Senior leader passes away
-
రాజకీయ ధురంధరుడు ఇకలేరు
అనపర్తి: నిస్వార్థ సేవకుడు, రాజకీయ ధురంధరుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు సత్తి వీర్రెడ్డి(81) ఇకలేరు. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన సత్తి వీర్రెడ్డి బుధవారం రాత్రి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. వీర్రెడ్డి రామవరం సొసైటీ అధ్యక్షుడిగా, పొలమూరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా, చెరకు అభివృద్ధి మండలి చైర్మన్‌గా, వైఎస్సార్ సీపీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. ఆయన భార్య రామవరం గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. పెద్దకుమారుడు వైజాగ్‌లో గౌతమి వ్యాపార సంస్థల అధినేతగా, చిన కుమారుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఈయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం ఆయన స్వగ్రామమైన రామవరం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అభిమానులు తుది వీడ్కోలు పలికారు. అందరితో ఆప్యాయంగా ఉండే వీర్రెడ్డి ఇక లేరన్న విషయం ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురి సంతాపం.. వీర్రెడ్డి మృతికి ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి, పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు వీర్రెడ్డి కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించి సానుభూతి తెలిపారు. మంచి మిత్రుడిని కోల్పోయా... రాజకీయాల్లో నీతి, నిజాయితీగా మెలుగుతూ పార్టీకి, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన మిత్రుడు వీర్రెడ్డిని కోల్పోవడం తనకు అత్యంత బాధాకరమని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కన్నీటి పర్యంతమయ్యారు. వీర్రెడ్డి మరణ వార్త విని గురువారం ఉదయం రామవరం చేరుకున్నారు. ఆయన వీర్రెడ్డి భౌతికకాయంపై పూలమాల వేసి, వైఎస్సార్ సీపీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ ధురంధరుడు, రాయవరం మునసుబు స్ఫూర్తితో ఆయన శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వీర్రెడ్డితో తనకు గల సాన్నిహిత్యాన్ని బోస్ గుర్తు చేసుకున్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వీర్రెడ్డి పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేశారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం బోస్‌తోపాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
బీజేపీ సీనియర్‌నేత కన్నుమూత
సూర్యాపేట/ గరిడేపల్లి :బీజేపీ సీనియర్‌నేత రామినేని ప్రభాకర్(62) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సౌమ్య ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంటకు చెందిన ప్రభాకర్ గడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా 1981,1988,1990 సంవత్సరాలలో మూడు సార్లు గెలిచి 25 సంవత్సరాల పాటు పనిచేశారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పలు పదవుల్లో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 1996లో మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆయనను పంచాయతీరాజ్ విభాగంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. 2009లో సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రామినేనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రామినేని మృతదేహాన్ని మొదట సూర్యాపేటకు ఆతరువాత మర్రికుంటకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు స్వగ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు ప్రముఖుల రాక మర్రికుంటలో గురువారం జరగనున్న అంత్యక్రియలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. రామినేని మృతి పార్టీకి తీరనిలోటు సూర్యాపేట మున్సిపాలిటీ : బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామినేని ప్రభాకర్ మృతి పార్టీకి తీరనిలోటని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం రామినేని ప్రభాకర్ భౌతికకాయానికి సూర్యాపేటలోని ఆయన నివాసంలో రాష్ట్ర , పట్టణ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. నీతికి, నిజాయితీకి మారుపేరు ప్రభాకర్ అని కొనియాడారు. సంతాపం తెలిపిన వారిలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, గోదల రంగారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, రంగరాజు రుక్మారావు, సంపత్‌కుమార్, బండపల్లి పాండురంగాచారి, చలమల్ల నర్సింహ, టీయూపీఎస్ రాష్ట్ర నాయకుడు శేషగాని శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణ్‌రావు, అప్పారావు, సారగండ్ల మాణిక్యమ్మ, బాణాల విజయ్‌కుమార్, ఏడుకొండల్, జీడి భిక్షం, బెరైడ్డి సంజీవరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, కోతి మాధవి, అన్నెపర్తి రాణి, అబీద్, శ్రీనివాస్, కత్తి వెంకన్న ఉన్నారు.