మోదీపై భగ్గుమన్న మహిళాలోకం
న్యూఢిల్లీ: మహిళాలోకం ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రధానమంత్రి షేక్ హసీనాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనకు ఈ చిక్కులు తెచ్చిపెట్టాయి. మోదీ ఢాకా యూనివర్సిటీలో ఆదివారం ప్రసంగించారు.
ఆ సందర్భంగా ప్రధాని షేక్ హసీనాపై ప్రశంసలు కురిపిస్తూనే.. ఆమె ఒక మహిళై ఉండి కూడా దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారని, అలుపెరగకుండా ఆమె చేస్తున్నీ ఈ ప్రయత్నం గొప్ప ముందడుగని చెప్పారు. దీంతో మహిళలైతే ఉగ్రవాదాన్ని రూపుమాపలేరా అంటూ ట్విట్టర్లో పలువురు ప్రశ్నలు గుప్పించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు లింగ వివక్షను ప్రదర్శించేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. మోదీ లింగ వివక్షను ప్రదర్శించే వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా ట్వీట్ చేశారు. మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో మోదీ వ్యాఖ్యలను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.