లక్ష్యం.. ‘నీటి’మూట!
తాండూరు, న్యూస్‌లైన్: పంటల సాగుకు అనువుగా నీటి వనరులను తీర్చిదిద్దడంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ప్రాజెక్టులు, చెరువుల పనుల పురోగతి కుంటుపడుతోంది. రైతాంగం సాగునీటి కష్టాలను దూరం చేయాలనే సంకల్పంతో కోట్లాది రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులు అర్ధంతరంగా ఆగిపోవడం, కొత్తగా చేపట్టాల్సిన చెరువుల నిర్మాణాలకు మోక్షం కలగపోవడంతో లక్ష ్యం నీరుగారుతోంది. యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ వద్ద సుమారు రూ.5.9కోట్లతో చేపట్టిన శివసాగర్ ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా నిల్చిపోయాయి. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టును మూడేళ్లలో అంటే 2008 సంవత్సరంలోనే పూర్తిచేయాల్సి ఉంది. కానీ నేటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి సేకరించిన 38 ఎకరాలకు సంబంధించి పరిహారం ఊసే లేదు. ఎకరానికి సుమారు రూ.2లక్షల చొప్పున చెల్లించాలని ప్రాథమికంగా అధికారులు నిర్ణయించినా ఇంతవరకూ అతీగతి లేదు. దాంతో కాల్వల నిర్మాణం, ఆరు ఎకరాల అప్రోచ్ రోడ్డు పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం అదనంగా రూ.కోటి పెరిగింది. పాత రేట్ల ప్రకారం పనులు చేయడం సాధ్యం కాదని కాంట్రాక్టర్ స్పష్టం చేశాడు. పెరిగిన అంచనా వ్యయం చెల్లిస్తే కానీ శివసాగర్ ప్రాజెక్టు పనులు మొదలయ్యే అవకాశం లేదు.
ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇక పెద్దేముల్ మండలం నాగులపల్లిలో రూ.2కోట్ల నిధులతో 350 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన కొత్తచెరువు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. భూసేకరణకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన పరిహారం లెక్క తేలకపోవడతో చెరువు నిర్మాణ పనులకు మోక్షం కలగటం లేదు. ఏడాదికి పైగా చెరువు నిర్మాణ పనుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతోంది. ఇదిలా ఉంటే చెరువు కట్ట నిర్మాణం కోసం దాదాపు ఆరు నెలల క్రితం వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఖాతాలో ప్రభుత్వం రూ.68లక్షలు జమచేసింది. చెరువు నిర్మాణానికి సుమారు 40 ఎకరాలను రైతుల నుంచి సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. కానీ ఇంతవరకు భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయంలో స్పష్టత లేదు. దాంతో చెరువు పనులు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతానికి చెరువు వరకు రూ.10లక్షలతో మూడు కి.మీ.మేర అప్రోచ్ రోడ్డు పనులు మొదలైనా ప్రధాన పనుల్లో జాప్యం జరుగుతోంది. అధికారులు ఆయా ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే పూర్తిచేసి సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
పనులు పూర్తిచేసేందుకు కృషి
నాగులపల్లి కొత్తచెరువు, శివసాగర్ ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం నాగులపల్లి చెరువు అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. శివసాగర్ ప్రాజెక్టు కాల్వల నిర్మాణ పనులు కూడా త్వరలో మొదలుపెడతాం. అదనంగా పెరిగిన అంచనా వ్యయం డబ్బుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ప్రాజెక్టు పనులు మొదలవుతాయి.
- నర్సింహ, తాండూరు ఇరిగేషన్ డీఈఈ