సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీని చక్కదిద్దేపనిలో భాగంగా అటు రాజకీయ వ్యవహారాలు, ఇటు సంస్థాగత అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఒక్కరికే అప్పగించే దిశలో బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
నలుగురైదుగురు ఇన్‌చార్జీలు కాకుండా ఒక్కరికే పూర్తిస్థాయి ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికలతో పాటు, యూపీలో పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకుని రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సునీల్ బన్సల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
అసంతృప్తిని చల్లార్చే చర్యలేవీ..?
తెలంగాణకు ఏకంగా నలుగురైదురు ఇన్‌చార్జీలను నియమించి వారి ద్వారానే జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి ఎన్నికల దిశానిర్దేశం చేస్తున్న సంగతి విదితమే. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జిగా, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జిగా కొనసాగుతుండగా మరో ఇద్దరు జాతీయ నేతలు శివప్రకాష్, అర్వింద్ మీనన్‌లు కూడా ఇన్‌చార్జిలుగా ఉన్నారు.
వీరంతా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు దాదాపు ఆరేడు నెలలుగా వివిధ కార్యక్రమాలు, పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గత 20, 30 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన సీనియర్లకు సరైన ప్రాధాన్యత, గౌరవం లేదని, వారికి తగిన బాధ్యతలు కూ డా ఇవ్వడం లేదన్నది ప్రధాన విమర్శ. కాగా సొంత ప్రచారానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పార్టీ నాయకుల్లో అసంతృప్తి వివిధ సందర్భాల్లో బయటపడుతున్నా ఈ సమస్యను అధిగమించే దిశగా ఇన్‌చార్జిలు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న జాతీయ నాయకత్వం ఒక్కరికే పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
కేడర్‌లో స్తబ్ధత తొలిగేలా చర్యలు..
ప్రస్తుతం పార్టీలో పాత, కొత్తనేతల మధ్య సమన్వయలేమి, క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న సమస్యలతో కేడర్‌లోనూ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత స్తబ్ధత కూడా నెలకొంది. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై, ముఖ్య నేతల వ్యవహారశైలి, అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం కావడం, అసమ్మతి కార్యక్రమాలకు తావిచ్చేలా కొందరు వ్యవహరించడం వంటివి క్రమశిక్షణా రాహిత్యంగా జాతీయ నాయకత్వం పరిగణిస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థాయి నాయకుల్లో అసంతృప్తిని, ముఖ్యంగా కిందిస్థాయి కేడర్‌లో ఏర్పడిన స్తబ్ధతను తొలగించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. పార్టీ క్రమశిక్షణ గీతను దాటుతున్న వారికి, పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని హెచ్చరించడంతో పాటు ఒకరిద్దరిపై క్రమశిక్షణ చర్యలకు కూడా దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో చేపట్టబోయే చర్యలపై రాష్ట్ర ముఖ్య నేతలకు సంకేతాలు కూడా అందినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment