ప్రభుత్వమే నిర్మిస్తుంది
శివ్డీ-నవాశేవా సీలింకుపై సీఎం చవాన్
సాక్షి, ముంబై: శివ్డీ-నవాశేవా సీలింకు పనులు చేపట్టేందుకు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి కనబర్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. దీంతోపాటు రూ.10 వేల కోట్లతో దక్షిణ ముంబైలోని కోస్టల్ రోడ్డు ప్రాజెక్టును మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్వయంగా చేపట్టనుందని చవాన్ స్పష్టం చేశారు. ముంబై-నవీముంబై ప్రాంతాలను కలిపే శివ్డీ-నవాశేవా సీలింకు ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు పదేళ్ల కిందట ప్రభుత్వం ప్రకటించింది. అందుకు రిలయన్స్ కంపెనీతోపాటు అనేక ప్రైవేటు సంస్థలు టెండర్లు వేశాయి.
కానీ ఆ తర్వాత రద్దు చేసుకున్నాయి. దీంతో పదేళ్లకుపైగా పెండింగులో పడిపోయిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.9,630 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చవాన్ చెప్పారు. ఇదిలావుండగా భావుచా ధక్కా-నెరుల్-రేవస్-మాండ్వా జలరవాణా మార్గాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీడ్కో), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ(ఎమ్మెస్సార్డీసీ), మెరీ టైం బోర్డు సంయుక్త కంపెనీలకు జలరవాణా బాధ్యతలు అప్పగించింది. ఇందులో సిడ్కో 40 శాతం, ఎమ్మెస్సార్డీసీ 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు సమకూర్చనున్నాయి.