shiva prakash
-
హస్తినకు బీజేపీ అభ్యర్థుల జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న బీజేపీ.. అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ అధిష్టానానికి పంపించింది. ఇందుకోసం జాతీయ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ విజయవాడలో శనివారం, ఆదివారాల్లో జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కన్వినర్లు, ముఖ్యనేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ తరఫున పోటీ చేసే నాయకుల పేర్లతో జాబితాలను రూపొందించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురికి తక్కువ కాకుండా పేర్లతో నివేదికను సిద్ధం చేసి ఢిల్లీకి పంపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 9న ఢిల్లీలో భేటీకి అవకాశం లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఏపీ నేతలతో ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆ తరువాతే అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 6న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నట్టు ఊహగాహాలు ఊపందుకున్నాయి. పొత్తులపై జాతీయ నాయకత్వం నేటికీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. పొత్తులో బీజేపీకి కేటాయించే సీట్ల సంఖ్యపై టీడీపీ నేతలకు మీడియాకు లీకులు ఇస్తూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తుల ప్రచారానికి ఊతమిస్తూ.. పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ వచ్చింది. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాష్ట్ర పర్యటకు వచ్చి ఒకే రోజున దాదాపు 15 లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించినా పొత్తులపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా.. రాజ్‌నాథ్ పర్యటన తర్వాత జాతీయ నాయకత్వం సూచన మేరకు శివప్రకాష్ విజయవాడ వచ్చి అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుకు అవకాశాలు ఉండకపోవచ్చనే చర్చ నడుస్తోంది. -
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసంజాతీయ నాయకత్వం సూచనల మేరకు కేంద్ర పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారు. ఆయన శనివారం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమై, ఆ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానం కోసం ముగ్గురు చొప్పున ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను తీసుకున్నారు. ఆ జాబితాలోనూ మొదటి, రెండు, మూడవ ప్రాధాన్యతగా ఏ నేతల పేర్లను ఆయా జిల్లా కమిటీలు సూచిస్తున్నాయో అడిగి తెలుసుకుని మరీ జాబితాను సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా శివప్రకాష్తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌లతో కూడిన కమిటీ విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా పార్టీ నేతలతో ఈ సమావేశాలు నిర్వహించింది. తొలి రోజు రాయలసీమ నాలుగు జిల్లాల పరిధిలోని 8 లోక్‌సభ స్థానాలు, ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని 5 లోక్‌సభ స్థానాలతో పాటు నరసరావుపేటతో కలిపి మొత్తం 14 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 98 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సంబంధించి ముగ్గురు చొప్పున∙ప్రతిపాదిత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిసింది. మిగిలిన 11 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఈ తరహాలోనే ముగ్గురు చొప్పున ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసేందుకు ఆదివారం ఆయా జిల్లాల నాయకులతో సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా, ఈ సమావేశాల్లో పొత్తులకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ చెప్పారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల వ్యవహారం ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. -
బన్సల్‌కే బాధ్యతలన్నీ..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీని చక్కదిద్దేపనిలో భాగంగా అటు రాజకీయ వ్యవహారాలు, ఇటు సంస్థాగత అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఒక్కరికే అప్పగించే దిశలో బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. నలుగురైదుగురు ఇన్చార్జీలు కాకుండా ఒక్కరికే పూర్తిస్థాయి ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికలతో పాటు, యూపీలో పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకుని రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సునీల్ బన్సల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అసంతృప్తిని చల్లార్చే చర్యలేవీ..? తెలంగాణకు ఏకంగా నలుగురైదురు ఇన్చార్జీలను నియమించి వారి ద్వారానే జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి ఎన్నికల దిశానిర్దేశం చేస్తున్న సంగతి విదితమే. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జిగా, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జిగా కొనసాగుతుండగా మరో ఇద్దరు జాతీయ నేతలు శివప్రకాష్, అర్వింద్ మీనన్‌లు కూడా ఇన్చార్జిలుగా ఉన్నారు. వీరంతా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు దాదాపు ఆరేడు నెలలుగా వివిధ కార్యక్రమాలు, పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గత 20, 30 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన సీనియర్లకు సరైన ప్రాధాన్యత, గౌరవం లేదని, వారికి తగిన బాధ్యతలు కూ డా ఇవ్వడం లేదన్నది ప్రధాన విమర్శ. కాగా సొంత ప్రచారానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ నాయకుల్లో అసంతృప్తి వివిధ సందర్భాల్లో బయటపడుతున్నా ఈ సమస్యను అధిగమించే దిశగా ఇన్చార్జిలు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న జాతీయ నాయకత్వం ఒక్కరికే పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కేడర్‌లో స్తబ్ధత తొలిగేలా చర్యలు.. ప్రస్తుతం పార్టీలో పాత, కొత్తనేతల మధ్య సమన్వయలేమి, క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న సమస్యలతో కేడర్‌లోనూ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత స్తబ్ధత కూడా నెలకొంది. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై, ముఖ్య నేతల వ్యవహారశైలి, అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం కావడం, అసమ్మతి కార్యక్రమాలకు తావిచ్చేలా కొందరు వ్యవహరించడం వంటివి క్రమశిక్షణా రాహిత్యంగా జాతీయ నాయకత్వం పరిగణిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థాయి నాయకుల్లో అసంతృప్తిని, ముఖ్యంగా కిందిస్థాయి కేడర్‌లో ఏర్పడిన స్తబ్ధతను తొలగించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. పార్టీ క్రమశిక్షణ గీతను దాటుతున్న వారికి, పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని హెచ్చరించడంతో పాటు ఒకరిద్దరిపై క్రమశిక్షణ చర్యలకు కూడా దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో చేపట్టబోయే చర్యలపై రాష్ట్ర ముఖ్య నేతలకు సంకేతాలు కూడా అందినట్టు తెలుస్తోంది. -
జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తనకు మద్దతుగా బహిరంగ ప్రకటన చేయాలని స్వయంగా మిత్రపక్ష జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను కోరినా ఆయన స్పందించలేదని.. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే పరిస్థితి లేనప్పుడు బీజేపీ–జనసేన కలిసి ఉన్నా లేనట్లే అని శాసనమండలిలో బీజేపీ పక్ష నాయకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. పొత్తులో కొనసాగుతున్నప్పటికీ జనసేన ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపని అంశంపై మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జిల సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో కేంద్ర పార్టీ నుంచి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను మాధవ్‌తో పాటు మరో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం ఉంది. ఇటీవల పవన్ కూడా జనసేన–బీజేపీ పొత్తు ఉంది అన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదన్నది వాస్తవం. నిజంగా పొత్తులో ఉంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజలలో మనం కలిసి వెళ్తుతున్నామన్న మాటకు అర్థం ఉంటుంది. నామ్‌కే వాస్త్‌గా పొత్తుతో ఉపయోగం లేదని మా అందరి అభిప్రాయం’.. అని మాధవ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ పొత్తు కొనసాగాలనే కోరుకుంటున్నాం.. ‘బీజేపీ–జనసేన కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఇప్పటికీ కోరుకుంటోంది. కలిసి పనిచేస్తే ప్రజా మద్దతు రెండు పార్టీలకు ఉంటుంది. ఆయనా (పవన్) నమ్మాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రకటన చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. పోటీలో ఉన్న అభ్యర్థిగా నేనూ అడిగాను. చాలాసార్లు కోరాం. కానీ, ప్రకటన రాలేదు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో పీడీఎఫ్ అభ్యర్థి తమకు జనసేన మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నారని, దానిని ఖండించమని కోరినా ఖండించలేదు’.. అని మాధవ్ చెప్పారు. కలిసి పనిచేసే విషయంలో బీజేపీ నుంచే స్పందనలేదని పవన్‌కళ్యాణ్ అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన వైపు నుంచే స్పందనలేదు’ అని బదులిచ్చారు. అందుకే సొంతంగా ఎదగాలనినిర్ణయించుకున్నాం.. ‘జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం నేపథ్యంలో పార్టీ తనంతట తాను ఎదిగేలా అన్ని ఏర్పాట్లుచేసుకోవాలని అనుకున్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్ 1–14 వరకు బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం చేస్తున్నాం. మే ఒకటి తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు వేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఏదైనా పొత్తు నిర్ణయం ఉంటే కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది’ అని మాధవ్ చెప్పారు. -
బైక్‌పై వస్తుంటే ఉరితాడైన మాంజాదారం
అన్నానగర్: గాలిపటానికి కట్టే మాంజాదారం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలుకోల్పోయాడు. బైక్‌పై వెళుతున్న అతడికి తగిలి కిందపడటంతో చనిపోయాడు. చెన్నైలోని తాంబరం మధురవాయల్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నై కొళత్తూరుకి చెందిన శివప్రకాశ్ (40) నీలాంగరైలోని ప్రైవేటు సంస్థలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శివప్రకాశ్ తన తండ్రితో కలసి అగరమ్ తెన్ గ్రామానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా అనకాపుత్తూరు అడయారు బ్రిడ్జి వద్ద గాలిపటాల మంజా దారం తగిలి కింద పడ్డారు. శివప్రకాశ్కు గొంతుకు మాంజాదారం చుట్టుకుపోయి ఊపిరిఆడకపోవడంతోపాటు తీవ్ర గాయాలు అవడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తండ్రి చంద్రశేఖర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న శంకర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని శివప్రకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఎందుకు ఎదగలేకపోతున్నారు?
- రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం దూత శివప్రకాశ్ ప్రశ్న.. -13 ఎంపీ సీట్లపై దృష్టి సారించాలని కోర్ కమిటీ భేటీలో సూచన - 75 అసెంబ్లీ సీట్లలో గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదిగేందుకు అన్ని అవకాశాలున్నా ఆ దిశలో ఎందుకు ఎదగలేకపోతున్నారని రాష్ర్ట పార్టీ నేతలను బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కోర్‌కమిటీతో సమావేశమైన సందర్భంగా పార్టీ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఉద్యమ కార్యాచరణను రూపొం దించుకోవాలని శివప్రకాశ్ ఆదేశించారు. మరో రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండగా రాష్ట్ర పార్టీలో ఆ చురుకుదనం లోపించడం, పార్టీ కార్యక్రమాల్లో వేగం లేకపోవడంపై నిలదీసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ పూరించేందుకు స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో 13 ఎంపీ సీట్లపై దృష్టి కేంద్రీకరించాలని, వాటిలో కొన్ని సీట్లనైనా కచ్చితంగా గెలిచేలా చూడాలని సూచించారు. రాష్ర్టంలో 75 అసెంబ్లీ సీట్లను గెలిచేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రపార్టీ 2019 ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కొన్ని తగ్గినా ఆ లోటును కొంతమేర తెలంగాణ నుంచి భర్తీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రం లో పార్టీని బూత్‌స్థాయి నుంచి పటిష్టం చేయాలని, రైతాంగ సమస్యలపై అధిక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్, ఎన్.రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ పాల్గొనగా, ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు హాజరుకాలేదు. జాతీయపార్టీ చెప్పినట్లు నడవకపోతే ముప్పే! తన మూడు రోజుల పర్యటనలో రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీకి సానుకూల పరిస్థితులున్న విషయాన్ని గమనించినట్లు శివప్రకాశ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర నాయకులు తమకు అనుకూలంగా మలచుకునేందుకు కృషి చేయకపోతే ఎలా అని ప్రశ్నిం చారు. జాతీయ నాయకత్వం దిశానిర్దేశం ప్రకారం రాష్ట్ర నాయకులు వ్యవహరించకపోతే లోక్‌సభ నియోజకవర్గాలవారీగా జాతీయపార్టీ ఫుల్‌టైమర్లు రంగంలోకి దిగి పనిని చక్కబెట్టాల్సి ఉంటుందని ఆయన పరోక్ష హెచ్చరికలు జారీచేసినట్లు తెలుస్తోంది. తన పద్ధతిలో జాతీయ నాయకత్వం ఆదేశాలను, సూచనలను రాష్ట్ర నాయకులకు విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఇతర సెల్లు ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావాలని సూచించారు. త్వరలో రాష్ర్ట కమిటీ ప్రకటన రైతుల సమస్యలపై జిల్లాస్థాయిలో కార్యక్రమాలను ఖరారు చేసుకోవాలని కోర్‌కమిటీ సమావేశం నిర్ణయించింది. పార్టీ పరిశీల కుడు శివప్రకాశ్ రాకకు ముందు జరిగిన ఈ సమావేశంలో ముందుగా రాష్ట్ర కమిటీని త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 10, 15 రోజుల్లో కొత్త జిల్లాల కమిటీలను ప్రకటించి పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని తీర్మానించారు.