యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు కొత్త అధ్యక్షుడిగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని శనివారం అక్కడి మీడియా అధికారికంగా ప్రకటించింది.
అనారోగ్య సమస్యలతో యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ఇప్పుడు అధికారికంగా యూఏఈ అధ్యక్షుడిగా ప్రకటించారు.
షేక్ ఖలీఫా పదవిలో ఉన్నప్పటికీ ఆయన అనారోగ్యం కారణంగా.. చాలా ఏళ్ల నుంచి షేక్ మొహమ్మద్ బిన్నే పాలన వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. షేక్ ఖలీఫా మరణంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.
షేక్ మొహమ్మద్‌ను ఎంబీజీగా వ్యవహరిస్తుంటారు. అధ్యక్ష ప్రకటన నేపథ్యంలో.. UAE యొక్క ఏడు ఎమిరేట్స్ పాలకులతో కూడిన ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సభ్యులను కలుసుకున్నారాయన.
ఎన్నో మార్పులు..
ఎడారి సంప్రదాయ దేశం యూఏఈ గడ్డ మీద ఎన్నో సంస్కరణలకు తాత్కాలిక అధ్యక్షుడి హోదాలోనే షేక్ మొహమ్మద్ కారణం అయ్యారు. అంతరిక్షంలోకి యూఏఈ పౌరుడ్ని పంపడం, మార్స్ పరిశోధనలో భాగం కావడం, మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్‌ను ప్రారంభించడం, విదేశాంగ విధానాలను మెరుగు పర్చడం లాంటి ఎన్నో పనులు చేశారు. అమెరికా జోక్యాన్ని తగ్గించడం, ఇజ్రాయెల్‌తో సంబంధాలు, యెమెన్ యుద్ధంలో పాల్గొనడం లాంటి కీలక పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి కూడా.
చదవండి👉🏼: యూఏఈ అధ్యక్షుడి కన్నుమూత!