టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
శింగనమల : టీడీపీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. మొన్నటికి మొన్న నియోజకవర్గంలో మండల కన్వీనర్ల ఎంపిక ప్రక్రియలో అసంతృప్తి జ్వాలలు రేగగా.. తాజాగా శింగనమల మండలంలో ఆ పార్టీ ఎంపీటీసీలే అడ్డం తిరిగారు. తమకు నిధులు ఇవ్వడం లేదంటూ ఎంపీపీపై ఎంపీటీసీలు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఎంపీటీసీలుగా గెలిచి మూడేళ్లు అవుతున్నా కనీసం గ్రామాల్లో మండల పరిషత్ నిధులతో ఒక్క పనికూడా చేయలేకపోతున్నామని వారు వాపోయారు. ఎంపీపీ అమృత మాకొద్దంటూ తెగేసి చెప్పారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వారు స్పష్టం చేశారు. మండలానికి టీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ, జనరల్ ఫండ్ కింద దాదాపు రూ.1.50 కోట్ల వరకు నిధులు వచ్చినా.. ఎంపీటీసీలందరికీ సమానంగా కేటాయించకుండా ఎంపీపీనే పనులన్నీ చేసుకుంటున్నారనీ ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి టీడీపీలో రేగిన చిచ్చు ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.