నేర్పించవా అంటున్న ఐశ్వర్యా అర్జున్
తమిళసినిమా: యాక్షన్‌కింగ్ అర్జున్ నటించిన చిత్రాలు గానీ, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు గానీ వైవిధ్యంతో పాటు దేశానికి సంబంధించిన ఒక మంచి సందేశంతో కూడి ఉంటాయి. వాటిలో కమర్షియల్ అంశాలకు కొదవ ఉండదు. అలాంటి అర్జున్ తాజాగా తన వారసురాలు ఐశ్వర్యా అర్జున్ నట కెరీర్‌ను నిలబెట్టే విధంగా సొల్లితరవా ( నేర్పించవా) పేరుతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి తన శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఐశ్వర్య అర్జున్‌కు జంటగా నవ నటుడు శాంతన్‌కుమార్ నటిస్తున్న ఇందులో నటి సుహాసిని, దర్శకుడు కే.విశ్వనాథ్, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాస్యభూమికల్ని నాన్ కడవుల్ రాజేంద్రన్, సతీష్, యోగిబాబు పోషిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
చిత్ర వివరాలను అర్జున్ తెలుపుతూ సొల్లితరవా చిత్ర కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. దేశానికి సంబంధించిన ఒక అంశంతో ప్రేమను జోడించి జనరంజకంగా రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. విధి నిర్వహణలో ఒక యువతీయువకుడు తమకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొని తమ ప్రేమను గెలిపించుకున్నారన్నదే సొల్లితరవా చిత్ర కథ అన్నారు. జెస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని చెన్నై, ధర్మస్థల, హైదరాబాద్, కేరళ, ఉత్తర భారతదేశంలోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రాన్ని దీపావళి సందర్భంగా తమిళం, కన్నడం భాషల్లో ఒకేసారి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.