ఈ తాతయ్య దీక్షకు ఫుల్ మార్క్స్!
ఇది రాజస్థాన్‌కు చెందిన ఓ తాత ఫెయిల్యూర్ స్టోరీ. అల్వార్ జిల్లాకు చెందిన శివచరణ్ యాదవ్ అనే 81 ఏళ్ల తాత 46వ సారి పదోతరగతి పరీక్షలు రాసి ఫెయిలయ్యాడు. ఎన్నిసార్లు పరీక్షల్లో పరాజయం ఎదురైనా నిరాశ, నిస్పృహలకు గురికాకుండా ఏనాటికైనా విజయం సాధించి తీరుతాననే తాత నమ్మకాన్ని చూస్తే ముచ్చటేస్తోంది. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసిన ఫలితాలను చూశాక తాత విశ్వాసం మరింత ఇనుమడించింది. ఎందుకంటే 45 సార్లు పదో తరగతి పరీక్షలు రాసి ఒక్క సబ్జెక్టులోనూ పాస్ కాని తాత ఈసారి ఒకే ఒక్క సబ్జెక్టులో పాసయ్యాడు.
గత ఏడాది పరీక్షల్లో సోషల్ సైన్స్ సబ్జెక్టులో తాతకు జీరో మార్కులు రాగా, ఈసారి అందులో 34 మార్కులు వచ్చాయి. పట్టువదలని విక్రమార్కునిలా ఇన్నిసార్లు తాత పరీక్షలు రాయడం వెనక ఓ ఆసక్తికరమైన అంశమూ ఉంది. 'నేను పదో తరగతి పాస్ కాకుండా పెళ్లి చేసుకోనని నా యవ్వనంలో శపథం చేశాను. ఆందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.వృద్ధాప్యం కారణంగా ఇప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం ఎటూ లేదు. కనీసం ఈ వయసులో పదవ తరగతి పాసయ్యానన్న ప్రపంచ రికార్డు నెలకొల్పుదామన్న సంకల్పంతో పరీక్షలు రాస్తున్నాను. ఈసారి పరీక్షలకు ఎంతో కష్టపడి చదివాను. కళ్లు సరిగ్గా కనిపించకపోవడం, ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా వణికే చేతులతో వేగంగా రాయలేక పోవడం వల్ల ఫెయిలయ్యాను. వచ్చే ఏడాది పరీక్షలకు మరింత కఠోరంగా శ్రమిస్తా' అని ఎంతో ఆత్వవిశ్వాసంతో మీడియాకు తెలిపారు.