షీలా ఫోమ్ చేతికి కర్లాన్
న్యూఢిల్లీ: స్లీప్‌వెల్ పేరిట మ్యాట్రెస్‌లను తయారు చేసే షీలా ఫోమ్ తాజాగా కర్లాన్ ఎంటర్‌ప్రైజెస్‌లో 94.66% వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.2,035 కోట్లు వెచి్చంచనుంది. అలాగే, ఆన్లైన్ ఫరి్నచర్ బ్రాండ్ ఫర్లెంకో మాతృ సంస్థ హౌస్ ఆఫ్ కిరాయా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 300 కోట్లతో 35% వాటాలు కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన రెండు ప్రతిపాదనలకు జూలై 17న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు షీలా ఫోమ్ తెలిపింది. ‘రూ. 2,150 కోట్ల ఈక్విటీ వేల్యుయేషన్‌తో కేఈఎల్ (కర్లాన్ ఎంటర్ప్రైజెస్)లో 94.66% వాటాను కొనుగోలు చేయబోతున్నాం‘ అని వెల్లడించింది. మ్యాట్రెస్లు, ఫోమ్ ఆధారిత ఉత్పత్తుల విభాగంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని షీలా ఫోమ్ తెలిపింది.
కేఈఎల్లో 94.66% వాటా కొనుగోలు వ్యయం రూ.2,035 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. దేశీయంగా ఆధునిక మ్యాట్రెస్‌ల విభాగంలో రెండింటి సంయుక్త మార్కెట్ వాటా దాదాపు 21 శాతంగా ఉంటుందని వివరించింది. దక్షిణాదికి చెందిన బిజినెస్ గ్రూప్ పాయ్ కుటుంబం 1962లో కర్ణాటక కాయిర్ ప్రోడక్ట్స్ (ప్రస్తుతం కేఈఎల్)ను ఏర్పాటు చేసింది. 1995లో దాని పేరు కర్లాన్ అని మారగా 2011లో కేఈఎల్ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటైంది. అటు పైన 2014లో వ్యాపారం కేఈఎల్కు బదిలీ అయింది. కంపెనీ ప్రస్తుతం ప్రధానంగా కర్లాన్ బ్రాండ్ కింద ఫోమ్, కాయిర్ ఆధారిత మ్యాట్రెస్లు మొదలైనవి తయారు చేస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.809 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. ఫరి్నచర్ రెంటల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఫర్లెంకోలో పెట్టుబడులు ఉపయోగపడగలవని షీలా ఫోమ్ వివరించింది.