మంచంపట్టిన పల్లెలు!
►జ్వరం, కీళ్ల నొప్పులతో ఆస్పత్రుల బాటపడుతున్న రోగులు
►సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు
రాయికోడ్: నెల రోజుల నుంచి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతూ మంచం పడుతున్నారు. కుటుంబసభ్యుల్లో ఒకరికి తగ్గకముందే మరొకరు జ్వరం, కీళ్ల నొప్పులతో మంచాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఇం దూర్, కర్చల్, ఇటికేపల్లి, రాయికోడ్, పీపడ్పల్లి, రామోజిపల్లి, జమ్గి తదితర గ్రామాల్లో రోగాల భయంతో జనం బెం బెలెత్తుతున్నారు. అయితే నెల రోజులుగా జ్వరం, కీళ్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయో, అసలు ఏ రోగం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారో వై ద్యాధికారులు ఇప్పటివరకు నిర్ధారించ లేకపోయారు.
స్థానిక ల్యాబ్లో మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేపట్టి వైద్యులు చేతులు దులుపుకున్నారు. ఇటికేపల్లి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం రోగుల రక్త నమూనాలను హైదరాబాద్కు పంపిం చారు. ఆయా గ్రామాల్లో విజృంభిస్తున్న జ్వరం, కీళ్ల నొప్పులతో పేద రోగులు రాయికోడ్ పీహెచ్సీకి పరుగులు పెడుతున్నారు. అయితే డాక్టరు లేకపో వడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని డాక్టర్ షా మిలి ఇన్చార్జ్గా విధులు నిర్వహి స్తున్నారు. అయితే డాక్టర్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారో తెలియని దుస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు.
కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి పరీక్షలు చేయకుండా తోచిన మందులిచ్చి పంపుతున్నారని మండిపడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటి సరఫరా కాదని, పంచాయితీ అధికారులు, వ్యాధి నిర్ధారణ కాలేదని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతు న్నారు. దీంతో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండటంతో జ్వరం, కీళ్ల నొప్పులెందుకు వస్తున్నాయో తెలియక స్థానికులు అయోమయానికి గురవుతున్నారు.
ప్రజల అవసరాన్ని, ప్రభుత్వ వైద్య శాఖ నిర్లక్ష్యాన్ని మండలంలోని పలువురు ప్రైవేటు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రోగాన్ని నిర్ధారించకుండానే వివిధ రకాల మందులను రాసి, రూ.వందల్లో వసూలు చేస్తు నిరుపేదల జేబులను ఖాళీ చేస్తున్నారు. వారి వైద్యం వల్ల తాత్కాలికంగా జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గుతున్నా సంపూర్ణంగా కోలుకోవడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు.