shankar singh vaghela
-
కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ సీఎం
గాంధీనగర్: దేశవ్యాప్తంగా కుదేలై చచ్చి బతుకుతున్న కాంగ్రెస్ పార్టీ కొంత ఊరట కల్పించే పరిణామం చోటుచేసుకోనుంది. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన్నే స్వయంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని గుజరాత్లో చర్చ నడుస్తోంది. ఆయన రాకతో హస్తం పార్టీలో జోష్ రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన శంకర్ సిన్హా వాఘేలా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తనను కాంగ్రెస్‌లో చేరాలని ఇటీవల కార్యకర్తలు, అభిమానులు విజ్ఞప్తులు చేస్తున్నారని.. ఎక్కడకు వెళ్లినా అదే ప్రస్తావన వస్తోందని వివరించారు. ఎలాంటి షరతుల్లేకుండా హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. 2017లో కాంగ్రెస్ పార్టీని వీడిన వాఘేలా రెండేళ్ల తర్వాత ఎన్సీపీలో చేరారు. ఆ తర్వాత విబేధాలు రావడంతో 2020లో బయటకు వచ్చి ప్రజాశక్తి డెమోక్రటిక్ పార్టీ (పీఎస్‌డీపీ) స్థాపించారు. ఆయన రాజకీయ జీవితం బీజేపీతోనే. 1995లో తనను కాదని కేశుభాయ్ పటేల్‌ను ముఖ్యమంత్రిగా చేయడంతో వాఘేలా బీజేపీలో చీలిక తీసుకొచ్చారు. 1996లో కాంగ్రెస్ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటుచేసి శంకర్ సిన్హా వాఘేలా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి మన్మోహన్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్‌లోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే తాను కాంగ్రెస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో చెప్పారు. గతేడాది అహ్మద్ పటేల్ అంత్యక్రియలకు హాజరైన సమయంలో తనను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తిరిగి పార్టీలోకి రావాలని కన్నీళ్లు పెట్టుకుని అడిగారని వాఘేలా ఆ ప్రకటనలో తెలిపారు. అయితే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీపై ప్రస్తుతం పోరాటం చేస్తానని శంకర్ సిన్హా చెప్పారు. సోనియా, రాహుల్‌గాంధీతో సమావేశమైన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటానని ఎనిమిది పదుల వయసులో ఉన్న వాఘేలా ప్రకటన చేశారు. -
మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో శంకర్ సింగ్ వాఘేలాకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. (జూలై 5 తరువాత లాక్డౌన్? ) వాఘోలా కొత్త పార్టీ కాగా గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శంకర్ సింగ్ వాఘేలా ప్రజశక్తి మోర్చా పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయన కొద్దిరోజల క్రితం ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. వాఘేలాను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఏకైక ఎన్‌సిపి ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్సీపీకి రాజీనామా చేశారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పార్టీల్లో కొనసాగారు. జన్ సంఘ్ నుంచి బీజేపీ, రాజ్పా, కాంగ్రెస్, జన్ వికల్ప్ , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. -
గుజరాత్లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవలే పార్టీని వీడిన శంకర్‌సింగ్ వాఘేలాకు సన్నిహితులుగా భావిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు గురువారం తమ అన్ని పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 54కి తగ్గిపోయింది. ఆగస్టు 8న జరిగే రాజ్యసభ ఎన్నికలో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు అహ్మద్‌పటేల్ నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను గాంధీనగర్‌లో అసెంబ్లీ స్పీకర్ రమణ్‌లాల్ వోరాకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో బల్వంత్‌సిన్హ్æ రాజ్‌పుత్, తేజశ్రీబెన్ పటేల్, ప్రహ్లాద్ పటేల్ ఉన్నారు. ఆ వెంటనే బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్‌ను రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తమ మూడో అభ్యర్థిగా బరిలోకి దింపుతామని బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు కూడా గుజరాత్ నుంచి పోటీచేస్తున్నారు. -
వాఘేలా నిష్క్రమణ కాంగ్రెస్‌కు దెబ్బే
