ఆర్టీవీ బస్సు డ్రైవర్‌కు జైలు
న్యూఢిల్లీ: అతి వేగంగా వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతికి కారకుడైన నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయిన మహ్మద్ షఫీక్‌కు అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శరద్ గుప్తా ఈ మేరకు జైలు శిక్షను ఖరారు చేశారు. అదే విధంగా బాధితుడు అర్జున్‌కు నష్టపరిహారం అందజేయాలని సూచించింది. ఈ పరిహారాన్ని నిందితుడు అందజేసే స్థితిలో లేకుంటే ఢిల్లీ న్యాయ సేవా సంస్థ చెల్లించాలని సూచించింది. పోలీసులు తెలిపిన కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. డిసెంబర్ 2, 2002న షఫీక్ అనే డ్రైవర్ ఆర్టీవీ బస్సును అతివేగంగా నడుపుతూ యమున పుస్త రోడ్డును క్రాస్ చేస్తున్న అర్జున్ ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు మృతి చెందాడు. ఈ మేరకు అదే సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి షఫీని అరెస్టు చేశారు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలపై స్థానిక కోర్టు తన సామాజిక బాధ్యతను విస్మరించకూడదని స్పష్టం చేసింది.