ఇంజెక్షన్ వికటించి ఆరేళ్ల బాలుడు మృతి
ధర్పల్లి: ఇంజెక్షన్ వికటించి గురువారం ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ పరిధిలోని మరియాతండాకు చెందిన బదావత్ వర్ష్య, వనితల కుమారుడు అశోక్ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం గురువారం రాత్రి ధర్పల్లిలోని ఆర్‌ఎంపీ రజాక్ వద్దకు తీసుకొచ్చారు. ఆయన బాలుడికి జెంటామైసిన్ 40 ఎంజీ ఇంజెక్షన్ ఇచ్చారు. వారు ఇంటికి వెళ్లిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన చోట గడ్డ కట్టినట్లు గుర్తించారు.
అక్కడి నుంచి నీరు కారుతుండడంతో మళ్లీ సదరు ఆర్‌ఎంపీ వద్దకే తీసుకొచ్చారు. అతను మందు ఇచ్చినా.. మరింత ఎక్కువ కావడంతో బాలుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. జిల్లా కేంద్రంలోని వైద్యుడు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలివెళ్లుతుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. కాగా, బాలుడి మృతికి ఆర్‌ఎంపీ కారణమని ఆరోపిస్తూ మరియాతండావాసులు పెద్ద ఎత్తున ఆర్‌ఎంపీ ఇంటి వద్ద ఆందోళన చేశారు.