25 లోక్‌సభ స్థానాలకు ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున ఎంపిక
175 అసెంబ్లీ స్థానాలకు మూడేసి పేర్లతో అధిష్టానానికి నివేదిక
శివప్రకాష్ నేతృత్వంలో జిల్లాల వారీగా పూర్తయిన భేటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న బీజేపీ.. అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ అధిష్టానానికి పంపించింది. ఇందుకోసం జాతీయ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ విజయవాడలో శనివారం, ఆదివారాల్లో జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కన్వినర్లు, ముఖ్యనేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ తరఫున పోటీ చేసే నాయకుల పేర్లతో జాబితాలను రూపొందించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురికి తక్కువ కాకుండా పేర్లతో నివేదికను సిద్ధం చేసి ఢిల్లీకి పంపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
9న ఢిల్లీలో భేటీకి అవకాశం
లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఏపీ నేతలతో ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆ తరువాతే అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 6న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నట్టు ఊహగాహాలు ఊపందుకున్నాయి.
పొత్తులపై జాతీయ నాయకత్వం నేటికీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. పొత్తులో బీజేపీకి కేటాయించే సీట్ల సంఖ్యపై టీడీపీ నేతలకు మీడియాకు లీకులు ఇస్తూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తుల ప్రచారానికి ఊతమిస్తూ.. పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ వచ్చింది.
తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాష్ట్ర పర్యటకు వచ్చి ఒకే రోజున దాదాపు 15 లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించినా పొత్తులపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా.. రాజ్‌నాథ్ పర్యటన తర్వాత జాతీయ నాయకత్వం సూచన మేరకు శివప్రకాష్ విజయవాడ వచ్చి అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుకు అవకాశాలు ఉండకపోవచ్చనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment