Sergey Lavrov
-
భారత్ నేతృత్వంలో జీ20 శిఖరాగ్రం ఓ ముందడుగు
న్యూఢిల్లీ: భారత్ సారథ్యంలో జరిగిన జీ20 శిఖరాగ్రం ఓ ముందడుగని రష్యా పేర్కొంది. జీ20 సదస్సు సాధించిన ఫలితాలు..సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించాయి, గ్లోబల్ సౌత్ ప్రాముఖ్యాన్ని చాటాయని తెలిపింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ సహా అనేక అంశాల్లో తమ వైఖరిని రుద్దేందుకు పశ్చిమదేశాలు చేసిన యత్నాలను అడ్డుకోవడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ప్రపంచదేశాల్లో సైనిక సంక్షోభాలను ఐరాస చార్టర్‌ను అనుసరిస్తూ పరిష్కరించాలే తప్ప, వివిధ సంక్షోభాల పరిష్కారానికి పశ్చిమదేశాలు తమ సొంత వైఖరులతో ముందుకు సాగడానికి వీల్లేదన్న సందేశాన్ని ఈ శిఖరాగ్రం స్పష్టంగా పంపిందని లావ్రోవ్ చెప్పారు. ‘ఈ శిఖరాగ్రం ఎన్నో విధాలుగా ఓ ముందడుగు వంటిది. అనేక సమస్యలపై ముందుకు సాగడానికి ఇది మార్గం చూపింది’అని అన్నారు. ‘జీ20ని రాజకీయ వేదికగా మార్చేందుకు జరిగిన యత్నాలను అడ్డుకున్న భారత్‌కు ధన్యవాదాలు. అంతర్జాతీయ వేదికపై పశ్చిమ దేశాలు ఆధిపత్యం కొనసాగించలేదని చెప్పారు. -
7న రష్యాకు జై శంకర్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ నెల 7, 8వ తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాస్కోలో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక వీరిద్దరు నాలుగుసార్లు సమావేశమయ్యారు. అమెరికా, పశ్చిమదేశాలు రష్యాపై అన్ని రకాలుగా తీవ్ర ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల అభ్యంతరాలను సైతం లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను ఇటీవలి కాలంలో పెంచింది. -
Putin: పుతిన్ బతికేది మరో మూడేళ్లే!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై పాశ్చాత్య దేశాలు, రష్యా నిఘా మీడియాలు చేస్తున్న హడావిడి ఏమాత్రం తగ్గట్లేదు. క్రెమ్లిన్ నేత పరిస్థితిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. తరచూ ఏదో ఒక కథనం బయటకు వస్తూనే ఉంది. ఈ తరుణంలో పుతిన్ టైం దగ్గర పడిందంటూ తాజాగా ఓ సంచలన కథనం వెలువడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ పరిస్థితి క్యాన్సర్‌తో క్షీణిస్తున్నట్లు తాజా కథనం వెలువడింది. ఎఫ్ఎస్బీ (Federal Security Service) అధికారి బోరిస్ కార్పిచ్కోవ్ పుతిన్ ఆరోగ్యంపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసినట్లు ఆ కథనం ఉంది. క్యాన్సర్ బాధితుడైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహా అయితే మరో మూడేళ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు తెలిపినట్లు ఆయన ప్రకటన ఉంది. పుతిన్ ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. రెండు నుంచి మూడేళ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు అంటున్నారు. పుతిన్ క్రమంగా కంటిచూపు కూడా కోల్పోతున్నారని, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నట్లు బోరిస్ వెల్లడించినట్లు ఆ కథనం ఉంది. పుతిన్ ప్రసంగాల టైంలో అక్షరాలను చాలా పెద్దదిగా రాసి ఇస్తున్నారని చెప్పారాయన. కళ్లద్దాలు ధరించేందుకు పుతిన్ ససేమిరా అంటున్నారని, దృష్టిలోపం ఉన్నట్లు అంగీకరించడం పుతిన్‌కు ఇష్టం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. పుతిన్ కాళ్లుచేతులు వణకడం సమస్య పెరిగిపోయిందని తెలిపారు. తన కింద పనిచేసే సిబ్బందిపై చీటికీమాటికీ కోపగించుకుంటున్నారని, విపరీతమైన చిరాకుతో సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సదరు నిఘా అధికారి చెప్పారు. ఇక యూకే ఇంటెలిజెంట్ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ కూడా పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని తెలిపాడు. సమావేశాలను పూర్తి చేయకుండానే పుతిన్ మధ్యలో వెళ్లిపోతున్నాడని, ఆయన పరిస్థితి నానాటికీ దిగజారుతోంది అనడానికి ఇదే నిదర్శనమని క్రిస్టోఫర్ చెబుతున్నాడు. కళ్లు మూసుకున్నారేమో! ఇదిలా ఉంటే.. పుతిన్ ఆరోగ్యంపై ఇప్పటివరకు రష్యా స్పందించలేదు. కానీ, మరీ తారాస్థాయికి ప్రచారం చేరడంతో ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఘాటుగా స్పందించారు. పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలు అంతా ఉత్త ప్రచారమే అని కొట్టిపారేశారు ఆయన. ‘‘ఆయన(పుతిన్) సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపాడు. విచక్షణ ఉన్నవాడేవడూ.. ఇలా ప్రవర్తించడు, ఉత్త ప్రచారాలు చేయడు అంటూ పుతిన్ అనారోగ్య కథనాలపై సెటైర్లు వేశాడు లావ్రోవ్. ఈ అక్టోబర్‌కు పుతిన్‌కు 70 ఏళ్లు నిండుతాయి. అయినా రోజూ ఆయన వార్తల్లో కనిపిస్తున్నారు కదా. నిత్యం టీవీల్లోనూ ప్రసంగిస్తున్నారు. కొందరికి కళ్లు మూసుకుపోయినట్లు ఉన్నాయి. అయినా పుకార్లను పంచడం వాళ్లకేం(పాశ్చాత్య మీడియాను ఉద్దేశించి) కొత్త కాదు కదా అంటూ పుతిన్ ఆరోగ్యంపై ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు సెర్గీ లావ్రోవ్. -
క్షమించరాని వ్యాఖ్యలు.. రష్యా విదేశాంగ మంత్రిపై ఫైర్
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్ సహా పలుదేశాల అధినేతలు, ప్రతినిధులు లావ్రోవ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇటలీకి చెందిన ఓ మీడియా సంస్థ తాజాగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా.. ‘‘ఉక్రెయిన్ను డీ-నాజీఫై చేస్తామంటూ ప్రకటించుకున్న రష్యా.. తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందంటూ లావ్రోవ్కు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వయంగా ఓ యూదు. అయినప్పటికీ.. ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు. కానీ, హిట్లర్‌లోనూ యూదు రక్తం ఉంది కదా. అదేం విషయం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ఒక ప్రకటనలో.. లావ్రోవ్ వ్యాఖ్యలు క్షమించరానివి. చారిత్రక తప్పిదం. ఇలాంటి అబద్ధాలు చరిత్రలో భయంకరమైన నేరాలకు యూదులనే నిందిచడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయన్నారు. హోలోకాస్ట్ యూదులు తమను తాము చంపుకోలేదని స్పష్టం చేశారాయన. ఇక ఈ వ్యాఖ్యలపై రష్యా రాయబారిని పిలిపించి.. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఆదేశించింది. మరోవైపు నిరాధారమైనవని వరల్డ్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ సెంటర్ యాద్ వాషెమ్ ఖండించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్ను డీ మిలిటరైజ్, డీ నాజిఫై చేయడమే తమ లక్ష్యమని ఇదివరకే రష్యా ప్రకటించింది. కానీ, ఈ క్రమంలో ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు లావ్రోవ్. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఇజ్రాయెల్ మొదటి నుంచి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఒకవైపు కీవ్-మాస్కో మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని చెబుతూనే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా రష్యాతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలను కొనసాగిస్తోంది. అయితే లావ్రోవ్ హిట్లర్-యూదుల రక్తం వ్యాఖ్యలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ఇదిలా ఉండగా.. రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభ్యంతరం వ్యక్తం చేశాడు. లావ్రోవ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా, ఆమోదయోగ్యం కానీ రీతిలో ఉన్నాయంటూ మండిపడ్డారు. చదవండి: ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు -
జైశంకర్‌ను ఆకాశానికెత్తిన రష్యా విదేశాంగ మంత్రి
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికెత్తారు. నిజమైన దేశభక్తుడంటూ జైశంకర్‌ను అభివర్ణించారాయన. ప్రపంచలో ఎక్కడా లేని విధంగా భారత్ సొంత విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోందని.. చాకచక్యంగా దౌత్యం నడిపించడంలో జైశంకర్ ముందుంటున్నారంటూ పేర్కొన్నారు సెర్గీ లావ్రోవ్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు, కొన్ని సవాళ్లు ఎదురైనా భారత్ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగింది. ఈ వ్యవహారంలో భారత విదేశాంగ వ్వవహారాల మంత్రి జైశంకర్ వ్యవహరించిన తీరు హర్షణీయం. అందుకే ఆయన అతని దేశానికి నిజమైన దేశభక్తుడు అంటూ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికి ఎత్తాడు. జైశంకర్ అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, నిజమైన దేశభక్తుడు. దేశ భద్రత కోసం, అభివృద్ధికి అవసరమని భారత్ ఏదైతే విశ్వసిస్తుందో.. మేం కూడా ఆ (భారత్) మార్గంలోనే వెళ్లాలనుకుంటున్నాం. పైగా చాలా దేశాలు భారత్‌లా వ్యవహరించలేవు కూడా అని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో భారత్ కొనసాగించిన లావాదేవీలపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ బదులు ఇచ్చారు. ముందు ఈయూ సంగతి చూడాలని, వాళ్లతో పోలిస్తే తాము(భారత్) చేసుకుంటున్న దిగుమతుల మోతాదు చాలా తక్కువేనని, పైగా మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ అమెరికా లేవనెత్తిన అభ్యంతరాలకు గట్టి కౌంటరే ఇచ్చారాయన. ఈ నేపథ్యంలో.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. -
భారత్ కోసం ఏదైనా చేస్తాం.. పుతిన్ ఫుల్ సపోర్ట్.. అమెరికాకు టెన్షన్..?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో శుక్రవారం లావ్రోవ్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జైశంకర్.. భారత్ ఎల్లప్పుడూ వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోడంపై మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు. వీరి భేటీ అనంతరం లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రష్యా విదేశాంగ విధానంలో అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. భారత్ ఏ వస్తువులు అడిగినా.. వాటిని సరఫరా చేసేందుకు తాము సదా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అలాగే భారత్‌తో ఏ విషయంపైనైనా చర్చించడానికి కూడా తాము సిద్ధమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆదేశాలను సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. భారత్, రష్యాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారని గుర్తు చేశారు. గతంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లోనూ(ఉక్రెయిన్ వార్ విషయంలో) రెండు దేశాల మధ్య సంబంధం స్థిరంగా కొనసాగిందన్నారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోడానికి అమెరికా ఎక్కువ మక్కువ చూపుతుందని సెర్గీ లావ్రోవ్ చురకలంటించారు. రష్యా- భారత్ సంబంధాలపై అమెరికా ఒత్తిళ్లూ పనిచేయవని తేల్చి చెప్పారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై తాము చేస్తున్నది యుద్ధం కాదని.. అదో స్పెషల్ ఆపరేషన్ అని లావ్రోవ్ వెల్లడించారు. తన దేశ బలగాలు సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేశాయని అన్నారు. We will be ready to supply to India any goods which it wants to buy from us. We are ready to discuss. Russia & India have very good relations: Russian FM Lavrov pic.twitter.com/5KF2k5jZvH — ANI (@ANI) April 1, 2022 ఇది చదవండి: పరేషాన్లో ఇమ్రాన్! పూర్తిగా గాలి తీసేసిన మాజీ భార్య రెహమ్ ఖాన్ -
దించేస్తారా?... దించేదాకా వెళతారా?
అత్యంత రహస్యమైన నిఘా సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు చెప్పేసి... ఇరకాటంలో పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టాల్సిందేననే డిమాండ్లు డెమొక్రాట్ల నుంచి వినపడుతున్నాయి. ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటిలోనూ రిపబ్లికన్ పార్టీకే (ట్రంప్ పార్టీ) మెజారిటీ ఉంది. కాబట్టి అభిశంసన తీర్మానం నెగ్గడం అంత సులభం కాదు. అయితే ప్రజాభిప్రాయం కూడా వేగంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా మారుతోంది. ప్రైవేటు సంస్థ ‘పబ్లిక్ పాలసీ పోలింగ్ (పీపీపీ)’ మంగళవారం విడుదల చేసిన సర్వేలో... ఏకంగా 48 శాతం మంది ట్రంప్‌ను అభిశంసించాల్సిదేనన్నారు. అభిశంసనకు వ్యతిరేకమన్న వారు 41 శాతం. ట్రంప్ బృందం పనితీరు బాగుందన్న వారు 40 శాతమే కాగా పాలనపై పెదవి విరిచిన వారు ఏకంగా 54 శాతం మంది ఉండటం గమనార్హం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాక జరిగి సర్వే ఇది. ఈనెల 12 నుంచి 14 తేదీల మధ్యన జరిగింది. సర్వే జరిగాక ట్రంప్ తప్పులు మరో రెండు బయటకు వచ్చాయి. ఒకటి చిరకాల ప్రత్యర్థి రష్యాతో నిఘా సమాచారాన్ని పంచుకోవడం, రెండోది... మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్‌పై విచారణను ఆపేయాల్సిందిగా ట్రంప్ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కోమీని కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక బయటపెట్టింది. తాజా పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొంటే ప్రజాభిప్రాయంలో మరింతగా తేడా రావొచ్చు. ప్రజా వ్యతిరేకత ఇంకా పెరిగితే రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు కూడా ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికే పరిస్థితులు తలెత్తవచ్చు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం గాని... ఒకవేళ ట్రంప్‌ను దించేదాకా పరిస్థితి వస్తే... ఆయనపై మోపే అభియోగాలేమిటి, అభిశంసన ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇతర మార్గాలేమిటనేది చూద్దాం... అభియోగాలు... 1. న్యాయ ప్రక్రియకు అడ్డుతగలటం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ బృందం రష్యాతో... ముఖ్యంగా అమెరికాలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లయాక్తో సంబంధాలు నెరిపిందనే ఆరోపణలు ఉన్నాయి. హిల్లరీ, ఇతర డెమొక్రాటిక్ నేతల ఈ మెయిల్స్‌ను లీక్ చేయడం ద్వారా రష్యా పరోక్షంగా ట్రంప్ విజయానికి దోహదపడిందని ఆరోపణ. పుతిన్‌తో కలిసి పనిచేస్తానని ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ పలుమార్లు చెప్పడం... వీరిమధ్య ఏదో ఉందనే అనుమానాలకు తావిచ్చింది. రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్తో తను సంభాషించిన విషయాలపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను తప్పుదోవ పట్టించినందుకు జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ నెలరోజుల్లోనే (ఫిబ్రవరి 13న) పదవికి రాజీనామా చేశారు. రష్యాతో ఫ్లిన్కు గల సంబంధాలపై ఫెడరల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) విచారణ జరుపుతోంది. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనే ఆరోపణలపైనా విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో ఆకస్మాత్తుగా ఈనెల 9న ఎఫ్‌బీఐ డైరక్టర్ జేమ్స్ కోమీని పదవి నుంచి తప్పించారు ట్రంప్. పైగా ఒక ఇంటర్వ్యూలో ఈ నిర్ణయం తీసుకునేటపుడు రష్యా వ్యవహారం కూడా తన మదిలో ఉందని ట్రంప్ స్వయంగా చెప్పారు. అంతకుముందే ఫ్లిన్‌పై విచారణను నిలిపివేయాల్సిందిగా కోమీని ట్రంప్ కోరినట్లు మంగళవారం బయటపడింది. ఈ రెండు సందర్భాల్లోనూ అధ్యక్షుడు పరిధిని దాటి న్యాయ ప్రక్రియకు అడ్డుతలిగినట్లేనని కొందరు నిపుణుల విశ్లేషణ. ‘తీవ్ర నేరాలు, ఇతర స్వల్పకాలిక శిక్షార్హమైన నేరాలు’ చేస్తే అధ్యక్షుడిని అభిశంసించవచ్చని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. న్యాయప్రక్రియకు అడ్డుతగలడం దీని కిందకే వస్తుందని వీరి వాదన. 2. బాధ్యతలు చేపట్టే సమయంలో చేసిన ప్రమాణాన్ని ఉల్లఘించడం మిత్రదేశం అందించిన అత్యంత రహస్య నిఘా సమాచారాన్ని ట్రంప్ రష్యాతో పంచుకున్నాడనేది వాషింగ్టన్ పోస్ట్ బటయపెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. అధ్యక్షుడిగా ఆ మేరకు తనకు సంపూర్ణ అధికారం ఉందని ట్రంప్ సమర్థించుకున్నారు. నిజమే... రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్షుడు తన విచక్షణ మేరకు ఎంత గోప్యమైన సమాచారాన్నైనా ఎవరితోనైనా పంచుకోవచ్చు. అది చట్ట ఉల్లంఘన కిందకు రాదు. అయితే దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు... ‘అమెరికా అధ్యక్ష బాధ్యతలను పూర్తి నిష్ఠతో నిర్వర్తిస్తానని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రమాణం చేస్తారు. ప్రత్యర్థి దేశమైన రష్యాకు కీలక నిఘా సమాచారాన్ని నిర్లక్ష్యంగా వెల్లడించడం కూడా నిష్ఠతో బాధ్యతల నిర్వహణ కిందకు వస్తుందని సమర్థించుకోవడం సాధ్యం కాదని లాఫేర్ అనే న్యాయనిపుణుల బ్లాగ్‌లోని ఆరుగురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అంటే... ప్రమాణాన్ని ట్రంప్ ఉల్లంఘించినట్లేనని వీరి ఉద్దేశం. అభిశంసన ప్రక్రియ... ఎలా మొదలవుతుందంటే: అమెరికాలో అభిశంసన ప్రక్రియను మొదలుపెట్టే అధికారం ప్రతినిధుల సభకు మాత్రమే ఉంది. న్యాయశాఖ లేదా స్వయంగా ప్రతినిధుల సభ లేదా ప్రత్యేకంగా నియమించిన న్యాయవాది... వీరిలో ఎవరో ఒకరు మొదలు స్వతంత్ర విచారణ జరుపుతారు. అభియోగాలకు గల ఆధారాలను హౌజ్ జ్యుడీషియరీ కమిటీకి సమర్పిస్తారు. ఈ కమిటీ ఆధారాలను క్షణ్ణంగా పరిశీలించి అభిశంసన తీర్మానానికి ఆర్టికల్స్‌ను రాస్తుంది. దీనిపై చర్చ జరిగాక ఓటింగ్ చేపడతారు. ప్రతినిధుల సభలో సాధారణ మెజారిటీతో నెగ్గితే అధ్యక్షుడు అభిశంసనకు గురైనట్లే. అంతమాత్రన పదవి పోదు. తదుపరి ఇది సెనేట్‌కు చేరుతుంది. అసలు ఘట్టం: అభిశంసన తీర్మానం సేనేట్‌కు చేరాక విచారణ మొదలవుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిగా, సెనేట్ జ్యూరీగా విచారణ జరుగుతుంది. అధ్యక్షుడు తన వాదనలు వినిపించుకోవచ్చు. హౌజ్ జ్యుడీషియరీ కమిటీ ప్రాసిక్యూషన్‌గా వ్యవహరిస్తుంది. సెనేట్‌లో మూడింట రెండొంతుల మంది సభ్యులు (67 మంది, మొత్తం సేనెట్ బలం 100) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటేస్తే పదవి ఊడుతుంది. సభల్లో బలాబలాలు: ప్రతినిధుల సభలో సాధారణ మెజారిటీ వస్తే అభిశంసన తీర్మానం ఆమోదం పొందినట్లే. