వంసం చేశారు. అయితే ఆయన తప్పించుకుని వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారు జామున 4.30 ప్రాంతంలో పాల్వంచ నుంచి సీలేరు మీదుగా లంబసింగికి కారులో ఐదుగురు వెళుతుండగా.. నాటు తుపాకులు, కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు దోచుకున్నారు. దుండగులు ధ్వంసం చేసిన కారు అద్దాలు అది జరిగిన మరో అరగంటలో సీలేరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యాపారి.. భార్య ఈశ్వరమ్మతో కలిసి కారులో వెళ్తుండగా ఐదుగురు వచ్చి.. తాము పోలీసులమని, తనిఖీలు చేయాలని చెప్పారు. కారు అద్దాలు దించేలోగా ఇద్దరి మెడలోని ఐదు తులాల బంగారం గొలుసులను లాక్కుని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలయ్యాయి. వెనుక నుంచి బస్సు వస్తుండటంతో దుండగులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారంతా ఒడిశాకి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మావోయిస్టులకు సహకరిస్తున్న హోంగార్డులు
సాక్షి, తూర్పు గోదావరి: సీలేరు జెన్కోలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. కిలో బాబురావు, మరిగల నాగేశ్వరరావు అనే ఇద్దరు హోంగార్డులు గత కొంతకాలంగా మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు మండలంలోని లంకపాకల వద్ద మావోయిస్టులకు కలిసి వస్తుంటే వారిద్దరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరూ మావోయిస్టు నేతలు చలపతిరావు, అరుణకు సహరిస్తున్నట్లు తేలిందని చింతపల్లి ఓఎస్డీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీలేరు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం..
విశాఖ జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదాఘాతం వల్ల ఇద్దరు ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. శుక్రవారం జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్ యార్డ్‌లో సమస్య వస్తే ఉద్యోగులు సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో శివకుమార్, ఎం.లక్ష్మయ్య కర్రతో వైర్‌ను కొట్టగా షాక్‌కు గురయ్యారు. శివకుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
సీలేరులో భారీ వడగండ్ల వాన
విశాఖ జిల్లా సీలేరులోని దారాలమ్మఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురుగాలులతో జనం భయాందోళన లకు గురయ్యారు. అంతర్రాష్ట్ర ర హదారిపై దాదాపు గంటన్నరపాటు కురిసిన వానతో చెట్లు విరిగి పడి రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద సైజు వడగండ్లు పడుతుండటంతో జనం బయటకు రావటానికే భయపడిపోయారు. సీలేరులో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. -
కేబుల్ వైర్లపై స్మగ్లర్ల వేటు!
గంజాయి రవాణాకు కొత్త ఎత్తుగడ పోలీసులకు సమాచారం అందకుండా సెల్ సేవలకు అంతరాయం సీలేరు: గంజాయి రవాణాకు స్మగ్లర్లు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. ఎలాగైనా కోట్లకు పడగెత్తాలనే ఉద్దేశంతో అనేక తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. వారు పండించిన గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా మైదాన ప్రాంతానికి తరలించే క్రమంలో ఏజెన్సీలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. గంజాయి రవాణా చేస్తున్న సమయంలో జీకేవీధి మండలం మారుమూల గ్రామాల్లో సెల్ సేవలకు అంతరాయం కలిగిస్తున్నారు. గంజాయి రవాణాలో పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారన్న నెపంతో ఓఎస్డీ కేబుల్‌ను కాల్చివేయడం, గొడ్డలితో నరికేయడం వంటి పనులకు పాల్పడుతున్నారు. మారుమూల గ్రామాల నుంచి తరలిస్తున్న గంజాయి ఇటీవల వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసులకు పట్టుబడింది. ఈ కేసుల్లో పలువురు జైలు పాలయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం చేరకుండా గంజాయి స్మగ్లర్లు సెల్ సిగ్నల్‌కు అంతరాయం కలిగించి గంజాయి తరలిస్తున్నారు. జీకేవీధి నుంచి సీలేరు వరకు కొన్ని చోట్ల మార్గమధ్యలో వంతెనల దగ్గర ఓఎఫ్సీ కేబుల్ పైనే ఉండటంతో ఈ పనులకు పాల్పడుతున్నారు. సీలేరులో బుధవారం దారకొండ సమీపంలో కొందరు వ్యక్తులు ఓఎఫ్సీ కేబుల్‌ను వెదురుకర్రలతో తగులబెట్టారు. దీంతో రెండు రోజులపాటు సీలేరులో సెల్‌సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు, జెన్కో కార్యాలయాల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఇది గంజాయి స్మగ్లర్ల పనే అని గిరిజనులు చెబుతున్నారు. కేబుల్ వైర్లు ఎక్కడ తె ంపారో తెలుసుకునేందుకు బీఎస్ఎన్ఎల్ అధికారులకు 3 రోజులు పడుతుండటంతో సెల్ సేవలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ఈ ప్రాంత వినియోగదారులు కోరుతున్నారు.