అహ్మదాబాద్: మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ ప్రతిపక్ష నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని ఆయన తన 77వ పుట్టిన రోజైన శుక్రవారం నాడు ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడి పదవికి అంతకుముందు రోజే రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్రం నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల అనంతరం తన అసెంబ్లీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా ఆయన తెలిపారు. తాను పాలకపక్ష భారతీయ జనతాపార్టీలో చేరడం లేదని, కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. అభిమానులు బాపూగా పిలుచుకునే వాఘేలా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడం ఆ పార్టీకి ఎంతో నష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నా ఇంతవరకు పార్టీకి సరైన వ్యూహం లేకపోవడం పట్ల ఆయన గత కొంతకాలం నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రాష్ట్ర పార్టీ నాయకుల తీరు కూడా ఆయనకు నచ్చడం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ముందుగానే ప్రకటించాలని ఆయన కోరుతున్నా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదు. వచ్చే నవంబర్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా పార్టీ నుంచి ఎన్నికల ఊపు కనిపించడం లేదు. రాష్ట్రపతి పదవికి బీజేపీ కూటమి తరఫున పోటీ చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్రం నుంచి 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లు తేలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు వాఘేలా ప్రకటించడం గమనార్హం. రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలకు ఢోకాలేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పార్టీకి ఒక్క నాయకుడు రాజీనామా చేసినంత మాత్రాన ఓటరు మనసు మారదని సురేంద్రనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ జిల్లా పంచాయతీ సభ్యుడు కాంతిభాయ్ తమాలియా లాంటి వారు భావిస్తున్నారు. పాటిదార్, జీఎస్టీ ఉద్యమాలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆగ్రహం ఓటర్లలో ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. బీజేపీ పట్ల నెలకొన్న అసంతప్తి కాంగ్రెస్ పార్టీకి ఓట్లను కురిపించడం ఖాయమని జీఎస్టీకీ వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన జౌళి వ్యాపారస్థుల్లో ఒకరు, సూరత్ నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బల్వంత్ జైన్ చెప్పారు. పటేళ్ల నుంచి దళితుల వరకు, రైతుల నుంచి వ్యాపారస్థుల వరకు అందరు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నందున కాంగ్రెస్ పార్టీకి అబ్ధి చేకూరే అవకాశం ఎక్కువుందని ఆయన అన్నారు. అయితే వాఘేలా లాంటి అభిమాన నాయకుడు పార్టీ నుంచి పోవడం వల్ల కార్యకర్తలు నిరాశకు గురవడం సహజమని, ఆయన కొత్త పార్టీని పెట్టనంతకాలం పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కులాల పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుందని, వాఘేలా రాజ్‌పుత్‌ల కుటుంబానికి చెందిన వారని, రాజ్‌పుత్‌ల ఓట్లు రెండు శాతానికి మించి లేవని మరో కాంగ్రెస్ నాయకుడు కీర్తిసింగ్ జ్వాలా అభిప్రాయపడ్డారు. వృద్ధతరం చోట యువతరం నాయకత్వం చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని, ఈ విషయంలో పాటిదార్లు చొరవ తీసుకుంటే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. వాఘేలా రాజ్‌పుత్‌ల కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఓబీసీలు, క్షత్రియుల్లో ఆయనకు పలుకుబడి చాలా ఎక్కువుందని, ఆయన పార్టీ నుంచి తప్పుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని రాజకీయ విశ్లేషకుడు ఘనశ్యామ్ షా అంటున్నారు. -
మోడీని రామ మందిరం కట్టమన్న కాంగ్రెస్ నేత
అహ్మదాబాద్ : ప్రధానమంత్రి పదవి చేపట్టనున్న నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత శంకర్ సింగ్ వాఘేలా ప్రశంసలు లభించాయి. 2 సీట్లున్న పార్టీని 282 సీట్లకు తీసుకెళ్లిన ఘనత మోడీకే దక్కుతుందని ఆయన వాఘేలా ప్రశంసించారు. మోడీకి గుజరాత్ శాసనసభ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా అనూహ్యంగా బీజేపీ కీలక వాగ్దానాలకు వాఘేలా నుంచి మద్దతు లభించింది. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మోడీ తప్పక చేపట్టాలనన్నారు. అలాగే యూనీఫామ్ సివిల్ కోడ్లకు వాఘేలా మద్దతు పలికారు. అటు సభాపతి కూడా మోడీకి అభినందనలు తెలిపారు. స్వతంత్ర భారత లక్షాలను సాధించాల్సిన బాధ్యత బీజేపీ సర్కారుపై ఉందని సూచించారు.