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో ప్రస్తుతం నాలుగు ఖాళీలున్నాయి. రిపబ్లికన్ల బలం 238 కాగా, డెమొక్రాట్ల బలం 193. సాధారణ మెజారిటీకి 216 ఓట్లు వస్తే చాలు. అంటే డెమొక్రాట్లు ఒకవేళ ట్రంప్‌పై అభిశంసన పెడితే అది నెగ్గడానికి... కనీసపక్షం 23 మంది రిపబ్లికన్ సభ్యుల మద్దతును కూడగట్టాలి. ఇక సెనేట్ విషయానికి వస్తే 100 మంది సభ్యుల్లో రిపబ్లికన్లు 52, డెమొక్రాట్లు 46, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. అభిశంసన నెగ్గాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. 67 ఓట్లు కావాలి. అంటే డెమొక్రాట్లు మరో 21 మంది మద్దతు సంపాదించాలి. ట్రంప్ తొలి రెండునెలల పాలనానంతరం కేవలం 38 శాతం ప్రజల మద్దతు పొందారు. తొలిసారి అధ్యక్ష పదవిని చేపట్టిన వారితో పోల్చినపుడు ఇది సగటున 20 పాయింట్లు తక్కువ. ట్రంప్ మరిన్ని పొరపాట్లు చేసి అపఖ్యాతి పాలైతే. అధ్యక్షుడిపై ప్రజా వ్యతిరేకత మరింత బలపడితే... రిపబ్లికన్లు కూడా పునరాలోచించక తప్పదు. ఒకవేళ ఇప్పుడు అభిశంసన తేలేకపోతే 2018లో డెమొక్రాట్లకు మరో మంచి అవకాశం ఉంటుంది. ప్రతినిధుల సభకు 2018లో ఎన్నికలున్నాయి. ఒకవేళ డెమొక్రాట్లు మెజారిటీ సాధిస్తే... మొదటి అంకం వారికి సులువవుతుంది. అమెరికా చరిత్రలో అభిశంసనలు... మొత్తం ముగ్గురు అధ్యక్షులపై వచ్చాయి. 1865 నుంచి 1869 దాకా అధ్యక్షుడిగా ఉన్న అండ్రూ జాన్సన్ మాజీ బానిసలకు పౌర హక్కులను కల్పించడాన్ని వీటో చేసి 1968లో అభిశంసన ఎదుర్కొన్నారు. అయితే ప్రతినిధుల సభలో నెగ్గినా... సెనేట్ తిరస్కరించడంతో పదవీకాలం పూర్తిచేసుకున్నారు. అలాగే రిచర్డ్ నిక్సన్ 1974 వాటర్‌గేట్ కుంభకోణంలో ఆయన పాత్రకుగాను అభిశంసనను ఎదుర్కొన్నారు. అయితే ప్రతినిధుల సభలో ఓటింగ్‌కు రాకముందే నిక్సన్ పదవికి రాజీనామా చేశారు. మోనికా లూయిన్‌స్కీతో అక్రమ సంబంధాన్ని నెరిపినా... దాని దాచిపెట్టినందుకు బిల్ క్లింటన్ 1998లో అభిశంసనను ఎదుర్కొన్నారు. ప్రతినిధుల సభలో ఆయన అభిశంసన నెగ్గినా... సెనేట్ తిరస్కరించింది. ఈ ముగ్గురిపైనా అభిశంసన తీర్మానం పెట్టింది... ప్రమాణాన్ని ఉల్లంఘించారనే అభియోగం పైనే కావడం గమనార్హం. ఇతర మార్గాలూ ఉన్నాయి అనారోగ్య కారణంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని అధికారాన్ని ఉపాధ్యక్షుడి అప్పగించడానికి అమెరికా రాజ్యాంగం వీలు కల్పిస్తోంది. అలాగే అధ్యక్షుడి వైకల్యం లేదా అసమర్థత కారణంగా ఆయన్ను పదవి నుంచి బలవంతంగా తప్పించేందుకూ ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యక్షుడు, కేబినెట్లోని 15 మంది కీలక మంత్రులు నిర్ణేతలవుతారు. ఉపాధ్యక్షుడు, మంత్రుల్లో మెజారిటీ సభ్యులు ‘అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వర్తించే స్థితిలో లేరని భావిస్తే’ ఈ మేరకు ప్రతినిధుల సభ స్పీకర్‌కు, సెనేట్ ప్రెసిడెంట్‌కు లిఖితపూర్వక సమాచారమిస్తే... సదరు అధ్యక్షుడు పదవికి దూరమవుతాడు. ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు. అయితే తొలగించిన అధ్యక్షుడిని శాశ్వతంగా పదవికి దూరంగా ఉంచాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమవుతుంది. అధ్యక్ష అభ్యర్థి పేరు మీదే ప్రజలు ఓట్లు వేస్తే అమెరికాలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది కాబట్టి... ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడిని ఈ తరహాలో దించిన సంఘటనలు అమెరికా చరిత్రలో చోటుచేసుకోలేదు. అయితే ప్రజావ్యతిరేకత పెరిగి... నిలకడలేని ట్రంప్‌ను వదిలించుకోవాల్సిన పరిస్థితి వస్తే... రిపబ్లికన్లకు ఇది కూడా ఒక మార్గం అవుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్