వాఘేలా నిష్క్రమణ కాంగ్రెస్‌కు దెబ్బే
అహ్మదాబాద్: మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ ప్రతిపక్ష నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని ఆయన తన 77వ పుట్టిన రోజైన శుక్రవారం నాడు ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడి పదవికి అంతకుముందు రోజే రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్రం నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల అనంతరం తన అసెంబ్లీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా ఆయన తెలిపారు. తాను పాలకపక్ష భారతీయ జనతాపార్టీలో చేరడం లేదని, కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
అభిమానులు బాపూగా పిలుచుకునే వాఘేలా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడం ఆ పార్టీకి ఎంతో నష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నా ఇంతవరకు పార్టీకి సరైన వ్యూహం లేకపోవడం పట్ల ఆయన గత కొంతకాలం నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రాష్ట్ర పార్టీ నాయకుల తీరు కూడా ఆయనకు నచ్చడం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ముందుగానే ప్రకటించాలని ఆయన కోరుతున్నా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదు. వచ్చే నవంబర్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా పార్టీ నుంచి ఎన్నికల ఊపు కనిపించడం లేదు.
రాష్ట్రపతి పదవికి బీజేపీ కూటమి తరఫున పోటీ చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్రం నుంచి 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లు తేలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు వాఘేలా ప్రకటించడం గమనార్హం. రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలకు ఢోకాలేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పార్టీకి ఒక్క నాయకుడు రాజీనామా చేసినంత మాత్రాన ఓటరు మనసు మారదని సురేంద్రనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ జిల్లా పంచాయతీ సభ్యుడు కాంతిభాయ్ తమాలియా లాంటి వారు భావిస్తున్నారు.
పాటిదార్, జీఎస్టీ ఉద్యమాలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆగ్రహం ఓటర్లలో ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. బీజేపీ పట్ల నెలకొన్న అసంతప్తి కాంగ్రెస్ పార్టీకి ఓట్లను కురిపించడం ఖాయమని జీఎస్టీకీ వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన జౌళి వ్యాపారస్థుల్లో ఒకరు, సూరత్ నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బల్వంత్ జైన్ చెప్పారు. పటేళ్ల నుంచి దళితుల వరకు, రైతుల నుంచి వ్యాపారస్థుల వరకు అందరు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నందున కాంగ్రెస్ పార్టీకి అబ్ధి చేకూరే అవకాశం ఎక్కువుందని ఆయన అన్నారు. అయితే వాఘేలా లాంటి అభిమాన నాయకుడు పార్టీ నుంచి పోవడం వల్ల కార్యకర్తలు నిరాశకు గురవడం సహజమని, ఆయన కొత్త పార్టీని పెట్టనంతకాలం పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు.
గుజరాత్ ఎన్నికల్లో కులాల పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుందని, వాఘేలా రాజ్‌పుత్‌ల కుటుంబానికి చెందిన వారని, రాజ్‌పుత్‌ల ఓట్లు రెండు శాతానికి మించి లేవని మరో కాంగ్రెస్ నాయకుడు కీర్తిసింగ్ జ్వాలా అభిప్రాయపడ్డారు. వృద్ధతరం చోట యువతరం నాయకత్వం చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని, ఈ విషయంలో పాటిదార్లు చొరవ తీసుకుంటే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. వాఘేలా రాజ్‌పుత్‌ల కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఓబీసీలు, క్షత్రియుల్లో ఆయనకు పలుకుబడి చాలా ఎక్కువుందని, ఆయన పార్టీ నుంచి తప్పుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని రాజకీయ విశ్లేషకుడు ఘనశ్యామ్ షా అంటున్నారు.