దోషిగా తేలిన క్రికెటర్
లండన్: బహిరంగ ప్రదేశాల్లో మహిళల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఇంగ్లండ్ అండర్ -19 మాజీ కెప్టెన్ శివ్ థాకూర్‌ను కోర్టు అపరాధిగా తేల్చింది. కేసు విచారించిన డెర్బీ క్రౌన్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. నవంబర్ 24న అతడికి శిక్ష ఖరారు చేయనుంది.
న్యాయస్థానం అతడికి షరతుల్లేని బెయిల్ మంజూరు చేసింది. కౌంటీ క్రికెట్లో డెర్బీషైర్ తరపున ఆడిన నిందితుడు రెండు సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది జూన్ 12, 19 తేదీల్లో ర్యాడ్ బోర్న్ లేన్, మ్యాక్ వర్త్ ప్రాంతాల్లో ఇద్దరు మహిళల ముందు అభ్యంతకరంగా వ్యవహరించినట్టు ఫిర్యాదులు రావడంతో జులైలో శివ్‌ను అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా బాధితులు ఇచ్చిన సాక్ష్యాలను కోర్టు విశ్వసించింది. శివ్ నేరానికి పాల్పడినట్టు న్యాయస్థానం ధ్రువీకరించింది. కాగా, శివ్ థాకూర్ అరెస్టైన వెంటనే అతడితో డెర్బీషైర్ టీమ్ తెగతెంపులు చేసుకుంది. 2014 -16 మధ్య కాలంలో ఈ యువ క్రికెటర్ డెర్బీషైర్ తరపున ఆడాడు.