Shastra Puja
-
చైనా సరిహద్దుల్లో రాజ్‌నాథ్ ఆయుధ పూజ
సాక్షి, న్యూఢిల్లీ: విజయదశమి సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉదయం ఆయుధ పూజ నిర్వహించారు. వాస్తవాధీన రేఖకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సిక్కిం షెరాథాంగ్ వద్ద ఆయన సైనికులతో ‘శాస్త్ర పూజ’ చేశారు. ఆయుధాలు, పరికరాలు, సాయుధ వాహనాలను పూజించారు. అనంతరం సైనికులతో రాజ్‌నాథ్ ముచ్చటించారు. దసరా సందర్భంగా వారికి తన శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దుల రక్షణలో సేవలు చేస్తున్న వారి అంకితభావాన్ని ప్రశంసించారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని ప్రశంసలు కురిపించారు. ఇక చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ సైనికులతో గడపటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న వివాదం త్వరగా ముగిసిపోవాలని భారత్ కోరుకుంటోందని ఆకాంక్షించారు. శాంతి నెలకొల్పడమే తమ ఉద్ధేశ్యమని, ఈ విషయంలో తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ఆకాంక్షించారు. భారత జవాన్లు దేశంలోని ఒక్క ఇంచు భూమిని కూడా ఇతరుల చేతుల్లోకి పోనివ్వరని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అంతకు ముందు తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్‌లోని సుక్నా యుద్ధ స్మారకాన్ని ఆయన, ఆర్మీ ఛీప్ ఎంఎం నరవాణేతో కలిసి సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. కాగా ఇవాళ ఉదయం రక్షణమంత్రి ట్విటర్లో దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయదశమి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా ఈ రోజు సిక్కింలోని నాథులా ప్రాంతాన్ని సందర్శించి భారత సైన్యం సైనికులను కలుస్తా. ఆయుధ ఆరాధన కార్యక్రమంలో కూడా పాల్గొంటా’ అని ట్వీట్ చేశారు. గత ఏడాది ఫ్రాన్స్ ఓడరేవు నగరం బోర్డాలో రక్షణ మంత్రి రాఫేల్ యుద్ధ విమానాలకు శాస్త్ర పూజ నిర్వహించారు. -
‘అది మన ఆచారం.. పాటిస్తే తప్పేంటి’
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానం స్వీకరించిన అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దానికి ఆయుధ పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌నాథ్ చర్యల పట్ల ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు రాజ్‌నాథ్ సింగ్. ‘జనాలు తమకు నచ్చినట్లు మాట్లాడతారు. నేను చేసే పని సరైంది అని నాకు అనిపించినప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పనిని నేను కొనసాగిస్తాను. ఓ గొప్ప అతీతశక్తి ఉందని చిన్నతనం నుంచి నేను నమ్ముతాను. నాతో పాటు దేశంలో చాలా మంది దీన్ని విశ్వసిస్తారు. మన దేశంలో వాహనాలు, ఆయుధాలు కొన్న తర్వాత పూజ నిర్వహించడం.. దానిపై ఓంకారాన్ని రాయడం పరిపాటి. ఇది మన ఆచారం. అదే నేను చేశాను. నచ్చిన దైవాన్ని ప్రార్థించే హక్కు రాజ్యాంగమే మనకు కల్పించింది. ఈ విషయంలో ఎవరి విమర్శలు పట్టించుకోను’ అని స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమనాలు కొనుగోలు చేస్తోన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2021నాటికి ఫ్రాన్స్ 18 రఫేల్ యుద్ధ విమానాలను భారతకు అందజేస్తుంది. మే 2022 నాటికి దేశం మొత్తం మీద 36 రఫేల్ జెట్లు ఉండబోతున్నాయి. (చదవండి: ‘ఏ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదు’) -
స్కూల్లో ఆయుధ పూజ : కాల్పులతో హోరెత్తించారు
భోపాల్ : దసరా వేడుకల్లో భాగంగా ఆయుధ పూజను పురస్కరించకుని గ్వాలియర్ స్కూల్లో ఏడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటనలో 150 మంది వీహెచ్‌పీ, బజరంగ్దళ్ కార్యకర్తలపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 8న మంగళవారం దసరా నేపథ్యంలో ఏటా నిర్వహించే ఆయుధ పూజలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్‌లో శాస్త్ర పూజ కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్‌పీ, బజరంగ్దళ్ కార్యకర్తలు చేపట్టిన ప్రదర్శన ముగిసిన వెంటనే స్కూల్లోకి చొరబడిన కార్యకర్తలు గన్స్ నుంచి కాల్పులు జరిపారని సమాచారం. పోలీసులు వారించినా కార్యకర్తలు ఫైరింగ్‌ను కొనసాగించారని, ఏడు రౌండ్ల బుల్లెట్లను కాల్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే కార్యకర్తలు ఫైరింగ్ జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఆయుధపూజ చేసిన మోడీ
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. దసరా సందర్భంగా పోలీసులు, భద్రతా సిబ్బందితో కలిసి 'ఆయుధ పూజ' చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దసరా నవరాత్రులు తొమ్మిది రోజులూ మోడీ ఉపవాసం ఉన్నారు. అనంతరం తన ఇంట్లో విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓప్రకటనలో తెలిపింది. ఆయుధ పూజ ఫొటోలు, వీడియోలను మోడీ తన అధికారిక వెబ్సైట్లో కూడా పోస్ట్ చేశారు. కత్తులకు స్వయంగా బొట్లు పెట్టి, తుపాకులను దుర్గాదేవి చిత్రపటం వద్ద ఉంచి, వాటికి మోడీ పూజ చేశారు. అలాగే, ట్విట్టర్లో కూడా మోడీ దసరా శుభాకాంక్షలు అందజేశారు. తమ రాష్ట్ర పోలీసులు, భద్రతా సిబ్బందితో కలిసి ఆయుధ పూజ చేశానని చెప్పారు.